Aloo Papad: బంగాళదుంప అప్పడాలు ఎప్పుడైనా తిన్నారా? సాంబార్‌‌కు జతగా అదిరిపోతాయి-aloo papad recipe in telugu know how to make this papad ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Aloo Papad: బంగాళదుంప అప్పడాలు ఎప్పుడైనా తిన్నారా? సాంబార్‌‌కు జతగా అదిరిపోతాయి

Aloo Papad: బంగాళదుంప అప్పడాలు ఎప్పుడైనా తిన్నారా? సాంబార్‌‌కు జతగా అదిరిపోతాయి

Haritha Chappa HT Telugu
Feb 15, 2024 05:30 PM IST

Aloo Papad: ఎప్పుడూ ఒకేలాంటి అప్పడాలు తింటే ఎలా? ఒకసారి బంగాళాదుంపలతో అప్పడాలు చేసి చూడండి. ఇవి సాంబార్ కు జతగా టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం కూడా చాలా సులువు.

బంగాళాదుంప అప్పడాలు రెసిపీ
బంగాళాదుంప అప్పడాలు రెసిపీ (Home Made Food Veg Only/youtube)

Aloo Papad: బంగాళాదుంప వంటకాలు ఎక్కువమందికి ఫేవరెట్. బంగాళదుంపతో కూర, వేపుడు వంటివే ఎక్కువగా చేసుకొని తింటారు. ఇక పిల్లల విషయానికొస్తే బంగాళదుంప చిప్స్ అంటే చాలా ఇష్టపడతారు. చిప్స్‌లాగే వాటితో అప్పడాలు కూడా చేస్తారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ముఖ్యంగా సాంబారు, పప్పు వండుకున్నప్పుడు సైడ్ డిష్ గా ఈ అప్పడాలు కొత్త రుచిని అందిస్తాయి. బంగాళదుంపలతో అప్పడాలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంట్లోనే చాలా సులువుగా చేసేసుకోవచ్చు. బంగాళాదుంప అప్పడాలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

బంగాళాదుంప అప్పడాల రెసిపీకి కావలసిన పదార్థాలు

బంగాళదుంపలు - కిలో

నూనె - ఐదు స్పూన్లు

ఎండుమిర్చి - పది

ఉప్పు - రుచికి సరిపడా

బంగాళదుంప అప్పడాల రెసిపీ

1. బంగాళదుంపలను నీటిలో వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి.

2. తరువాత తొక్క తీసి ఆ దుంపలను ఒక గిన్నెలో వేయాలి.

3. చేతితోనే మెత్తగా మెదుపుకోవాలి. అదంతా పేస్టులాగా అయిపోతుంది.

4. అందులోనే ఉప్పు, నూనె వేసుకొని కలుపుకోవాలి.

5. ఎండు మిరపకాయలను మిక్సీ జార్లో వేసి మెత్తగా తురుములా చేసుకోవాలి.

6. ఆ తురుమును కూడా బంగాళదుంపల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.

7. ఇప్పుడు చిన్న ముద్దను తీసి ఒక ప్లాస్టిక్ షీట్ మీద పెట్టి చేతితోనే గుండ్రంగా వచ్చేలా ఒత్తుకోవాలి.

8. ఆ అప్పడాలను ఒక చీర పై ఆరబెట్టాలి. మిశ్రమాన్ని అంతా అప్పడాలుగా చేసుకున్నాక ఆ చీరను ఎర్రటి ఎండలో పెట్టాలి.

9. రెండు రోజులకు అప్పడాలు బాగా ఎండిపోతాయి. ఇవి పెళుసుల్లా మారుతాయి.

10. వాటిని గాలి చొరబడని క్యాన్లలో వేసి దాచుకోవాలి.

11. తినే ముందు నూనెలో వేయించుకుంటే సరిపోతుంది.

12. పిల్లలకు కూడా ఇవి బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఇవి బంగాళదుంప చిప్స్ లాగా అనిపిస్తాయి.

బంగాళదుంప చిప్స్ ఇష్టపడే వారంతా బంగాళదుంప అప్పడాలను కూడా ఇష్టంగానే తింటారు. బంగాళదుంపలను ఇక్కడ మనం బాగా ఉడికిస్తాము కాబట్టి అందులో ఉన్న పిండి పదార్థాలు చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా వీటిని మితంగా తినవచ్చు. బంగాళదుంపలో క్యాలరీలు తక్కువగానే ఉంటాయి. వీటిలో కొవ్వు కూడా తక్కువే. కాబట్టి భయపడకుండా బంగాళాదుంపతో చేసిన ఆహారాలను తినండి. దీనిలో మెగ్నీషియం, ఫొలేట్ అధికంగా ఉంటుంది. ఈ రెండూ మన శరీరానికి అవసరమైన పోషకాలు.

ఉడికించిన బంగాళదుంప గ్లైసెమిక్ ఇండెక్స్ 50 వరకు ఉంటుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు వీటిని చాలా తక్కువ మొత్తంలో తినాలి. ఇక బంగాళదుంపను ఉడికించకుండా నేరుగా కూరల్లో వేసి వండుతారు. అలాంటివి తింటే ఇంకా ప్రమాదం. ఎందుకంటే ఉడికించని బంగాళదుంపల గ్లైసెమిక్ ఇండెక్స్ 95. అలాంటి వాటిని మధుమేహ రోగులు తినకూడదు. ఈ బంగాళదుంప అప్పడాలను ఒక్కసారి చేసుకుంటే ఆరు నెలలపాటు సహజంగా ఉంటాయి. అందుకే ఈ బంగాళదుంప అప్పడాలను ఏడాదిలో రెండుసార్లు చేసుకుంటే సరిపోతుంది. అవసరమైనప్పుడల్లా వాటిని వేయించుకుని తినవచ్.చు

Whats_app_banner