Weekend Telugu OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో తెలుగు సినిమాలు, షోల జాతర.. ఐదు సినిమాలు, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్
Weekend Telugu OTT Releases: ఈ వీకెండ్ ఓటీటీల్లో తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ జాతర రానుంది. ఏకంగా ఐదు సినిమాలు, ఓ వెబ్ సిరీస్, ఓ డాక్యుమెంటరీ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Weekend Telugu OTT Releases: వీకెండ్ వస్తే చాలు ఓటీటీల్లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కోసం ఎదురు చూడటం అలవాటుగా మారింది. అయితే ఈ వీకెండ్ మిమ్మల్ని ఫుల్ టైంపాస్ చేయడానికి తెలుగులోనే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ రానున్నాయి. వీటిలో ఇప్పటికే కొన్ని ఓటీటీల్లోకి వచ్చేయగా.. మరికొన్ని శుక్రవారం (ఆగస్ట్ 2) రాబోతున్నాయి.
వీకెండ్ తెలుగు ఓటీటీ రిలీజెస్
ఆగస్ట్ తొలి వీకెండ్ లో మొత్తంగా ఐదు తెలుగు సినిమాలు, ఒక వెబ్ సిరీస్, ఒక డాక్యుమెంటరీ రానున్నాయి. ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్, ఈటీవీ విన్, ఆహాలాంటి ఓటీటీల్లో అడుగు పెట్టబోతున్నాయి. మరి ఆ సినిమాలు, షోలేంటో చూసేయండి.
బృందా వెబ్ సిరీస్ - సోనీలివ్
ఒకప్పుడు టాలీవుడ్ ను ఏలిన నటి త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ బృందా. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 8 ఎపిసోడ్లతో రాబోతోంది. ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో శుక్రవారం (ఆగస్ట్ 2) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో త్రిష్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. మరికొన్ని గంటల్లోనే సిరీస్ అందుబాటులోకి రానుంది.
మోడర్న్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి - నెట్‌ఫ్లిక్స్
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ ఇది. మోడర్న్ మాస్టర్స్ పేరుతో వస్తున్న సిరీస్ లో భాగంగా ఈసారి జక్కన్నపై డాక్యుమెంటరీ రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ఎంతో ఆసక్తి రేపింది. ఇందులో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వాళ్లు రాజమౌళి గురించి, అతనితో కలిసి పని చేయడం గురించి తమ అనుభవాలను పంచుకోనున్నారు.
తెప్ప సముద్రం - ఆహా ఓటీటీ
తెప్ప సముద్రం మూవీ ఓ సైకో కిల్లర్ స్టోరీ. థియేటర్లలో రిలీజైన మూడు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 19న రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన రాగా.. ఇప్పుడు ఆహా ఓటీటీలో శనివారం (ఆగస్ట్ 3) నుంచి స్ట్రీమింగ్ కానుంది. చైతన్య రావు, అర్జున్ అంబటి, సాయికుమార్ నటించిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
రక్షణ - ఆహా ఓటీటీ
పాయల్ రాజ్‌పుత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన రక్షణ మూవీ ఇప్పటికే ఆహా వీడియోలో వచ్చేసింది. గురువారం (ఆగస్ట్ 1) నుంచే ఈ సినిమా ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
సత్యభామ - ఈటీవీ విన్
కాజల్ నటించిన సత్యభామ మూవీ ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఈటీవీ విన్ ఓటీటీలోకి కూడా వచ్చింది. ఈ సినిమా కూడా ఇవాళ్టి (ఆగస్ట్ 1) నుంచే సదరు ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉంది.
డియర్ నాన్న - ఈటీవీ విన్
చైతన్య రావు నటించిన డియర్ నాన్న మూవీ కూడా ఈటీవీ విన్ లోనే గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఒకే రోజు ఈ ఓటీటీలో రెండు సినిమాలు రావడం విశేషం.
డ్యూన్: పార్ట్ 2
హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ డ్యూన్: పార్ట్ 2 మూవీ కూడా జియో సినిమాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇంగ్లిష్ తోపాటు తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.