Food Allergy: ఈ నెలల్లో పుట్టిన పిల్లలకు ఫుడ్ అలెర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ, ఎందుకో తెలుసుకోండి
Food Allergy: పిల్లల్లో ఆహార అలెర్జీలు ఎక్కువగానే కనిపిస్తాయి. పొట్ట తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాంతులు, విరేచనాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొన్ని నెలల్లో పుట్టిన పిల్లలకే ఇలా ఆహార అలర్జీల ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.
Food Allergy: పిల్లల్లో ఆహార అలర్జీలు పెరుగుతూ వస్తున్నాయి. చాలామంది పిల్లలకు తరచూ ఆహారం తిన్నాక వాంతులు, విరేచనాలు వంటివి అవుతూ ఉంటాయి. దీనికి కారణం ఆహార అలెర్జీలే. దీనికి కాలానుగుణమైన, పర్యావరణ కారకాలు కూడా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. కొత్తగా చేసిన ఒక అధ్యయనంలో చలికాలంలో జన్మించిన పిల్లలకు ఆహార అలెర్జీల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మన దేశంలో చలికాలం అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ నెలల్లో చలి ఎక్కువగా ఉంటుంది.
చలికాలంలో పుట్టిన పిల్లలకు ఆహార అలెర్జీలు ఎందుకు వస్తాయో వివరిస్తున్నారు వైద్యులు.
కారణాలు ఇవే
చలికాలంలో జన్మించే పిల్లలకు సూర్యరశ్మి తక్కువగా తగులుతుంది. చిన్నప్పటి నుంచే వారికి విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. వీరిలో ప్రమాదకరమైన సమ్మేళనాలు, సురక్షితమైన ఆహార ప్రోటీన్ల మధ్య తేడాను గుర్తించే శరీర సామర్థ్యం కూడా తగ్గిపోతుంది.ఇదే ఆహార అలెర్జీలకు కారణం అవుతుంది.
పొట్టలోని బ్యాక్టీరియా
బలమైన రోగనిరోధక వ్యవస్థ ఇలాంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. కానీ చలికాలంలో జన్మించిన పిల్లలకు గట్ మైక్రోబయోమ్ తీవ్రంగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియాలో సమతుల్యత తగ్గుతుంది. ఇది కూడా ఆహార అలెర్జీలకు కారణం అవుతుంది.
చలికాలంలో పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లలను ఎక్కువగా ఇంటిలోపలే ఉంచుతారు. దీని వల్ల ఇంట్లో ఉన్నా దుమ్ము, ధూళి, పురుగులు, పెంపుడు జంతువుల వెంట్రుకలు కూడా అలెర్జీ కారకాలుగా మారుతాయి. అందుకే ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎలాంటి పెంపుడు జంతువులను ఉంచుకోకూడదు. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రపరచుకోవాలి.
చలికాలం తర్వాత వసంత రుతువు మొదలైపోతుంది. వసంత రుతువుల్లో పూల నుంచి వచ్చే పుప్పొడి అధికంగా వాతావరణంలో చేరుతుంది. దీనివల్ల కూడా ఆ కాలంలో పుట్టిన పిల్లలకు ఇబ్బంది ఎదురవుతుంది. పుప్పొడి అలెర్జీ కారకంగా మారుతుంది. ఇది ఆహార అలెర్జీలకు కారణం అవుతుంది.
చలికాలంలో పుట్టిన పిల్లలను ఇలా రక్షించుకోండి
చలికాలంలో పుట్టిన పిల్లలను నిత్యం ఇంట్లోనే ఉంచకండి. విటమిన్ డి తగిలేలా కాసేపు ఎండలో శిశువులను ఎత్తుకొని నిలుచోండి. శిశువులకు విటమిన్ డి, సప్లిమెంట్లు, సిరప్‌లు ఇస్తారు. అవి వేస్తున్నా కూడా రోజులో సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
తల్లిపాలను పిల్లలకు త్వరగా మానిపించకండి. చలికాలంలో పుట్టిన పిల్లలకు రోగ నిరోధక శక్తి బలంగా మారాలంటే ఎక్కువ కాలం పాటు తల్లిపాలను ఇవ్వాలి. తల్లి ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పెరుగు వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. ఆమె పెరుగును తిన్నాక పిల్లలకు పాలు ఇస్తే ప్రోబయోటిక్స్ శరీరంలో చేరుతాయి.
చలికాలంలో పుట్టిన పిల్లలకు ఏ ఆహారాన్నైనా కొత్తగా పరిచయం చేస్తున్నప్పుడు ముందు చాలా కొద్ది మొత్తంలోనే పెట్టాలి. అది తిన్నాక వారిలో ఎలాంటి రియాక్షన్ కనిపిస్తుందో గమనించాలి. వాపు, దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఎదురైతే వెంటనే వైద్యులకు చూపించాలి. చిన్నపిల్లల ఇంట్లో తరచూగా వ్యాక్యూమ్ చేస్తూ ఉంటుంది. దుమ్ము, పురుగులు, ఇతర అలెర్జీ కారకాలను తొలగించడానికి వీలవుతుంది. అలాగే తగిన వెంటిలేషన్ కూడా ఉండాలి. కిటికీలు, తలుపులు అన్నీ వేసి పిల్లలను పెంచడం మంచిది కాదు. తగినంత వెలుతురు, గాలి పిల్లలకు అందేలా చూసుకోండి.