Foot soaks: నీళ్లలో ఇవి కలిపి పాదాలుంచితే.. తక్షణమే నొప్పులు, ఒత్తిడి మాయం..-best foot soaks for beautiful softer feet and pain relief ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foot Soaks: నీళ్లలో ఇవి కలిపి పాదాలుంచితే.. తక్షణమే నొప్పులు, ఒత్తిడి మాయం..

Foot soaks: నీళ్లలో ఇవి కలిపి పాదాలుంచితే.. తక్షణమే నొప్పులు, ఒత్తిడి మాయం..

Koutik Pranaya Sree HT Telugu
Jul 08, 2024 09:30 AM IST

foot soaks: పాదాలను గోరువెచ్చని కాళ్లలో కాసేపు ఉంచితేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. వివిధ ప్రయోజనాల కోసం రకరకాలు ఫూట్ సోక్స్ ఎలా ప్రయత్నించాలో చూడండి.

ఫూట్ సోక్స్
ఫూట్ సోక్స్ (freepik)

రోజంతా అలసిన పాదాలకు కాసేపయినా సాంత్వన కావాల్సిందే. మృతకణాలు తొలగించడానికి, పాదాల నొప్పులు తగ్గించడానికి, మృదువైన చర్మానికి.. ఇలా రకరకాల అవసరాలకు ఫూట్ సోక్స్ తయారు చేసుకోవచ్చు. అంటే ఒక టబ్ లో నీల్లు పోసి అందులో పాదాలు పెట్టడం. ఆ నీటిలో ప్రయోజనాల్ని బట్టి పదార్థాలు మార్చి వేస్తాం. దీనివల్ల పార్లర్ లో మంచి మసాజ్ చేయించుకున్న అనుభూతి దొరుకుతుంది.

ఫూట్ సోకింగ్ లాభాలు?

పాదాలను నీళ్లలో మునిగేలా ఉంచడం వల్ల కండరాల నొప్పులు, ఒత్తిడి తగ్గుతాయి, పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి. సాయంత్రం పూట ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిద్ర కూడా హాయిగా పడుతుంది. వయసు పైబడిన వాళ్లలో ఈ బాత్ టబ్ సోకింగ్ కోసం వాడే ఎసెన్షియల నూనెల వాసన వల్ల బీపీ తగ్గుతుంది. అరోమా థెరపీ లాగా ఇది పనిచేస్తుంది.

మీ అవసరాన్ని బట్టి వీటిని కస్టమైజ్ చేసుకోండి. పాదాలు ఉంచే నీళ్లలో మీకు సమస్య ప్రకారం వివిధ పదార్థాలు వేయొచ్చు. అలాంటి ఫూట్ సోక్స్ ఒకసారి చూడండి.

ఈ ఫూట్ సోక్స్ ప్రయత్నించండి:

1. పాదాల నొప్పులకు:

సగం కప్పు ఎప్సం లవణం, పది చుక్కలు ఏదైనా ఎసెన్షియల్ నూనె (పెప్పర్ మింట్, ల్యావెండర్, రోజ్ మేరీ..), 6 చెంచాల కొబ్బరి లేదా ఆలివ్ నూనె తీసుకోవాలి. ఇప్పుడు ఒక టబ్ లో వేడి నీళ్లు పోసుకుని నూనెలు, లవణం కలిపేయాలి. అందులో కనీసం పావుగంట సేపు పాదాలు ఉంచాలి. తర్వాత మీకిష్టమైన మాయిశ్చరైజర్ రాసుకోండి. నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుంది.

2. మృతకణాలు తొలగించడం కోసం:

3 తాజా నిమ్మకాయలు, 2 కప్పుల వెనిగర్, 3 కప్పుల ఎప్సం లవణం తీసుకోవాలి. వీటిని టబ్ నీటిలో కలిపేయాలి. నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండిన తర్వాత తొక్కలతో పాదాలకు మర్దనా చేయాలి. కాస్త ఉప్పును కూడా పాదాలకు ముందుగానే స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత పాదాలను టబ్ లో ముంచాలి. ప్యూమిస్ స్టోన్ తో ఇష్టముంటే కాసేపు స్క్రబ్ చేసుకోవాలి. పదాలను పది నిమిషాలు ఉంచి తుడిచేస్తే సరి. మృతకణాలు తొలిగిపోతాయి.

3. పొడి చర్మం సమస్య ఉంటే..

1 కప్పు తేనె, 1 కప్పు సీ సాల్ట్, కప్పు కొబ్బరి పాలు, చెంచా దాల్చిన చెక్క పొడి, రోజ్ మేరీ ఎసెన్షియల్ తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో కొన్ని వేడి నీళ్లు తీసుకుని పైన చెప్పిన పదార్థాలు కలిపేసుకోవాలి. ఇప్పుడు టబ్ నీళ్లలో ఈ మిశ్రమాన్ని కలిపేయాలి. పావుగంట సేపు పాదాలు ఉంచి తర్వాత కడిగేసుకుంటే పాదాలకు తేమ దొరుకుతుంది.

4. మృదువైన చర్మం కోసం:

సగం కప్పు కొబ్బరి పాలు, 2 చెంచాల కలబంద, నీలగిరి నూనె, ఆలివ్ నూనె టబ్ గోరువెచ్చని నీళ్లలో వేయాలి. అరగంటసేపు పాదాలు ఉంచి తర్వాత కడిగేసుకుంటే చాలు. పాదాల ఆరోగ్యం బాగుంటుంది.

5. పాదాల దుర్వాసన కోసం:

1 కప్పు వెనిగర్, గోరు వెచ్చని నీళ్లుంటే చాలు. ఈ సమస్య తగ్గించుకోవచ్చు. టబ్ వేడి నీళ్లలో వెనిగర్ కలిపి అందులో పావుగంట సేపు పాదాలు మునిగేలా ఉంచాలి. తర్వాత బాగా తుడిచేసుకుంటే చాలు. క్రమంగా పాదాల నుంచి దుర్వాసన రావడం తగ్గుతుంది.

 

Whats_app_banner