Aloo Pudina Curry: ఆలూ పుదీనా కర్రీ ఇలా చేస్తే చపాతీ, రోటీల్లోకి టేస్టీగా ఉంటుంది, రెసిపీ చాలా సులువు
Aloo Pudina Curry: చపాతీ రోటీలు తినేవారికి కర్రీ కూడా బావుండాలి చపాతి తో ఆలూ పుదీనా కర్రీ టేస్టీగా ఉంటుంది దీన్ని రెసిపీ ఎలాగో తెలుసుకుందాం
Aloo Pudina Curry: బంగాళదుంపతో చేసే కూరలను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా చపాతీ, రోటీ, పూరీల్లోకి బెస్ట్ కూర బంగాళదుంపలతో చేసినదే. ఎప్పుడూ ఒకేలా వండుకుంటే కొత్త ఏముంటుంది? పుదీనాతో ఆలూ కర్రీ వండి చూడండి... మంచి సువాసనతో పాటు నోరూరించేలా ఉంటుంది. ఈ ఆలూ పుదీనా కర్రీని చేయడం చాలా సులువు. వేడివేడిగా చపాతీతో ఈ కర్రీ తింటూ ఉంటే ఆహా అనిపిస్తుంది. ఆలూ పుదీనా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఆలూ పుదీనా కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళాదుంపలు - నాలుగు
పుదీనా ఆకులు - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
టమోటాలు - రెండు
పచ్చిమిర్చి - రెండు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూను
జీలకర్ర - ఒక స్పూను
ఆవాలు - ఒక స్పూను
పసుపు - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కారం - ఒక స్పూను
గరంమసాలా - అర స్పూను
ధనియాల పొడి - అర స్పూను
నూనె - తగినంత
ఆలూ పుదీనా కర్రీ రెసిపీ
1. బంగాళదుంపలను ముందుగానే ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. వాటిని మీడియం సైజులో ముక్కలుగా చేసుకొని ఉంచాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
4. ఆ నూనెలో జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి.
5. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
6. అందులోనే నిలువుగా తరిగిన పచ్చిమిర్చిని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి వేయించాలి.
7. ఇవన్నీ పచ్చివాసన పోయి ఘుమఘుమలాడే వరకు వేయించుకోవాలి.
8. ఆ తర్వాత టమోటో ముక్కలను మిక్సీలో వేసి ఫ్యూరీలా చేసుకోవాలి.
9. ఆ ప్యూరీని కూడా ఇందులో కలుపుకొని ఉప్పు జల్లుకోవాలి.
10. పైన మూత పెట్టి కాసేపు ఉంచాలి. చిన్న మంట మీద ఉడికిస్తే టమోటో ఇగురు లాగా వస్తుంది.
11. అందులో ధనియాల పొడి, గరం మసాలా కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
12. ఓ రెండు నిమిషాలు ఉడికించాక ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసి బాగా కలుపుకోవాలి.
13. దుంప కర్రీ ఉడుకుతున్నప్పుడు పుదీనాను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
14. ఆ మిశ్రమాన్ని కూడా బంగాళాదుంపల్లో వేసి బాగా కలుపుకోవాలి.
15. మూత పెట్టి కనీసం 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడకనివ్వాలి.
16. ఆ తర్వాత చూస్తే టేస్టీ ఆలూ కర్రీ రెడీ అయినట్టే.
17. ఇది చూడగానే నోరూరించేలా ఉంటుంది. చపాతీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా ఈ కర్రీ నచ్చుతుంది.
పుదీనా ఆకులు తాజా పరిమళాన్ని ఇస్తాయి. పుదీనా ఆకులు తినడం వల్ల విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, బి విటమిన్లు, విటమిన్ ఏ, విటమిన్ సి వంటివి పుదీనా ఆకుల్లో ఉంటాయి. వీటిని తినడం వల్ల అన్ని రకాలుగా ఆరోగ్యమే. ముఖ్యంగా జీవక్రియను ఇది మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ బారిన పడినవారు ప్రతిరోజూ పుదీనాను తినడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పుదీనాను మేథి అని కూడా పిలుస్తారు. జీర్ణక్రియ సంబంధిత సమస్యలను అడ్డుకోవడంలో పుదీనా ముందుంటాయి.
నాన్ వెజ్ వంటకాల్లో పుదీనా వేస్తే ఆ రుచే వేరు. ముఖ్యంగా బిర్యానీకి అంత సువాసన ఇచ్చేది పుదీనానే. పుదీనాలో మెంథాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పొట్టనొప్పి, పొట్ట ఉబ్బరం, విరేచనాలు అవ్వకుండా అడ్డుకుంటుంది. అలాగే ఒత్తిడి బారిన పడుతున్న వారు తరచూ పుదీనా నీటిని తాగేందుకు ప్రయత్నించండి. ఆ వాసనే ఒత్తిడి నుండి బయటపడేలా చేస్తుంది. ఇక పుదీనా ఆలూ కర్రీ కలిపి వండితే ఆ రుచి గురించి చెప్పక్కర్లేదు. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అన్నంలో కలుపుకుని తిన్నా కూడా రుచిగానే ఉంటుంది.