Committee Kurrollu Movie Review: కమిటీ కుర్రాళ్లు రివ్యూ - మెగా డాటర్ నిహారిక నిర్మించిన రూరల్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Committee Kurrollu Review: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఫస్ట్ మూవీ కమిటీ కుర్రాళ్లు శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. పదకొండు మంది హీరోలు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన రూరల్ కామెడీ డ్రామా మూవీ ఎలా ఉందంటే?
Committee Kurrollu Review: పదకొండు మంది హీరోలను టాలీవుడ్‌కు పరిచయం చేస్తూ మెగా డాటర్ హారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన తొలి మూవీ కమిటీ కుర్రాళ్లు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ప్రజెంటర్‌గా వ్యవహరించిన ఈ మూవీకి పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు.
రూరల్ కామెడీ డ్రాగా రూపొందిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రొడ్యూసర్‌గా తొలి మూవీతోనే నిహారిక విజయాన్ని అందుకుందా? కమిటీ కుర్రాళ్లు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే..
కమిటీ కుర్రాళ్ల కథ...
గోదావరి జిల్లాల్లోని ఓ పల్లెటూరులో ప్రతి పన్నెండేళ్లకు ఓ సారి జాతర జరగడం ఆనవాయితీగా వస్తుంటుంది. గతసారి జాతరలో బలిచాటకు ఎదురువెళ్లిన ఆత్రం అనే యువకుడు కన్నుమూస్తాడు. ఆత్రం మరణంతో పాటు కులాలు, రిజర్వేషన్ల గురించి వచ్చిన గొడవల కారణంగా శివ (సందీప్ సరోజ్), సుబ్బుతో (త్రినాథ్ వర్మ), విలియం (ఈవ్వర్)తో పాటు చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన ప్రాణ మిత్రుల మధ్య దూరం పెరిగిపోతుంది. పన్నెండేళ్ల తర్వాత మళ్లీ జాతర జరగనుండటంతో ఎలాంటి గొడవలు జరుగుతాయోనని జనాలు భయపడుతుంటారు.
జాతరలో బలిచాటను ఎత్తుకోవడానికి ఎవరూ ముందుకు రారు. మరోవైపు కులాల గొడవలను వాడుకుంటూ ఊరికి చాలా ఏళ్లుగా సర్పంచ్‌గా కొనసాగుతాడు పొలిశెట్టి బుజ్జి (సాయికుమార్). తన స్వార్థ రాజకీయాల కోసం ఊరివాళ్లను కలవకుండా చూస్తుంటాడు. సర్పంచ్ ఎన్నికల్లో బుజ్జికి వ్యతిరేకంగా చనిపోయిన తన తండ్రి స్థానంలో శివ పోటీలో నిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బుజ్జి చేతిలో ఎన్నికల్లో ఓడిపోయిన శివ ఊరి బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?
గొడవల కారణంగా విడిపోయిన కమిటీ కుర్రాళ్లు జాతర కారణంగా తిరిగి ఎలా ఒక్కటయ్యారు? బలిచాటను ఎత్తుకునే విషయంలో శివ, అతడి స్నేహితులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? జాతర సక్రమంగా జరిగిందా? ఎన్నికల ప్రచారంలో ఎలాంటి గొడవలు జరిగాయి? రెండు వర్గాలుగా విడిపోయిన ఊరు ఎన్నికలు కారణంగా మరింత దూరం పెరిగిందా...తగ్గిందా అన్నదే కమిటీ కుర్రాళ్లు మూవీ (Committee Kurrollu Review)కథ.
అచ్చమైన పల్లెటూరి జీవితం
కమిటీ కుర్రాళ్లు అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెటూరి కథ. పల్లెటూళ్లలో కల్మషం లేని మనుషులు, వారి స్నేహాలు... అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయన్నది దర్శకుడు యదు వంశీ నాచురల్‌గా ఈ సినిమాలో చూపించారు. ఓ సినిమాలా కాకుండా ఓ పల్లె వాతావరణాన్ని కళ్ల ముందు తీసుకొచ్చి ఓ నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను కలిగించాడు.
అంతర్లీనంగా మెసేజ్...
ఈ రూరల్ కామెడీ డ్రామాలో(Committee Kurrollu Review) అంతర్లీనంగా రిజర్వేషన్ల కు సంబంధించిన ఓ ఇష్యూను ఎలాంటి వివాదాలకు తావులేకుండా టచ్ చేయడం బాగుంది. ప్రతిభ ఉండి చదువుకు కొందరు ఎలా దూరం అవుతున్నారనే అంశాన్ని హృద్యంగా ఆవిష్కరించాడు. ఆ పాయింట్‌తోనే స్నేహితుల మధ్య దూరం పెరగడం అనే అంశాన్ని రాసుకున్న తీరు ఆకట్టుకుంటుంది.
గోదావరి యాస, భాషలతో...
కమిటీ కుర్రాళ్లు (Committee Kurrollu Review) సినిమాలో స్టార్స్ అంటూ ఎవరూ లేరు. అందరూ కొత్తవాళ్లే సినిమాలో కనిపిస్తారు. ప్రతి పాత్ర గోదావరి మాండలికంలోనే మాట్లాడుతూ కనిపిస్తుంది. అదే ఈ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. మొబైల్స్, సోషల్ మీడియా ప్రభావం మొదలవ్వని టైమ్‌లో కుర్రాళ్ల అల్లరి పనులు, ఆటలు, ప్రేమాయణాలు ఎలా ఉండేవన్నది చూపిస్తూ ఫస్ట్ హాఫ్ టైమ్‌పాస్ చేశాడు దర్శకుడు.
కులాలు, రిజర్వేషన్ల గొడవ వల్ల స్నేహితుల మధ్య దూరం పెరగడం, ఆ తర్వా తవచ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశాడు.
స్పీడు తగ్గింది...
సెకండాఫ్ లో ఎప్పుడైతే సినిమా కామెడీ నుంచి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుందో అప్పుడే కథలో స్పీడు తగ్గింది. ఎన్నికల్లో బుజ్జికి వ్యతిరేకంగా శివ నిల్చోవడం, ప్రచారంలో ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు, మరోవైపు జాతరను సక్రమంగా నిర్వహించేందుకు స్నేహితులు చేసే ప్రయత్నాల్లో కొన్ని ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తే మరికొన్ని మనసుల్ని కదలిస్తాయి. విడిపోయిన స్నేహితులు తిరిగి కలిసే సీన్‌ను ఇంకాస్త డెప్త్‌గా కన్వీన్సింగ్‌గా రాసుకుంటే బాగుండేది. ఎన్నికల ప్రచారంలో వచ్చే కొన్ని పొలిటికల్ డైలాగ్స్ పవన్‌ను ఉద్దేశించి రాసినట్లుగా ఉన్నాయి. ఆ విషయాన్ని దర్శకుడు ప్రమోషన్స్ లో వెల్లడించాడు.
పదకొండు మంది హీరోలు...
కమిటీ కుర్రాళ్లుగా మూవీలో 11 మంది హీరోల నటన బాగుంది. ప్రతి ఒక్కరూ పోటీపడి నటించారు. అయితే శివగా సందీప్ సరోజ్ ఎక్కువగా హైలైట్ అయ్యాడు. యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ఈశ్వర్‌లకు నటన గుర్తుండిపోతుంది.
పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో సాయికుమార్ తన నటనానుభవంతో అదరగొట్టాడు. గోపరాజు రమణ, శ్రీలక్ష్మి, కేరాఫ్ కంచెరపాలెం కిషోర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమాకు దీపక్‌దేవ్ మ్యూజిక్ పెద్ద ప్లస్సయింది. పాటలు, జాతర నేపథ్యంలో వచ్చే బీజీఎమ్ ఆకట్టుకుంటాయి. కెమెరామెన్ మారాజు గోదావరి అందాలను చక్కగా చూపించాడు.
పల్లెటూరి జ్ఞాపకాలు...
కమిటీ కుర్రాళ్లు పల్లెటూళ్లలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి తమ జ్ఞాపకాల్ని గుర్తుకుతెస్తుంది. చాలా రోజుల తర్వాత ప్యూర్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి మంచి మూవీ. నవ్విస్తూనే ఆలోచింపజేస్తుంది.
రేటింగ్: 3/5