Fertility Tips । గర్భం కోసం ప్రయత్నిస్తున్నారా? ఈ మార్పులు చేసుకుంటే త్వరలోనే శుభవార్త వింటారు!
Fertility Tips: సంతానోత్పత్తి సమస్యలు సాధారణంగా స్త్రీల ఆరోగ్య సమస్యగా భావిస్తున్నప్పటికీ, మగవారిలో కూడా తక్కువ స్పెర్మ్ కౌంట్, చలనశీలత కూడా ఒక జంట గర్భం ధరించే సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి. మీ సంతానోత్పత్తి అవకాశాలను పెంచే జీవనశైలి మార్పులు ఇక్కడ చూడండి.
ఏ ఒకరి జీవితంలో అయినా పెళ్లి అనేది ఒక పెద్ద వేడుక అయితే, వారు భార్యాభరలుగా మారిన తర్వాత జరిగే వారి జీవితంలో జరిగే మరో అపురూప ఘట్టం తల్లిదండ్రులుగా పదోన్నతి పొందడం. అయితే నేటి ఆధునిక కాలంలో పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకుంటున్నారు, పిల్లల విషయంలోనూ జాప్యం జరుగుతోంది. చాలామంది పెళ్లైన జంటలు పిల్లల్ని కనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెళ్లి తర్వాత స్త్రీ గర్భం ధరించడానికి చేసే ప్రయత్నంలో చాలా పెద్ద నిరీక్షణ ఎదురవుతుంది. గర్భధారణ కోసం చేసే పరీక్షలలో ఈనెల అయినా సానుకూల ఫలితం వస్తుందా? అని ప్రతీ నెలా ఎదురుచూడాల్సి వస్తుంది. ఈ క్రమంలో వరుసగా ప్రతినెలా ప్రతికూల ఫలితాలు వస్తుంటే వారిలో నిరుత్సాహం పెరిగిపోతుంది. ఫలితంగా డిప్రెషన్ కు గురవుతున్నారు.
గర్భం కోసం ఎదురుచూస్తున్న జంటలు చాలా ఓపికగా వ్యవహరించాలని వైద్య నిపుణులు అంటున్నారు. మొదటిసారి సంతానం కోసం ఎదురుచూసే ఏ జంటకైనా, గర్భం ధరించడం విషయంలో ఒత్తిడి ఉంటుంది. కాబట్టి సంతానోత్పత్తిని ప్రభావితం చేసే అంశాలపై దృష్టిపెట్టాలని చెబుతున్నారు. ముఖ్యంగా జీవనశైలి మార్చుకోవాలని సిఫారసు చేస్తున్నారు.
Fertility Tips- సంతానోత్పత్తి సంభావ్యతను పెంచే చిట్కాలు
మీరు గర్భం ధరించాలనే ఆసక్తి ఉంటే స్త్రీ, పురుషులు ఇద్దరూ కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ అలవాట్ల విషయంలో మీరు ఎంత కచ్చితంగా వ్యవహరిస్తే మీ సంతాన యోగ్యత అంతగా పురోగతికి నోచుకుంటుంది. మరి ఆ అలవాట్లు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
1. ధూమపానం మానేయండి
పొగాకు వినియోగం తక్కువ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ధూమపానం అలవాటు ఆడవారిలో అండాశయాలను వృద్ధాప్యం చేస్తుంది, అండాల పరిణితిని అకాలంగా తగ్గిస్తుంది. మగవారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. అందువల్ల మీకు ధూమపానం అలవాటు ఉంటే, వెంటనే మానేయండి. పూర్తిగా ధూమపానంకు దూరంగా ఉండండి. అవసరమైతే ఇందుకోసం మీ వైద్యుడి సలహాలు తీసుకోండి.
2. ఆల్కహాల్ పరిమితం చేయండి
అతిగా మద్యపానం సేవించడం ఆడవారిలో అండోత్సర్గము రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుంది. మగవారి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. మీరు గర్భం ధరించాలనుకుంటే, మీరు తీసుకునే మద్యపానం మోతాదును తగ్గించండి, పూర్తిగా మానేస్తే మరీ మంచిది. ఎందుకంటే ఆల్కాహాల్ పిండంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.
3. ఆరోగ్యకరమైన భోజనం తినండి
మీరు ప్రత్యేకించి గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, మీక్రు సరైన పోషకాహారం తీసుకోవడం చాలా కీలకం. పుష్కలంగా తాజా పండ్లు, కూరగాయలు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, మంచి కొవ్వులతో కూడిన పోషకమైన ఆహారం తీసుకోండి. క్యారెట్లు తినడం వల్ల మహిళలు గర్భధారణ సమయంలో రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది, జింక్ పోషకం కలిగిన ఆహారాలు తీసుకోవడం వలన స్పెర్మ్ నాణ్యత పెరుగుతుంది.
4. కెఫీన్‌ను తగ్గించండి
కాఫీ ఇతర కెఫీన్ పానీయాలు తాగడం తగ్గించండి. రోజుకు 200 మిల్లీగ్రాములకు మించి కెఫీన్ తీసుకోకూడదు. లేనిపక్షంలో ఇది స్త్రీల సంతానోత్పత్తిపై ప్రభావితం చూపుతుంది. మీకు కాఫీ తాగడం అలవాటు ఉంటే, రోజుకి రెండు కప్పులకు మించి తీసుకోకండి. స్ట్రాంగ్ కాఫీ కాకుండా లైట్ లాటే తీసుకోవడం ఉత్తమం.
5. కాలుష్యానికి దూరంగా ఉండండి
పర్యావరణ కాలుష్య కారకాలు, టాక్సిన్స్ - పురుగుమందులు మొదలైన వాటికి గురికాకుండా ఉండండి. డ్రై-క్లీనింగ్ ద్రావకాలు, సీసం వంటివి స్త్రీ, పురుషులిద్దరిలో సంతానోత్పత్తిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. వీలైతే స్వచ్ఛమైన ప్రకృతి నడుమ కొంతకాలం గడిపేందుకు ప్రయత్నించండి.
6. అతిగా వ్యాయామం వద్దు
ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా ఆరోగ్యకరం అయితే చాలా తీవ్రమైన శారీరక శ్రమ అండోత్సర్గాన్ని నిరోధిస్తుంది, ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. మీరు ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉంటే, త్వరలో గర్భవతి కావాలని ఆలోచిస్తున్నట్లయితే, తీవ్రమైన శారీరక శ్రమను తగ్గించండి. అలాగే మీ మొత్తం వ్యాయామాన్ని వారానికి ఐదు గంటలకు పరిమితం చేయండి. మీరు అధిక బరువును కలిగి ఉంటే వైద్యుల సలహాలతో బరువు తగ్గే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అధిక బరువు కూడా సంతానోత్పతికి నిరోధించే ఒక కారకం.
7. అతిగా ఆలోచించకండి
మీరు గర్భం ధరించడం లేదని అతిగా ఆలోచించకండి, అలాగే వివిధ రకాల నాటు వైద్యాలు, ఔషధాలు మీ శరీరంపై ప్రయోగించకండి. ఇవన్నీ మిమ్మల్ని మరింత ఒత్తిడిలోకి నెట్టివేస్తాయి. ఒత్తిడి, ఆందోళనలు కూడా సంతానోత్పతికి అవరోధాలుగా ఉంటాయి. కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండండి, ఆలస్యమైనా మీ గర్భంపై ఆశాజనకంగా ఉండండి, సానుకూల దృక్పథంతో ఉంటే సానుకూల ఫలితాలు వస్తాయి.
8. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి
వివిధ రకాల ఒత్తిళ్లతో కొంతమందికి నిద్రలేమి సమస్యలు ఉంటాయి. అలాగే పనివేళల కారణంగా కూడా సరైన నిద్ర ఉండకపోవచ్చు. కానీ సంతానోత్పత్తి సామర్థ్యం పెరగటంలో అలాగే మీరు ఏదైనా చికిత్స తీసుకుంటే అది ప్రభావవంతంగా పనిచేయడంలో నిద్ర చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి నిద్రకోసం సరైన షెడ్యూల్ కలిగి ఉండండి. నిద్రపట్టడంలో ఇబ్బందులు ఎదురైతే మీ వైద్యుని సహాయం కోరండి.
సంబంధిత కథనం