ప్రస్తుత ప్రపంచంలో 70 ఏళ్ల వారు సైతం దృఢంగా, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఉంటున్నారు. అదే 30 నుంచి 50 ఏళ్ల వయసు వారు మాత్రం అనునిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. గత కొన్ని సంవత్సరాల డేటాను పరిశీలిస్తే, నిన్నటితరం వారు మెరుగైన జీవనశైలిని అనుసరించటం ద్వారా ఇప్పటికీ శక్తివంతంగా ఉంటున్నారు. కానీ నేటి తరం వారు అనేక రకాల తీవ్రమైన వ్యాధులకు గురవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం తినే ఆహారం, మారుతున్న జీవనశైలే అని స్పష్టమవుతుంది.
మనం రోజూ ఏం తింటాము, ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నాము? ఇవన్నీ మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగానే వైద్యులు ఇప్పటి ప్రజలందరికీ మంచి దినచర్యను పాటించాలని సలహా ఇస్తున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సగానికి పైగా రోగాల ముప్పును తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ఆరోగ్యవంతమైన జీవితాన్ని కోరుకునే వారు, ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయే ముందు వరకు సరైన అలవాట్లను అలవర్చుకోవాలి. ఉదయంపూట ఆదర్శవంతమైన ప్రణాళికను కలిగి ఉండటంతో పాటు, రాత్రి పూట కూడా కొన్ని అలవాట్లను మార్చుకోవాలి.
రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోయే వారిలో మీరూ ఒకరా? మీ సమాధానం అవును అయితే, వెంటనే ఈ అలవాటును సరిదిద్దుకోండి. ఎందుకంటే ఈ అలవాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు మూలం. ముఖ్యంగా ఎక్కువ మంది మధుమేహం, గుండె జబ్బుల బారినపడుతుండటానికి ఇది ఒక కారకంగా అని అధ్యయనాలు వెల్లడించాయి. నిద్రకు ముందు 10 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవడం వల్ల అనేక వ్యాధుల బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరిన్ని ప్రయోజనాలు ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహంతో బాధపడే వారు రోజూ రాత్రి నడకకు వెళ్లడం చేస్తే, ఈ అలవాటు కేలరీలను బర్న్ చేయడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత బ్లడ్ షుగర్ స్పైక్ మొదలవుతుంది. అయితే ఈ సమయంలో కాసేపు నడకకు వెళితే, గ్లూకోజ్‌లో కొంత భాగం వినియోగం జరుగుతుంది. ఇది మధుమేహంతో వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రాత్రి భోజనం తర్వాత వాకింగ్ చేసే అలవాటు రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. కరోనా వంటి ఇన్ఫెక్షన్లను నివారించడానికి కూడా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ప్రయత్నాలు చేయాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. కాబట్టి ప్రతిరోజూ పడుకునే ముందు టెర్రస్ మీద నడవడం అలవాటు చేసుకోండి.
నిద్రలేమి అనేక వ్యాధులకు కారణం. ప్రతి ఒక్కరూ రాత్రిపూట 6-8 గంటలు నిరాటంకమైన నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మీరు కూడా నిద్ర సమస్యతో ఇబ్బంది పడుతుంటే, ప్రతి రాత్రి నిద్రపోయే ముందు కనీసం 10 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి, ఇది నిద్రలేమి సమస్యలను తొలగించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. నిద్రపోయే ముందు నడక అలవాటు చేసుకుంటే అది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
పడుకునే ముందు నడవడం వల్ల మీ శరీరం మరింత గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం నుండి పోషకాల శోషిణ వేగంగా జరుగుతుంది. ఈ చిన్న అలవాటు గ్యాస్, మలబద్ధకం, అజీర్ణాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇతర అనేక ఉదర సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
సంబంధిత కథనం