Sankranthi Recipe: సంక్రాంతికి స్పెషల్ రెసిపీ బంగాళదుంప జంతికలు, క్రిస్పీగా రావాలంటే ఇలా చేయండి
Sankranthi Recipe: ఎప్పుడూ ఒకేలాంటి జంతికలు తిని బోర్ కొట్టాయా? ఒకసారి బంగాళదుంపలతో జంతికలు చేసి చూడండి. టేస్టీగా ఉంటాయి.
Sankranthi Recipe: సంక్రాంతి వచ్చిందంటే ప్రతి ఇంట్లో జంతికలు కరకరలాడాల్సిందే. ఎప్పుడూ ఒకే రకమైన జంతికలు తింటే బోర్ కొడుతుంది. ఈ సంక్రాంతికి స్పెషల్‌గా బంగాళదుంప జంతికలు చేసి చూడండి. ఇవి కూడా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. రుచి కొత్తగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటాయి. ముఖ్యంగా బంగాళదుంప చిప్స్ ని ఇష్టపడే పిల్లలకు ఈ బంగాళదుంప జంతికలు చాలా నచ్చుతాయి. వీటిని చేయడం చాలా సులువు. ఇవి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం.
బంగాళదుంప జంతిక రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి - రెండు కప్పులు
ఉడికించిన బంగాళాదుంపలు - రెండు
నూనె - సరిపడినంత
ఇంగువ - చిటికెడు
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - తగినంత
బంగాళదుంప జంతికలు రెసిపీ
1. బంగాళాదుంపలను బాగా ఉడికించి తొక్క తీసి ఒక గిన్నెలో వేయాలి.
2. ఆ గిన్నెలోనే చేత్తో మెదిపి మెత్తగా చేసుకోవాలి. అందులో కాస్త నూనె వేయాలి.
3. అదే గిన్నెలో బియ్యప్పిండి, ఇంగువ, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా ముద్దలా కలుపుకోవాలి.
4. జంతికల పిండి ఎంత మందంగా కలుపుకుంటామో ఇది అంతే మందంగా కలుపుకోవాలి.
5. నీటిని ఎక్కువగా వేస్తే జంతికలు సరిగ్గా రావు.
6. కాబట్టి సాధారణ జంతికల పిండి ఎంత గట్టిగా కలుపుకుంటారో అలా కలుపుకోండి.
7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి జంతికలను వేయించడానికి సరిపడా నూనెను వేయండి.
8. జంతికల గొట్టంలో ఈ పిండిని నింపి నూనెలో జంతికల్లా వేసుకోండి.
9. రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాక తీసి పక్కన పెట్టుకోండి.
10. ఇవి మరీ బ్రౌన్ రంగులోకి రావాల్సిన అవసరం లేదు. బంగారు గోధుమ రంగులోకి వస్తే చాలు.
11. ఇవి గాలి చొరబడని క్యాన్లలో దాచుకుంటే మూడు నాలుగు వారాల వరకు తాజాగా ఉంటాయి.
12. మీకు కావాలంటే కాస్త కారాన్ని కలుపుకోవచ్చు, లేదా ఎండుమిర్చిని మిక్సీలో బరకగా రుబ్బుకొని వాటిని కలుపుకున్నా కాస్త కారంగా ఉంటాయి.
13. ఈ బంగాళాదుంప జంతికలు పిల్లలకు కచ్చితంగా నచ్చుతాయి.