Vijayashanti Kajal Aggarwal: అప్పట్లో విజయశాంతి.. ఇప్పుడు కాజల్ అగర్వాల్: డైరెక్టర్ అనిల్ రావిపూడి
Anil Ravipudi About Kajal Aggarwal In Satyabhama Trailer Launch: సత్యభామ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆసక్తికర కామెంట్స్ చేశారు. అప్పట్లో విజయశాంతి ఎలాగో ఇప్పుడు కాజల్ అగర్వాల్ అని అనిల్ రావిపూడి చెప్పారు.
Anil Ravipudi About Kajal Aggarwal Vijayashanti: కాజల్ అగర్వాల్ నటిస్తున్న లేడి ఒరియెంటెడ్ మూవీ సత్యభామ. హీరో నవీన్ చంద్ర మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను అవురమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించగా.. మేజర్ డైరెక్టర్ శశికిరణ్ తిక్క సమర్పిస్తూ స్క్రీన్ ప్లే అందించారు.
మల్టీ ఫోల్డెడ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. జూన్ 7న సత్యభామ చిత్రం గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానున్న సందర్భంగా ఇటీవల ట్రైలర్ లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం బాలకృష్ణతోపాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ఇచ్చిన స్పీచ్ ఆకట్టుకుంది.
"సత్యభామ మూవీ చాలా బాగా వచ్చిందని తెలుసు. ఈ మూవీకి మంచి టీమ్ వర్క్ చేసింది. శశికిరణ్ తిక్క, బాబీ తిక్క.. వీళ్ల పేర్లలో తిక్క ఉంది గానీ వాళ్ల సినిమాలకు ఓ లెక్క ఉంది. నవీన్ చంద్ర మంచి యాక్టర్. అతనికి ఈ సినిమా సక్సెస్ ఇవ్వాలి. డైరెక్టర్ సుమన్ ఫస్ట్ ఫిల్మ్. ఆయనకు సత్యభామతో బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా" అని అనిల్ రావిపూడి తెలిపారు.
"కాజల్ అగర్వాల్ 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో ఉండటం మామూలు విషయం కాదు. మా భగవంత్ కేసరి సినిమాతో ఆమె కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది. మరో 15 ఏళ్లు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. పోలీస్ క్యారెక్టర్స్ కొందరు హీరోయిన్స్‌కే సూట్ అవుతాయి. అప్పట్లో విజయశాంతి గారిలా ఇప్పుడు కాజల్‌కు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యింది. ఆమె యూనిఫామ్‌లో కూడా చాలా బాగున్నారు. కాజల్ ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సులు చేసింది" అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.
"బాలకృష్ణ గారు 45 డిగ్రీల ఎండల్లో హిందూపూర్‌లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. ఆయనకు ఫోన్ చేస్తే షూటింగ్‌కు రెడీ అన్నారు. అదీ ఆయన ఎనర్జీ. భగవంత్ కేసరిలో పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ గారిని చూపించాను. మళ్లీ అవకాశం వస్తే పోలీస్ క్యారెక్టర్ లో ఆయనలోని పూర్తి ఎనర్జీని చూపిస్తాను. సత్యభామ బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అని డైరెక్టర్ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
"బాలకృష్ణ గారు, అనిల్ రావిపూడి గారు మా సత్యభామ ట్రైలర్ లాంచ్‌కు రావడం హ్యాపీగా ఉంది. బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి చేశాను. సెట్‌లో ఆయన ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయాను. పదిమంది రౌడీలను కొట్టే ఒక యాక్షన్ సీక్వెన్స్ సింగిల్ టేక్‌లో చేశారు. ఆయన ఎన్నో జెనరేషన్స్‌కు గుర్తుంటారు" హీరో నవీన్ చంద్ర అన్నారు.
"సత్యభామ గురించి చెప్పాలంటే ఒకరోజు శశికిరణ్ ఫోన్ చేసి మూవీ గురించి చెప్పారు. చాలా మంచి సబ్జెక్ట్. నా క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. వెంటనే అంగీకరించాను. కాజల్ అగర్వాల్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకుంటారు. మా చేతిలో ఒక సక్సెస్‌ఫుల్ సినిమా ఉంది. సత్యభామ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం" అని నవీన్ చంద్ర తెలిపారు.