Raa Macha Macha Song: గేమ్ ఛేంజర్ నుంచి ‘రా మచ్చా.. మచ్చా’ సాంగ్ ప్రోమో వచ్చేసింది.. రామ్ చరణ్ స్టెప్స్ అదుర్స్: వీడియో
Game Changer Raa Macha Macha Song: గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ‘రా మచ్చా మచ్చా’ పాట ప్రోమో వచ్చేసింది. డ్యాన్స్ స్టెప్‍లతో రామ్‍చరణ్ అదరగొట్టారు. ఈ సాంగ్ గ్రాండ్‍గా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్న మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. ‘రా మచ్చా మచ్చా’ అంటూ ఈ చిత్రం నుంచి రెండో పాట రానుంది. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను మూవీ టీమ్ నేడు (సెప్టెంబర్ 28) రిలీజ్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ పొటిలికల్ యాక్షన్ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుంచి రెండో పాట ప్రోమో ఆకట్టుకుంటోంది.
ప్రోమో ఇలా..
హెలికాప్టర్ నుంచి రామ్‍చరణ్ దిగుతున్నట్టుగా ఉండే షాట్‍తో ఈ పాట ప్రోమో వీడియో మొదలైంది. ‘రా మచ్చా మచ్చా’ అంటూ మాస్ బీట్‍తో పాట సాగింది. ప్రోమో అంతా ఫుల్ జోష్‍తో ఉంది. అదిరిపోయే ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్. ఈ పాటను నకాష్ అజీజ్ పాడారు. అనంత శ్రీరామ్ సంగీతం అందించారు.
డ్యాన్స్ హైలైట్
‘రా మచ్చా మచ్చా’ పాట ప్రోమోలో రామ్‍చరణ్ డ్యాన్స్ అదిరిపోయింది. క్లాస్ డ్రెస్‍లో మాస్ బీట్‍కు సింపుల్ గ్రేస్‍ఫుల్ స్టెప్‍లతో అదుర్స్ అనిపించారు చెర్రీ. ఇక ఈ పాట శంకర్ మార్కుతో గ్రాండ్‍గా ఉండనుందని ప్రోమోతో అర్థమవుతోంది. వేలాది మంది ఈ పాట బ్యాక్‍గ్రౌండ్‍లో కనిపించనున్నారు. గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్‍కు ఇది ఇంట్రడక్షన్ సాంగ్ అనే టాక్ ఉంది.
రామ్‍చరణ్ తొలి చిత్రం చిరుత రిలీజై నేటికి (సెప్టెంబర్ 28) 17 సంవత్సరాలు అయింది. ఇదే రోజు గేమ్ ఛేంజర్ రెండో పాట ప్రోమోను మూవీ టీమ్ తీసుకొచ్చింది.
ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..
గేమ్ ఛేంజర్ నుంచి రెండో పాటగా ‘రా మచ్చా మచ్చా’ పూర్తి పాట సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ ఈ పాట రానుంది. ప్రోమో కూడా మూడు భాషల్లో వచ్చింది.
ఈ రెండో సాంగ్ ప్రోమోలో కూడా సినిమా రిలీజ్ డేట్‍ను మూవీ టీమ్ కన్ఫర్మ్ చేయలేదు. గేమ్ ఛేంజర్ డిసెంబర్ 20న రిలీజ్ అవుతుందని థమన్ ట్వీట్లు చేసినా.. మూవీ టీమ్ మాత్రం అధికారికంగా ఇంకా చెప్పడం లేదు. దీంతో ఈ విషయంలో ఇంకా టెన్షన్ కొనసాగుతోంది. మరి ఫుల్ సాంగ్ తీసుకొచ్చినప్పుడైనా రిలీజ్ డేట్‍ను ప్రకటిస్తుందేమో చూడాలి.
గేమ్ ఛేంజర్ సినిమాలో ఐఏఎస్ అధికారి రామ్‍నందన్ పాత్ర పోషించారు రామ్‍చరణ్. రాజకీయ అంశాల చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. అయితే, ఇది పక్కా కమర్షియల్ చిత్రమని నిర్మాత దిల్‍రాజు గతంలో చెప్పారు. ఈ చిత్రంలోని పాటలు చాలా గ్రాండ్‍గా ఉంటాయని అన్నారు. అందుకు తగ్గట్టే ఇప్పుడు వచ్చిన రెండో పాట ప్రోమో కూడా ఉంది.
గేమ్ ఛేంజర్ సినిమాకు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రంలో రామ్‍చరణ్‍కు జోడీగా కియారా అడ్వానీ నటించారు. అంజలి, ఎస్‍జే సూర్య, శ్రీకాంత్, జయరాం, సునీల్, సముద్రఖని కీరలకపాత్రలు చేశారు.