Aloo Chicken Keema Fry: ఆలూ చికెన్ కీమా ఫ్రై ఒక్కసారి తిని చూడండి, జీవితంలో మర్చిపోలేరు, రుచి అదిరిపోతుంది
Aloo Chicken Keema Fry: ఎప్పుడూ ఒకేలాంటి వంటకాలు తింటే కొత్తదనం ఏముంటుంది, ఒకసారి ఆలూ చికెన్ కీమా వేపుడు తిని చూడండి. దీని రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
Aloo Chicken Keema Fry: చికెన్, బంగాళదుంపలు కలిపి చేసే వంటకం ఆలూ చికెన్ కీమా వేపుడు. ఈ రెండూ కూడా రుచిగానే ఉంటాయి. కాబట్టి ఈ రెండు పదార్థాలు కలిపి వండడం వల్ల రెట్టింపు రుచి రావడం ఖాయం. ఇక్కడ మేము చాలా సులువుగా ఆలూ చికెన్ కీమా ఎలా వండాలో ఇచ్చాము. దీన్ని ఒక్కసారి వండి చూడండి. మీ ఇంటిల్లిపాది అభిమానులు అయిపోతారు. దీని వండడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా, ఆలూ చికెన్ వేపుడు రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
ఆలు చికెన్ కీమా వేపుడు రెసిపీకి కావలసిన పదార్థాలు
చికెన్ కీమా - పావు కిలో
బంగాళదుంప - ఒకటి
నూనె - రెండు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
నీరు - తగినంత
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
ధనియాల పొడి - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర పొడి - ఒక స్పూను
మిరియాల పొడి - ఒక స్పూను
పసుపు - ఒక స్పూను
టమోటోలు - ఒకటి
గరం మసాలా - ఒక స్పూను
కారం - ఒక స్పూను
ఆలూ చికెన్ కీమా రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
2. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి మెత్తగా వేయించండి.
3. అవి గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోండి. ఇప్పుడు చికెన్ కీమాను శుభ్రంగా కడిగి అందులో వేసి బాగా కలపండి.
4. అల్లం వెల్లుల్లి పేస్టు అందులో వేసి కలపండి. ఈ మొత్తాన్ని చిన్న మంట మీద ఉడికించండి.
5. ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, పసుపు, కారం వేసి బాగా కలపండి.
6. ఇప్పుడు 70 శాతం ఉడికించిన బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కోసుకోండి.
7. ఆ బంగాళదుంపల్ని కూడా కీమాలో వేసి బాగా కలుపుకోండి.
8. తర్వాత టమోటోలను సన్నగా తరిగి వాటిని కూడా వేయండి.
9. ఈ మొత్తం మిశ్రమాన్ని పావుగంట సేపు అలా ఉడికించండి.
10. పైన గరం మసాలా, కారం వేసి బాగా కలుపుకోండి.
11. ఇది మొత్తం వేపుడులాగా అయ్యేవరకు ఉడికించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
12. పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే టేస్టీ ఆలూ చికెన్ కీమా వేపుడు రెడీ అయినట్టే.
13. ఇది తింటూ ఉంటే మరింతగా తినాలనిపిస్తుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది.
బంగాళదుంప ముక్కలను మరీ పెద్దవిగా కాకుండా చిన్నవిగా కోసుకుంటే కీమాలో కలిసిపోతాయి. కాబట్టి టేస్టీగా ఉంటాయి. టమోటాలను కూడా దాదాపు చాలా సన్నగా తరుక్కోవాలి. లేకపోతే టమాటా ముక్కలు ఉడకకుండా అలా ఉండిపోయే అవకాశం ఉంది.