OTT Collections: కొత్త ట్రెండ్.. ఓటీటీలోనూ కలెక్షన్‍ల లెక్కలు.. ఆ సినిమాతోనే షురూ చేసిన ఈటీవీ విన్
OTT Collections: ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. ఓటీటీల్లోనూ కలెక్షన్ల లెక్కలను మొదలుపెట్టింది. కమిటీ కుర్రోళ్ళు సినిమాతో దీన్ని ప్రారంభించింది. ఈ మూవీ నుంచి తొలి రోజు వచ్చిన గ్రాస్ లెక్కను వెల్లడించింది. ఆ వివరాలు ఇవే..
సాధారణంగా సినిమాలు థియేటర్లలో ఎంత కలెక్షన్లు సాధించాయో లెక్కలు బయటికి వస్తుంటాయి. కలెక్షన్లతో కూడిన పోస్టర్లను మూవీ టీమ్స్ వెల్లడిస్తుంటాయి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు, రికార్డుల విషయంలో పోటీ ఉంటుంది. అయితే, ఓటీటీల్లో కలెక్షన్లు అనే కాన్సెప్ట్ ఇప్పటి వరకు లేదు. అయితే, ఈ ట్రెండ్‍ను ఈటీవీ విన్ ఓటీటీ మొదలుపెట్టింది. కమిటీ కుర్రోళ్ళు సినిమాకు తొలి రోజు గ్రాస్ అంటూ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసేసింది.
తొలి రోజు ఎంతంటే..
కమిటీ కుర్రోళ్లు సినిమా తొలి రోజు రూ.70,32,416 గ్రాస్ సాధించిందంటూ ఈటీవీ విన్ నేడు (సెప్టెంబర్ 14) ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. బిగ్గెస్ట్ రికార్డు అంటూ సోషల్ మీడియాలో పేర్కొంది. అయితే, దేన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ మొత్తాన్ని ఆ ప్లాట్‍ఫామ్ లెక్కేసిందో స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ఇక ఓటీటీలోనూ రికార్డులు ఉంటాయంటూ ఈవీటీ విన్ ట్వీట్ చేసింది. “సినిమా థియేటర్లోనే కాదు.. ఇక నుంచి ఓటీటీలో కూడా రికార్డులు ఉంటాయి. ఈ జాతరతో మొదలు. ఎటువంటి జాతర అయినా ఈటీవీ విన్‍తోనే” అంటూ కమిటీ కుర్రోళ్ళు తొలి రోజు గ్రాస్ అంటూ పోస్టర్ తీసుకొచ్చింది ఈటీవీ విన్. మొత్తంగా ఓటీటీలో కలెక్షన్ల లెక్కలు వేయడం కొత్తగా ఉంది.
పాజిటివ్ రెస్పాన్స్
కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీన రిలీజైంది. మెగా డాటర్ కొణిదెల నిహారిక నిర్మించిన ఈ చిత్రం అంచనాలకు మించి హిట్ అయింది. నిర్మాతగా తొలి మూవీతోనే ఆమె సక్సెస్ సాధించారు. యధు వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈ గురువారం సెప్టెంబర్ 12న ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీని ప్రశంసిస్తూ చాలా మంది నెటిజన్లు.. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో ఓటీటీలో ఈ మూవీకి భారీగా వ్యూస్ దక్కుతున్నాయి.
కమిటీ కుర్రోళ్ళు సినిమాను రూరల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు దర్శకుడు యధు వంశీ. 1990ల నాటి ఒకప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసేలా, గోదావరి పల్లె అందాలను, స్నేహితుల మధ్య బంధాలను చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో సందీప్ సరోజ్, ప్రసాద్ బెహరా, త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, సాయి కుమార్, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్, శ్యామ్ కల్యాణ్, రఘువరన్ సహా మరికొందరు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రంలో 11 మంది హీరోలు అంటూ మూవీ టీమ్ ముందు నుంచి చెబుతూ వస్తోంది.
కమిటీ కుర్రోళ్ళు సినిమా రూ.5కోట్ల లోపు బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రం సుమారు రూ.17కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి బ్లాక్‍బస్టర్‌గా నిలిచింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అయింది. థియేటర్లలో లాంగ్ రన్ సాధించింది. ప్రొడ్యూజర్‌గా నిహారికకు మంచి ఆరంభం దక్కింది. ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం ఇచ్చారు. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమా మంచి సక్సెస్ అవుతోంది.