Hanuman OTT: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్.. ఎక్కడ చూడాలంటే?-hanuman hindi version to make ott and tv debut watch it on jio cinema colors cineplex ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Hanuman Hindi Version To Make Ott And Tv Debut Watch It On Jio Cinema Colors Cineplex

Hanuman OTT: మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Mar 16, 2024 02:56 PM IST

Hanuman OTT: హనుమాన్ మూవీ మరికొన్ని గంటల్లోనే ఓటీటీ, టీవీల్లోకి అడుగుపెట్టబోతోంది. శనివారం (మార్చి 16) రాత్రి నుంచే రానుండగా.. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులోకి రానుంది.

మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్
మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్

Hanuman OTT: హనుమాన్ మూవీ కోసం రెండు నెలలుగా ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురు చూపులు మరికొన్ని గంటల్లో ఫలించనున్నాయి. ఈ సినిమా ఒకేసారి ఓటీటీ, టీవీల్లోకి అడుగుపెట్టబోతోంది. శనివారం (మార్చి 16) రాత్రి 8 గంటలకు హనుమాన్ మూవీ చూసే అవకాశం బుల్లితెర ప్రేక్షకులకు లభించనుంది. అయితే ఈ సినిమా ఎక్కడ చూడాలి?

ఓటీటీలోకి హనుమాన్

హనుమాన్ మూవీ ఓటీటీ, టీవీల్లోకి వస్తున్నా ప్రస్తుతానికి కేవలం హిందీ వెర్షన్ మాత్రమే చూసే వీలుంటుంది. ఈ మూవీ హిందీ వెర్షన్ హక్కులను జియో సినిమా సొంతం చేసుకుంది. దీంతో శనివారం రాత్రి 8 గంటల తర్వాత ఈ ఓటీటీలో ఎప్పుడైనా ఈ సినిమా చూడొచ్చు. ఇక అదే సమయానికి కలర్స్ సినీప్లెక్స్ ఛానెల్లోనూ హనుమాన్ టెలికాస్ట్ కానుంది.

దీంతో ఒకేసారి ఓటీటీ, టీవీ ప్రీమియర్ కానున్న సినిమాగా హనుమాన్ నిలవనుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ హనుమాన్ రిలీజైంది. అయితే ఊహించినదాని కంటే ఎక్కువగానే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లతో ఈ మూవీ దుమ్ము రేపింది. దీంతో సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది.

హనుమాన్ తెలుగు ఓటీటీ రిలీజ్ ఎప్పుడు?

మొత్తానికి హనుమాన్ జియో సినిమా ఓటీటీలోకి వస్తున్నా.. కేవలం హిందీ వెర్షన్ కావడంతో తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. నిజానికి తెలుగుతోపాటు ఇతర భాషల హక్కులు జీ5 (ZEE5) ఓటీటీకి దక్కాయి. ఈ మధ్యే ఆ ఓటీటీ మూవీ రిలీజ్ పై అధికారిక ప్రకటన చేసింది. అభిమానుల ఎదురు చూపులు ఫలించబోతున్నాయని, త్వరలోనే హనుమాన్ ఓటీటీలోకి రాబోతోందని తెలిపింది.

అయితే ఈ సినిమా కచ్చితంగా ఏ రోజు వస్తుందన్నది మాత్రం వెల్లడించలేదు. మార్చి 8న శివరాత్రి సందర్భంగానే వస్తుందని చాలా మంది భావించారు. కానీ దీనిపై ఎలాంటి సమాచారం లేదంటూ జీ5 నిరాశ పరిచింది. మొత్తానికి ఓ తేదీ అంటూ చెప్పకపోయినా.. త్వరలోనే అంటూ ఓ అధికారిక ప్రకటన ఆ ఓటీటీ నుంచి రావడం మాత్రం ప్రేక్షకులకు కాస్త ఊరట కలిగించేదే.

ఈ వీకెండ్ ఓటీటీలోకి రాకపోవడంతో ఇక వచ్చే వారమే వస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన వచ్చే శుక్రవారం (మార్చి 22) హనుమాన్ తెలుగు వెర్షన్ డిజిటల్ ప్రీమియర్ ఉండే అవకాశం ఉంది. అయితే దీనిపై జీ5 ఓటీటీయే అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఈ హనుమాన్ మూవీలో తేజ సజ్జ నటించాడు. ఓ సాధారణ యువకుడు హనుమాన్ సాయంతో సూపర్ హీరోగా మారిపోయిన తన ఊరిని, ప్రపంచాన్ని ఎలా రక్షించాడన్నదే ఈ సినిమా కథ. దీనికి సీక్వెల్ జై హనుమాన్ కూడా రానుంది. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇప్పటికే థియేటర్లలో మూవీ హిట్ కాగా.. ఓటీటీల్లోనూ అదే రెస్పాన్స్ కోసం తేజ సజ్జ ప్రమోషన్లు కూడా నిర్వహించాడు. దీనికోసం అతడు ముంబై కూడా వెళ్లాడు.

IPL_Entry_Point