Kajal Agarwal: ఏ మతం గురించి అలా చెప్పలేదు.. రామ్ చరణ్‌లా చేస్తే నమ్మరు: కాజల్ అగర్వాల్-kajal agarwal about religion in satyabhama movie and says if i do action scenes like ram charan audience wont believe ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kajal Agarwal: ఏ మతం గురించి అలా చెప్పలేదు.. రామ్ చరణ్‌లా చేస్తే నమ్మరు: కాజల్ అగర్వాల్

Kajal Agarwal: ఏ మతం గురించి అలా చెప్పలేదు.. రామ్ చరణ్‌లా చేస్తే నమ్మరు: కాజల్ అగర్వాల్

Sanjiv Kumar HT Telugu
Jun 07, 2024 06:32 AM IST

Kajal Agarwal About Religion In Satyabhama Movie: రామ్ చరణ్‌పై, మతానికి సంబంధించి కాజల్ అగర్వాల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ నటించిన సత్యభామ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆ సినిమాకు సంబంధించి, హీరోయిన్స్ పోలీస్ రోల్స్ గురించి మాట్లాడింది.

ఏ మతం గురించి అలా చెప్పలేదు.. రామ్ చరణ్‌లా చేస్తే నమ్మరు: కాజల్ అగర్వాల్
ఏ మతం గురించి అలా చెప్పలేదు.. రామ్ చరణ్‌లా చేస్తే నమ్మరు: కాజల్ అగర్వాల్

Kajal Agarwal Ram Charan Satyabhama: 20 ఏళ్లుగా సినీ కేరీర్‌లో సత్తా చాటుతూ దూసుకుపోతోంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఎంతోమంది స్టార్ హీరోలతో జోడీ కట్టి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. వివాహం అనంతరం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టేందుకు ప్రయత్నిస్తోంది కాజల్.

తెలుగులో భగవంత్ కేసరి మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ రోల్‌లో లేడి ఒరియెంటెడ్ సినిమాగా వస్తోంది సత్యభామ. సుమన్ చిక్కాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాను అవురమ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న అంటే ఇవాళ విడుదల కానుంది. కానీ, ఇప్పటికే ప్రమోషన్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది మూవీ టీమ్.

ఈ నేపథ్యంలో ఇటీవల ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలు చెప్పుకొచ్చింది కాజల్ అగర్వాల్. "గతంలో జిల్లా సినిమాలో పోలీస్ గెటప్‌లో కనిపించా. అయితే అది సీరియస్‌నెస్ ఉన్న రోల్ కాదు. సత్యభామలో మాత్రం ఎమోషన్, యాక్షన్ ఉన్న పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తా. పోలీస్ రోల్స్ గతంలో ఎంతోమంది హీరోయిన్స్ చేసి ఉంటారు. కానీ, ఇది నాకు కొత్త. నా తరహాలో పర్‌ఫార్మ్ చేశాను. మీకు నచ్చుతుందనే ఆశిస్తున్నా" అని కాజల్ అగర్వాల్ తెలిపింది.

"యూత్, బెట్టింగ్‌‌తో పాటు ఓ రిలీజియన్ గురించి సత్యభామలో కీ పాయింట్స్ ఉంటాయి. అయితే ఏ మతానికి పాజిటివ్‌గా నెగిటివ్‌గా ఏదీ చెప్పడం లేదు. జస్ట్ ఆ అంశం కథలో ఉంటుంది అంతే. మీరు ట్రైలర్ చూసిన దాని కంటే ఎన్నో ట్విస్ట్‌లు, టర్న్స్ మూవీలో ఉంటాయి. అవన్నీ మూవీలో చూసి మీ రెస్పాన్స్‌ చెబుతారని కోరుకుంటున్నా" అని కాజల్ అగర్వాల్ పేర్కొంది.

"సత్యభామలో యాక్షన్ సీక్వెన్సుల కోసం ఎంతో కష్టపడ్డా. ఆ ఫైట్స్ అన్నీ రియలిస్టిక్‌గా ఉంటాయి. నేను రామ్ చరణ్‌లా వంద మందిని కొడితే ప్రేక్షకులు నమ్మరు. నా ఇమేజ్‌కు ప్రేక్షకులు ఇష్టపడేలా స్టంట్స్ ఉంటాయి. సుబ్బు యాక్షన్ సీక్వెన్సులు కొరియోగ్రాఫ్ చేశారు" అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

"మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల తన బెస్ట్ ఎఫర్ట్స్ సత్యభామ కోసం పెట్టాడు. మా ఇద్దరికీ రాక్ మ్యూజిక్ అంటే ఇష్టం. మేము ఆ పాటల గురించి, మ్యూజిక్ గురించి మాట్లాడుకునేవాళ్లం. పెళ్లయ్యాక ఒక హీరోయిన్ కెరీర్ ఎందుకు మారాలో అర్థం కాదు. అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. అలాగే హీరోయిన్స్ కు కూడా. గతంలో పెళ్లయ్యాక హీరోయిన్స్‌కు అవకాశాలు తగ్గాయేమో.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లయ్యాక ఎంతోమంది హీరోయిన్స్ అంతకముందు కంటే బిజీగా సినిమాలు చేస్తున్నారు" అని కాజల్ అన్నారు.

"భారతీయుడు 2 సినిమా రిలీజ్ కోసం ఎగ్జైటెడ్‌గా వెయిట్ చేస్తున్నా. భారతీయుడు 3లో నా క్యారెక్టర్ ఉంటుంది. ఈ సినిమాలో నేను చాలా కొత్తగా డిఫరెంట్ రోల్ లో కనిపిస్తా. వైవిధ్యమైన మూవీస్ చేస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. కొత్త దర్శకులతోనూ పనిచేస్తా. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. ఏ రంగంలోనైనా కొత్త వారిని ఎంకరేజ్ చేయాలి. ప్రస్తుతం రెండు కొత్త సినిమాలు సైన్ చేశా. వాటి డీటెయిల్స్ ప్రొడక్షన్ కంపెనీస్ అనౌన్స్ చేస్తాయి" అని కాజల్ తెలిపింది.

"నేను నా వ్యక్తిగతమైన లైఫ్‌ను కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఇది కష్టమైన పనే. కానీ నటన అంటే ప్యాషన్ కాబట్టి కష్టమైన ఇష్టంగా చేసుకుంటూ వస్తున్నా. ఈ జర్నీలో మా వారి సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంది. సౌత్‌లో నాతో పాటు సమంత, రాశీ ఖన్నా మా ఆయనకు ఫేవరేట్ హీరోయిన్స్" అని కాజల్ అగర్వాల్ భర్త గురించి తెలిపింది.