SSMB29 Update: మహేశ్, రాజమౌళి మూవీపై బిగ్ అప్‍డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్.. షూటింగ్ ఎప్పుడో రివీల్
SSMB29 Shooting Update: మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్‍లో మూవీపై అప్‍డేట్ కోసం నిరీక్షణ కొనసాగుతోంది. షూటింగ్ ఎప్పుడా అనే ఆసక్తి ఉంది. ఈ తరుణంలో ఈ సినిమా గురించి బిగ్ అప్‍డేట్ ఇచ్చారు రచయిత విజయేంద్ర ప్రసాద్.
ఆర్ఆర్ఆర్ సినిమాతో రెండేళ్ల క్రితం గ్లోబల్ రేంజ్‍లో సెన్సేషన్ క్రియేట్ చేశారు తెలుగు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. రామ్‍చరణ్, ఎన్టీఆర్ కలిసి హీరోలుగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‍బస్టర్ కొట్టింది. రాజమౌళి పేరు హాలీవుడ్‍లోనూ మార్మోగిపోయింది. దీంతో మహేశ్ బాబుతో రాజమౌళి చేయబోయే చిత్రం (SSBM 29) క్రేజ్ మరో లెవెల్‍లో ఉంది. గ్లోబల్ రేంజ్‍లోనే భారీ బడ్జెట్‍తో ఈ మూవీని రాజమౌళి తెరకెక్కించనున్నారు. అయితే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అనే నిరీక్షణ మాత్రం కొనసాగుతోంది.
ఎస్ఎస్ఎంబీ29 చిత్రానికి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్‍పై ఆయన బిగ్ అప్‍డేట్ చెప్పారు. తాజాగా ఓ ప్రెస్‍మీట్‍లో పాల్గొన్న విజయేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు.
షూటింగ్ ప్రారంభం అప్పుడే..
ఎస్ఎస్ఎంబీ29 అప్‍డేట్ చెప్పాలని ఈ మీట్‍లో విజయేంద్ర ప్రసాద్‍కు ప్రశ్న ఎదురైంది. దీంతో కాసేపు అలా ఆలోచించి విషయం చెప్పేశారు. 2025 జనవరిలో షూటింగ్ మొదలవుతుందని వెల్లడించారు. దీంతో మరో మూడు నెలల్లోనే ఈ గ్లోబల్ రేంజ్ మూవీ షూటింగ్ షురూ కానుంది.
వచ్చే ఏడాది జనవరిలో ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ షురూ అవుతుందనే అప్‍డేట్ రావడంతో అటు మహేశ్ బాబు అభిమానులు.. ఇటు రాజమౌళి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రూ.3,000కోట్ల మూవీ లోడింగ్ అంటూ అప్పుడే పోస్టులు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ బాక్సాఫీస్‍ను షేక్ చేసే కాంబో అంటూ అభిప్రాయపడుతున్నారు.
మహేశ్ రెడీ
ఎస్ఎస్ఎంబీ29 మూవీ కోసం మహేశ్ బాబు కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే నయా లుక్‍తో రెడీ అయ్యారు. ఎక్కువ గడ్డం, లాంగ్ హెయిర్‌తో మహేశ్ లుక్ అదిరిపోయింది. మహేశ్ ముందు హాలీవుడ్ స్టార్స్ కూడా దిగదుడుపే అంటూ ఆయన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ చిత్రం కోసం కండలను కూడా భారీగానే పెంచారు సూపర్ స్టార్. ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు.
రాజమౌళి కూడా షూటింగ్ ముందు చేయాల్సిన ప్లాన్‍ను ఈ మూవీ కోసం చేస్తున్నారని తెలుస్తోంది. వర్క్ షాప్‍లు కూడా ఇప్పటికే జరిగాయని టాక్ ఉంది. మూడేళ్లలో ఈ సినిమాను ఫినిష్ చేసేలా రాజమౌళి ఆలోచిస్తున్నారు. ఈ చిత్రం అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. స్క్రిప్ట్ పూర్తయిందంటూ ఈ ఏడాది జూలైలోనే ఆయన వెల్లడించారు. స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్‍కు రాజమౌళి కొన్ని మార్పులు చేశారన్నది కూడా ఇండస్ట్రీ వర్గాల టాక్.
రాజమౌళి - మహేశ్ బాబు మూవీలో ఎవరు నటిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్‍తో మూవీ టీమ్ చర్చలు జరుపుతోందని కూడా రూమర్లు వచ్చాయి. ఈ విషయం త్వరలోనే ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మలయాళంలో పెద్ద హీరో అయిన పృథ్విరాజ్.. సలార్ మూవీతో పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు. దీంతో ఆయన పేరును ఎస్ఎస్ఎంబీ29 టీమ్ పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇండోనేషియా నటి చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ కూడా ఈ మూవీలో నటిస్తారని రూమర్లు ఉన్నాయి.