Bedtime Routine: సాయంత్రం 6 నుంచి 10 దాకా ఇలా చేస్తే.. పడక మీద వాలగానే నిద్రలోకి జారుకుంటారు..
Bedtime Routine: బెడ్ లో పడుకోగానే నిద్ర పట్టాలంటే దానికన్నా కొన్ని గంటల ముందునుంచి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అదెలాగో చూసేయండి.
ఇటీవల కాలంలో జనాల్లో నిద్ర లేమి సమస్యలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. బెడ్ మీద గంటల గంటలు పడుకోవడానికి ప్రయత్నించినా నిద్ర పట్టని పరిస్థితి. ఇలాంటి వారు సాయంత్రం నుంచి పడకపై చేరేంత వరకు కొన్నింటిని రొటీన్‌లా అలవాటు చేసుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిద్ర లేమి సమస్యలతో బాధ పడుతున్న వారంతా బెడ్ టైం రొటీన్‌ని పాటించమని సిఫార్సు చేస్తున్నారు. అందువల్ల సుఖంగా నిద్ర పడుతుందని అంటున్నారు. సాయంత్రం నుంచి గంట గంటకూ మీరేం చేయాలో చెబుతున్నారు. అదెలాగో చూసేద్దాం రండి.
సాయంత్రం 6 గంటలు :
సాయంత్రం ఆరు గంటల సమయం అయిన తర్వాత మీ ఇంట్లో ఎక్కువ కాంతులు చిమ్ముతున్న లైట్లను డిమ్ చేయండి. వెలుతురు తగ్గిండం వల్ల శరీరానికి ఇక నిద్ర పోవడానికి సమయం అవుతోంది అనే సంజ్ఞను ఇచ్చినట్లు అవుతుంది. అందుకు దానంతట అది సిద్ధం కావడం మొదలు పెడుతుంది. ఈ సమయంలోనే తేలికపాటి భోజనం చేయండి. ఎక్కువగా తినకండి.
రాత్రి 7 గంటలు :
తేలికపాటి స్ట్రెచ్చింగ్ ఎక్సర్‌సైజులు చేయండి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి. తర్వాత మంచి మంచి పుస్తకాలు చదవడం లాంటివి చేయండి. కంప్యూటర్లు, ఫోన్లు, టీవీల్లాంటి స్క్రీన్లకు దూరంగా ఉండండి. ఇలా చేయడం వల్ల మెదడు నెమ్మది నెమ్మదిగా నిద్రపోవడానికి ట్యూన్ అవుతుంది.
రాత్రి 8 గంటలు :
మీ పడక గదిని నిద్రకు అనువుగా సిద్ధం చేసుకోండి. దుప్పట్లు, తలగడలను చక్కగా దులిపి శుభ్రంగా వేసుకోండి. బెడ్ రూంలో చిన్న డిమ్ లైట్లను మాత్రమే వాడుకోండి. అందువల్ల వాతావరణం కాస్త స్లీపీగా మారుతుంది. అలాగే దోమలు లేకుండా చూసుకోండి. ఏసీ టెంపరేచర్‌ని సెట్ చేసుకుని గదిని చల్లబరుచుకోండి. అదే మీరు చలి వాతావరణంలో ఉండే వారైతే అందుకు తగ్గట్లుగా గది ఉష్ణోగ్రతల్ని మార్చుకోండి.
రాత్రి 9 గంటలు :
ఇక ఎలక్ట్రిక్ డివైజ్‌ల జోలికి అస్సలు వెళ్లకండి. బ్లూలైట్ ఎక్స్‌పోజర్‌కి గురి కాకండి. ప్రశాంతమైన మ్యూజిక్ వినడం, మెడిటేషన్ చేయడం లాంటివి చేయండి. కెఫీన్, ఆల్కహాల్‌లను తీసుకోకండి. ఇవి ప్రశాంతమైన నిద్రను చెడగొడతాయి.
రాత్రి 10 గంటలు :
మీ స్కిన్ కేర్ రొటీన్ ఏమైనా ఉంటే చేసేసుకోండి. పళ్లు తోముకోండి. బ్రీథింగ్ ఎక్సర్‌సైజులు ఏమైనా ఉంటే ప్రయత్నించండి. బెడ్ రూంలో లైట్లన్నీ ఆపేసి పూర్తిగా చీకటిగా ఉండేలా చేసుకోండి. సౌకర్యవంతంగా ఉన్న బెడ్ మీద వాలిపోండి. ఇంకా నిద్ర రావట్లేదు అనుకుంటే స్లీప్ మెడిటేషన్, నేచర్ సౌండ్స్ వినడం లాంటివి చేయండి. వీటి వల్ల మీరు తేలికగా నిద్రలోకి జారిపోతారు.