Aloo Pakodi: సాయంత్రానికి బంగాళదుంపలతో పకోడీ చేసి పెట్టండి, కరకరలాడుతూ నోరూరించేస్తాయి
Aloo Pakodi: బంగాళాదుంపలతో చేసిన వంటకాలకు ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. ఒకసారి బంగాళదుంపలతో పకోడీ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ సులువు కూడా.
Aloo Pakodi: క్రిస్పీగా ఉండే స్నాక్స్ అంటే ఎక్కువ మంది ఇష్టపడతారు. ముఖ్యంగా పకోడీలను సాయంత్రం పూట తినేందుకు వేచి చూస్తూ ఉంటారు. ఎప్పుడూ ఒకేలాంటి పకోడీ కన్నా ఓసారి కొత్తగా బంగాళదుంపలతో పకోడీ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని చేయడం చాలా సులువు. కేవలం అరగంటలో రెడీ అయిపోతాయి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే బంగాళాదుంప పకోడీలను సులువుగా చేసేయొచ్చు. దీని రెసిపీ ఎలాగో చూద్దాం.
బంగాళాదుంప పకోడీకి కావలసిన పదార్థాలు
బంగాళా దుంపలు - రెండు
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - ఐదు
కొత్తిమీర తరుగు - ఐదు స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
సెనగపిండి - రెండు కప్పులు
బియ్యప్పిండి - అరకప్పు
పసుపు - అర స్పూను
కారం - ఒక స్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఫ్రై కి సరిపడా
బంగాళాదుంప పకోడీ రెసిపీ
- బంగాళదుంపలుపై ఉన్న తొక్కను తీసి సన్నగా నిలువుగా కోసుకోవాలి.
2. ఆ బంగాళదుంపలు తురుమును నీటిలో వేసి నానబెట్టాలి.
3. అందులోనే ఉప్పు, పసుపు కూడా వేసి నానబెట్టాలి. అలా పది నిమిషాలు పాటు వదిలేయాలి.
4. తర్వాత నీటిని వంపేసి బంగాళదుంపలను ఒక పెద్ద గిన్నెలో వేయాలి.
5. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసి చేతులతో కలుపుకోవాలి.
6. అందులోనే ధనియాల పొడి, కారం, వెల్లుల్లి రెబ్బల తరుగు, కొత్తిమీర తరుగు, బియ్యప్పిండి వేసి బాగా కలుపుకోవాలి.
7. చివరగా శెనగపిండిని వేసి కాస్త నీరు పోసి మెత్తగా కలుపుకోవాలి. ఒక స్పూను నూనె కూడా వేస్తే మంచిది.
8. ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయాలి.
10. నూనె వేడెక్కాక బంగాళదుంప మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి.
11. అన్ని వైపులా బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చుకోవాలి.
12. వాటిని తీసి టిష్యూ పేపర్ల మీద వేయాలి. వాటికి అంటుకున్న నూనెను టిష్యూ పేపర్ పీల్చేస్తుంది.
13. ఈ పకోడీలను పుదీనా చట్నీతో లేదా కేచప్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు పెడితే వారు ఇష్టంగా తింటారు.
బంగాళదుంపలతో చేసే ఏ వంటకాన్ని అయినా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులో క్రిస్పీగా బంగాళాదుంపలు తగులుతూ ఉంటే వారికి నచ్చుతుంది. దీన్ని వారానికి ఒకటి రెండు సార్లు చేసి పెడితే మంచిది. ఇందులో మనం వాడినవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. కాబట్టి వారానికి రెండుసార్లు తినిపించడం వల్ల ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే పకోడీ నూనె ఎక్కువగా పీల్చుకోకుండా చూసుకోండి.
టాపిక్