Netflix Web Series: ఓటీటీలోకి మరో సరికొత్త యాక్షన్ వెబ్ సిరీస్.. మన తెలుగు దర్శకుల నిర్మాణంలోనే..
Netflix Web Series: ఓటీటీలోకి తొలిసారి ఓ యాక్షన్ ఫ్యాంటసీ వెబ్ సిరీస్ తీసుకురాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది. ఎంతో టాలెంట్ ఉన్న మన తెలుగు దర్శకులు రాజ్ అండ్ డీకే నిర్మాణంలోనే ఈ సిరీస్ రానుండటం విశేషం.
Netflix Web Series: మన తెలుగు దర్శకులు రాజ్ నిడమోరు, కృష్ణ డీకే గురించి తెలుసు కదా. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ లాంటి వెబ్ సిరీస్ అందించిన టాలెంటెడ్ దర్శకులు వీళ్లు. ఇప్పుడీ ఇద్దరూ కలిసి ఓ యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ నిర్మిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని శనివారం (జులై 27) సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్ యాక్షన్ వెబ్ సిరీస్
కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేస్తూ నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేసిన పోస్టర్, దానికి పెట్టిన క్యాప్షన్ ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ కు "రక్త్ బ్రహ్మాండ్ - ది బ్లడీ కింగ్‌డమ్" అనే టైటిల్ పెట్టడం విశేషం. ఈ సందర్భంగా ఓ కిరీటం, దాని చుట్టూ రక్తం కారుతున్నట్లుగా ఉన్న పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రాజ్ నిడమోరు, కృష్ణ డీకే ఈ సిరీస్ నిర్మిస్తున్నారు. తొలిసారి ఇలా ఓ యాక్షన్ ఫ్యాంటసీ జానర్ లో ఓ వెబ్ సిరీస్ తీసుకురాబోతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది.
"మీ రక్తాన్ని మరిగించే ఓ పెద్ద న్యూస్ మా దగ్గర ఉంది. మా తొలి యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ ను అనౌన్స్ చేయడానికి చాలా ఆనందిస్తున్నాం" అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. రాజ్ అండ్ డీకే తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ కింద ఈ సిరీస్ నిర్మిస్తుండగా.. తుంబాద్ మూవీ ఫేమ్ రాహి అనిల్ బార్వే డైరెక్ట్ చేస్తున్నాడు.
నెట్‌ఫ్లిక్స్‌తో రెండోసారి
రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియాలో ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీలాంటి వెబ్ సిరీస్ లతో మ్యాజిక్ చేశారు. గతేడాది ఆగస్ట్ లో తొలిసారి నెట్‌ఫ్లిక్స్ తో కలిసి గన్స్ అండ్ గులాబ్స్ సిరీస్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు రెండోసారి అదే ఓటీటీతో కలిసి మరో సిరీస్ నిర్మిస్తున్నారు. ఈ సిరీస్ కు కథను రాజ్ అండ్ డీకేతోపాటు బార్వే, సీతా ఆర్ మేనన్ కలిసి అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ షూటింగ్ లో ఉన్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఓ రాజ్యం, దాని కిరీటం కోసం జరిగే యుద్ధ నేపథ్యంలో గ్రిప్పింగ్ నెరేటివ్ తో ఈ సిరీస్ తెరకెక్కనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ చెప్పింది. ఈ జానర్ లో ఇప్పటి వరకూ తాము కథ అందించలేదని, తమ చిన్నతనంలో విన్న రాజ్యాలు, యుద్ధాలను తలపించేలా ఈ సిరీస్ నిర్మించాలని అనుకుంటున్నట్లు రాజ్ అండ్ డీకే తెలిపారు.
ఈ వెబ్ సిరీస్ లో ఎవరు నటిస్తున్నారన్న దానిపై త్వరలోనే సదరు ఓటీటీ అధికారిక ప్రకటన చేయనుంది. రాజ్ అండ్ డీకేతో కలిసి మరోసారి ఓ సిరీస్ నిర్మిస్తుండటం థ్రిల్లింగా ఉందని నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ అన్నారు. మరి ఈ కొత్త సిరీస్ తో రాజ్ అండ్ డీకే ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి.