First Periods: మీ ఇంట్లోని ఆడపిల్లలతో పీరియడ్స్ గురించి ఏ వయసులో చెప్పాలి? ఎలా వివరించాలి?
First Periods: ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్ల ఉంటుంది. ఆ ఆడపిల్లకు పీరియడ్స్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదే. అసౌకర్యంగా అనిపించకుండా వారితో పీరియడ్స్ గురించి ఎలా వివరించాలో తెలుసుకోండి.
First Periods: పీరియడ్స్ గురించి మాట్లాడేందుకు మహిళలు ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతారు. కానీ తల్లిగా తన కూతురికి పీరియడ్స్ గురించి వివరించాల్సిన బాధ్యత మాత్రం ఆమెదే. ఒక వయసుకు వచ్చాక ఆడపిల్లలకు పీరియడ్స్ గురించి అన్ని విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతో ముఖ్యమైనది కూడా. దీన్ని చాలా మంది తల్లులు అసౌకర్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా అసౌకర్యంగా భావించకుండా మీ పిల్లల కోసం మీరు ఈ పని చేయాలి. ఇందుకోసం ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. వారితో సంభాషణను ప్రారంభించేముందు ఋతుస్రావం గురించి పూర్తిగా అవగాహన చేసుకోండి. వారికి సులువైన పద్ధతిలో నెలసరి గురించి వివరించేందుకు ప్రయత్నించండి.
ఏ వయసులో చెప్పాలి?
ఒకప్పుడు 13 ఏళ్లు దాటాకే ఎక్కువగా ఆడపిల్లలకి నెలసరి మొదలయ్యేది. కానీ ఇప్పుడు ఆహారంలో మార్పులు, వాతావరణంలో మార్పుల వల్ల పదేళ్లు దాటగానే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి మీ ఇంట్లోని ఆడపిల్లలకు ఎనిమిదేళ్లు దాటగానే పీరియడ్స్ గురించి చెప్పేందుకు సిద్ధం అవ్వండి. వారికి అర్థమయ్యే తీరులో రుతుస్రావం గురించి వివరించండి.
ఆడపిల్లలకు ముందుగానే ఈ నెలసరుల గురించి చెప్పకపోతే అకస్మాత్తుగా వారు రక్తస్రావాన్ని చూసి భయపడిపోవచ్చు. కొంతమంది స్పృహ తప్పిపోవచ్చు కూడా. కాబట్టి అది చాలా సాధారణమైనదేనని వారికి వివరించండి. వారితో ప్రేమగా కూర్చొని మాట్లాడుతూ మధ్యలో ఈ నెలసరుల గురించి వివరించండి. దీని కోసమే ప్రత్యేకంగా కూర్చోబెట్టి మాట్లాడడం వంటివి చేయకండి. ఇద్దరు ప్రేమగా మాట్లాడుతూ స్కూల్లో విషయాలు అడగండి. ఆ తర్వాత నెలసరి గురించి చెప్పడం మొదలు పెట్టండి. వారి వయస్సుకు తగ్గ భాషను ఎంచుకోండి. కొన్ని పదాలు వారికి అర్థం కాకపోవచ్చు.
మీ వ్యక్తిగత అనుభవాలతో వారికి రుతుస్రావం గురించి వివరించండి. మీరు ఏ వయసులో రజస్వల అయ్యారు, అప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందారో, మీ మొదటి పీరియడ్ ఎప్పుడు, ఎలా వచ్చిందో... ఇవన్నీ వారికి వివరించండి. అప్పుడు పిల్లలకు... తాము అదే వయసులో ఉన్నామని అర్థమవుతుంది. పీరియడ్స్ సమయంలో శరీరంలో వచ్చే మార్పులను కూడా వివరించండి. మానసికంగా కూడా ఎన్నో మార్పులు వస్తాయని, భావోద్వేగాలు పెరుగుతాయని చెప్పండి.
వారికి నెలసరి గురించి ఏదైనా ప్రశ్న తలెత్తితే ఓపెన్ గా అడగమని చెప్పండి. రుతుస్రావం కనిపించగానే భయపడకుండా ఏం చేయాలో కూడా వారికి వివరించండి. ఊహించిన విధంగా పీరియడ్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు లేక ఎక్కడైనా స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు పీరియడ్స్ రావచ్చు. అలాంటి సమయంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. ముఖ్యంగా రక్తస్రావం తొలిసారిగా అయినప్పుడు ఆందోళన చెందవద్దని వివరించండి. స్కూల్లో ఇలాంటి రక్తస్రావం కనిపిస్తే వెంటనే మహిళా టీచర్ కు వెళ్లి చెప్పమనండి.
ముఖ్యంగా రుతుస్రావం అనేది ఒక మహిళ జీవితంలో ఎంత ముఖ్యమో వివరించండి. ఇది రాబోయే మార్పులకు సిద్ధంగా ఉండమని చెప్పే తొలి అడుగు అని వారికి తెలపండి. అసౌకర్యంగా అనిపిస్తున్నప్పటికీ, ఆరోగ్యానికి నెలసరి అనేది ఎంత ముఖ్యమో వివరించండి. పీరియడ్స్ అనేది జీవితంలో చాలా సాధారణమైన విషయమని, దాన్ని అసౌకర్యంగా లేదా సిగ్గుపడే విషయంగా తీసుకోవాల్సిన అవసరం లేదని మీ ఆడపిల్లకు చెప్పండి. ఈ విషయంలో ఆడపిల్లకు తల్లి అండగా ఉండాలి. వారికి అన్ని విధాలుగా సాయం చేయాలి. తొలి పీరియడ్స్ ను ఆడపిల్లలు ఇబ్బందికి గురికాకుండా ఉండాలి. అంటే తల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో మొదటిది వారికి పీరియడ్స్ గురించి ఇలా అవగాహన కల్పించడం.
టాపిక్