RGV on Vijay Deverakonda: విజయ్.. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను చూసి నేర్చుకో: ఆర్జీవీ
RGV on Vijay Deverakonda: విజయ్.. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను చూసి నేర్చుకో అంటూ లైగర్ స్టార్‌కు సూచించాడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. లైగర్ మూవీ సూపర్ ఫ్లాప్ తర్వాత ఆర్జీవీ ఈ కామెంట్స్ చేశాడు.
RGV on Vijay Deverakonda: లైగర్ ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజైంది. భారీ బడ్జెట్, పాన్ ఇండియా మూవీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ దారుణంగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ మూవీ బాయ్‌కాట్ పిలుపు కూడా ఫెయిల్యూర్‌కు ఒక కారణమైంది. అయితే లైగర్ రిలీజ్‌కు ముందు ఈ మూవీపై ప్రశంసలు కురిపించిన ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ తీరును విమర్శిస్తున్నాడు.
ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను చూసి నేర్చుకోవాలని సూచించాడు. అంతేకాదు లైగర్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చింది కరణ్ జోహార్ వల్లేనని కూడా ఆర్జీవీ స్పష్టం చేశాడు. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత కరణ్ సినిమాలను బాయ్‌కాట్ చేయాలన్న పిలుపు కామనైపోయిందని వర్మ అభిప్రాయపడ్డాడు.
"విజయ్ స్టేజ్‌పైన ఎప్పటిలాగే దూకుడుగా ఉన్నాడు. అందరి అటెన్షెన్ కోరుకునే మనస్తత్వం అతనిది. అయితే లైగర్ బాయ్‌కాట్ ఉద్యమానికి ప్రధాన కారణం మాత్రం కరణ్ జోహారే. అతనికి ఈ సినిమాతో లింకు ఉండటంతో బాయ్‌కాట్ పిలుపు జోరందుకుంది. సుశాంత్ మరణం తర్వాత కరణ్ సినిమాలను బాయ్‌కాట్ చేయాలన్న పిలుపు ఎక్కువైంది" అని ఆర్జీవీ అన్నాడు.
ఇక మరో ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండను ఇతర టాలీవుడ్ స్టార్లయిన ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పోల్చాడు. ఈ ముగ్గురు స్టార్ల వినయం హిందీ ప్రేక్షకులకు బాగా నచ్చిందని, ఆ విషయంలో విజయ్ ఆటిట్యూట్ కూడా దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు.
"ఇందులో మరో అంశం ఏంటంటే వినయం. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, ప్రభాస్‌ల వినయం చూసి హిందీ ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యారు. వాళ్ల సింప్లిసిటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాలీవుడ్ హీరోల అహంకారం చూసిన తర్వాత సౌత్ స్టార్ల వినయం చూసి ఆశ్చర్యపోయారు. కానీ విజయ్ మాత్రం లైగర్ ఈవెంట్లలో దూకుడుగా స్పీచ్‌లు ఇచ్చాడు. ఇది కూడా కాస్త ప్రతికూలమైంది" అని ఆర్జీబీ చెప్పాడు.
లైగర్ ప్రమోషన్ల సందర్భంగా ఈ బాయ్‌కాట్ పిలుపులపై విజయ్ స్పందించాడు. తానేమీ తప్పు చేయలేదని, తప్పు చేయనప్పుడు ఇక భయపడాల్సిన పనేంటని ప్రశ్నించాడు. ఏమీ సక్సెస్ లేనప్పుడే తానెవరీ భయపడలేదని, ఇప్పుడు ఎంతో కొంత సక్సెస్ సాధించిన తర్వాత ఎందుకు భయపడాలనీ అన్నాడు. ఈ కామెంట్స్‌పై గతంలో ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ కూడా మండిపడిన విషయం తెలిసిందే.