Jr NTR meets Amit Shah: తెలుగు సినిమా రత్నం జూనియన్ ఎన్టీఆర్: అమిత్ షా
Jr NTR meets Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం(ఆగస్ట్ 21) సాయంత్రం హైదరాబాద్‌లో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కలవడం ఆసక్తి రేపింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్‌లో షేర్ చేశారు.
హైదరాబాద్: తెలుగు సినిమా తారక రత్నం, అత్యంత ప్రతిభావంతుడైన నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది.. ఇదీ తారక్‌ను కలిసి తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఈ ఇద్దరి భేటీ జరగగా.. రాత్రి 11.17 గంటల సమయంలో అమిత్ షా ట్వీట్ చేశారు.
అది కూడా ఇంగ్లిష్‌తోపాటు తెలుగులోనూ ఆయన ట్వీట్ చేయడం అసలు విశేషం. మునుగోడు బీజేపీ సభలో పాల్గొనడానికి వచ్చిన అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నాడన్న వార్త ఆదివారం ఉదయం నుంచి ఎంతో ఆసక్తి రేపింది. రాత్రి 10.30 సమయంలో ఈ ఇద్దరూ హైదరాబాద్‌లోని నొవోటెల్ హోటల్‌లో కలిశారు. ఈ ఫొటోను అమిత్ షా షేర్ చేసిన తర్వాత ఇవి వైరల్‌గా మారాయి.
"అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, మన తెలుగు సినిమా తారక రత్నం అయిన జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది" అంటూ అమిత్ షా తెలుగులో ట్వీట్ చేశారు. ఈ ఇద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. వీళ్లిద్దరూ 45 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించారు.
అందులో 20 నిమిషాల పాటు ఈ ఇద్దరు మాత్రమే చర్చించుకోవడం గమనార్హం. ఆ తర్వాత అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు కలిసి భోజనం చేశారు. ఈ ఇద్దరి భేటీ సందర్భంగా ఎన్టీఆర్ సినిమాలతోపాటు కొన్ని రాజకీయ సంబంధిత అంశాలపై కూడా చర్చించుకున్నట్లు సమాచారం.
సంబంధిత కథనం