Reduce Uric Acid । శరీరంలో యూరిక్ ఆసిడ్ ఎక్కువైతే కీళ్ల నొప్పులు, సహజంగా తగ్గించుకోండి ఇలా!
Reduce Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువైతే కీళ్లలో మంట కలుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని ఇంటి చిట్కాలు నివారణగా పనిచేస్తాయి.
Reduce Uric Acid: కీళ్ల నొప్పులు సాధారణంగా కీళ్లలో మంట పెరగడం వల్ల వస్తుంది. కీళ్ల కింద ఎముకల మధ్య మృదులాస్థి అరిగిపోయినప్పుడు అలాగే శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు కూడా కీళ్ల నొప్పులు బాధించవచ్చు. వయసు పెరిగేకొద్దీ కీళ్ల నొప్పులు రావడం సహజం. అయితే ప్రోటీన్ సంశ్లేషణ జరిగినపుడు యూరిక్ ఆసిడ్ ఉప ఉత్పత్తిగా శరీరంలో విడుదలవుతుంది. ముఖ్యంగా మాంసాహారం తినేవారిలో తిన్న మాంసం విచ్చిన్నమైనపుడు ప్యూరిన్ అనేది విడుదలవుతుంది. ప్యూరిన్ నుండి యూరిక్ యాసిడ్ తయారవుతుంది. ఇది ఎక్కువైతే కీళ్లలో మంట కలుగుతుంది.
సాధారణంగా, శరీరంలో విడుదలైన అదనపు యూరిక్ యాసిడ్ కిడ్నీలలో ఫిల్టర్ అవుతుంది, అనంతరం మూత్రం ద్వారా శరీరం నుండి బయటకు వెళ్లిపోతుంది. కానీ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ నిక్షేపణ పెరిగిపోతుంది, ఈ సందర్భంలో కిడ్నీలు ఎక్కువ యూరిక్ ఆసిడ్ ను ఫిల్టర్ చేయలేకపోతాయి, ఫలితంగా ఆ ఆసిడ్ అలాగే శరీరంలో ఉండిపోయి కీళ్లలో నొప్పిని రేకెత్తిస్తుంది.
అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని ఇంటి చిట్కాలు నివారణగా పనిచేస్తాయి. ఆహారాలలో కొన్ని సహజ మూలికలు చేర్చుకోవడం ద్వారా అధిక యూరిక్ ఆసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ సహజ పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి
వెల్లుల్లి శరీరంలోని అదనపు యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపుతుంది. వెల్లుల్లిని పొట్టు తీసి, చిన్నగా కోసి, బెల్లంతో కలిపి తినండి. ఇలా వెల్లుల్లిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కీళ్ళనొప్పులను, ఆర్థరైటిస్ ను శాశ్వతంగా దూరం చేసుకోవచ్చు. అంతేకాదు వెల్లుల్లి-బెల్లం కలయిక శరీరంలోని రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
మెంతులు
మెంతులు ఆర్థరైటిస్ (arthritis) సమస్యల నొప్పి నుండి శాశ్వత ఉపశమనాన్ని అందించే యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కీళ్లలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. మెంతులను రాత్రిపూట నానబెట్టి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అధిక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
వాము
వాములో కొద్దిగా అల్లం కలిపి తినాలి. ఈ రెండు పదార్థాలు శరీరం నుండి చెమటను తొలగించడంలో సహాయపడతాయి. ఈ రెండింటినీ ఒకేసారి తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు యూరిక్ యాసిడ్ తొలగిపోతుంది. తరిగిన అల్లం, అర టీస్పూన్ వామును నీళ్లలో వేసి కాసేపు మరిగించి, చల్లారాక ఆ నీటిని వడకట్టి తాగాలి.
ధనియాలు
ధనియాలలో జీర్ణవ్యవస్థ, ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుచేసే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇది ప్రేగులలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఆ మరుసటి ఉదయం గింజలను వడకట్టి నీటిని తాగాలి.
బెర్రీ పండ్లు
బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బ్లూబెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, స్ట్రాబెర్రీలు, క్రాన్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్ వంటి బెర్రీ పండ్లు ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలిగించి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
ఆముదము నూనె
కీళ్లనొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు ఆముదం ఒక ప్రభావవంతమైన సహజ ఔషధం. నొప్పి ఉన్నచోట ఆముదం నూనెను సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది ఒక సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది, హానికరమైన యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది, అసౌకర్యం నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.
సంబంధిత కథనం