Munagaku Appam: హెల్తీ అల్పాహారం కోసం చూస్తున్నారా? మునగాకు గుంత పొంగనాలు ట్రై చేయండి
Munagaku Appam: మునగాకు చేర్చి చేసే గుంత పొంగనాలు ప్రయత్నించండి. మునగాకు పోషకాలతో పాటూ కొత్త రుచి ఆస్వాదిస్తారు. ఈ హెల్తీ అల్పాహారం తయారీ చూసేయండి.
మునగాకు గుంత పొంగనాలు
మునగాకును ఎలాగైనా ఆహారంలో చేర్చుకోవాలి అని చూస్తుంటే ఈ రెసిపీ మీకోసమే. మునగాకు గుంతపొంగనాలు చాలా హెల్తీ అల్పాహారం. గుంత పొంగనాల తయారీకి నూనె చాలా తక్కువ అవసరం కాబట్టి పోషకాలున్న బ్రేక్‌ఫాస్ట్ అనుకోవచ్చు. ఇదే పిండితో రుచి మరింత బాగా రావాలనుకుంటే వడలు చేసుకుని నూనెలో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు.
మునగాకు పొంగనాల తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు శనగపప్పు
1 ఉల్లిపాయ, సన్నటి ముక్కల తరుగు
రెండున్నర కప్పుల మునగాకు, సన్నగా తరుగుకోవాలి
గుప్పెడు పుదీనా ఆకులు (ఆప్షనల్)
గుప్పెడు కొత్తిమీర, సన్నటి తరుగు
2 ఎండుమిర్చి
అంగుళం అల్లం ముక్క, తురుము
5 వెల్లుల్లి రెబ్బలు, సన్నటి ముక్కలు
2 లవంగాలు
అర టీస్పూన్ జీలకర్ర
పావు టీస్పూన్ ఇంగువ
తగినంత ఉప్పు
డీప్ ఫ్రైకి సరిపడా నూనె
మునగాకు పొంగనాల తయారీ విధానం:
- శనగపప్పును కడిగి కనీసం మూడు గంటల పాటు నానబెట్టుకోండి. అలాగే మునగాకు కూడా కడిగి తరిగి పెట్టుకోండి.
- నానిన శనగపప్పులో నుంచి నీళ్లు వంపేసి మిక్సీలో వేసి పట్టుకోండి. అందులో అల్లం, వెల్లుల్లి , ఎండుమిర్చి, ఇంగువ, జీలకర్ర, లవంగాలు వేసి ఉప్పు కూడా కలిపి మరోసారి బరకగా తిప్పండి.
- ఈ ముద్దను ఒక బౌల్ లోకి తీసుకుని అందులో మునగాకు తరుగు కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసుకోండి.
- ఈ ముద్దను పక్కన పెట్టుకుని అప్పం ప్యాన్ రెడీ చేసుకోండి. అన్ని గుంతల్లో కొద్దికొద్దిగా నూనె రాసుకోండి.
- అందులో కొద్దికొద్దిగా పిండి వేసుకోండి. మూత పెట్టి కనీసం పది నిమిషాలు సన్నం మంట మీద ఉడికించుకోండి. అవసరం అనుకుంటే కొద్దిగా నూనె చుక్కలు వేసుకోండి. అంతే మునగాకు గుంత పొంగనాలు రెడీ.