David Warner On Movie : మహేశ్, అల్లు అర్జున్ హీరోలు.. నేను విలన్.. ఆమె హీరోయిన్గా బెటర్
David Warner On Movie : చాలామంది తెలుగు వాళ్లకు క్రికెటర్ డేవిడ్ వార్నర్ బాగా తెలుసు. తెలుగు సినిమా డైలాగ్స్ చెబుతూ.., పాటలకు స్టెప్పులేస్తూ.. దగ్గరయ్యాడు. అయితే వార్నర్ కు సినిమాల్లో నటించే అవకాశం వస్తే.. ఎవరితో చేస్తాడో చెప్పాడు.
డేవిడ్ వార్నర్.. ఐపీఎల్(IPL)లో ఒకప్పుడు హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇక అప్పటి నుంచి తెలుగు వాళ్లకు దగ్గరవుతూ వచ్చాడు. సోషల్ మీడియాను ఎక్కువగా చూసేవారికి డేవిడ్ వార్నర్ గురించి తెలుసు. తెలుగు పాటలకు డ్యాన్స్(Telugu Songs) చేస్తూ, తెలుగు డైలాగ్స్ చెబుతూ.. అదరగొడతాడు. మైదానంలో అడుగుపెడితే రెచ్చిపోవడమే కాదు.. సోషల్ మీడియాలోనూ రెచ్చిపోతుంటాడు. కుటుంబంతో కలిసి రీల్స్ చేస్తాడు.
ఒకవేళ సినిమాల్లో నటించాల్సి వస్తే తన డ్రీమ్ కాస్ట్ ఎవరో చెప్పాడు వార్నర్. మహేశ్‌బాబు(Mahesh Babu), అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక(Rashmika)తో కలిసి పనిచేయాలని ఉందని తెలిపాడు. తాను విలన్ పాత్ర పోషిస్తానని చెప్పాడు. స్పై మూవీ చేయాల్సి వస్తే.. ఎవరితో పని చేస్తావని, డ్రీమ్ కాస్ట్ ఎవరు అని ఇంటర్వ్యూలో డేవిడ్ వార్నర్ ను ప్రశ్న అడగగా వెంటనే ఇలా సమాధానమిచ్చాడు.
'నా డ్రీమ్ కాస్ట్ మహేశ్‌బాబు, అల్లుఅర్జున్, రష్మిక. రష్మిక అల్లుఅర్జున్‌తో కూడా పనిచేసింది. నేను బ్యాడ్ గాయ్‌గా ఉంటాను. విలన్ పాత్ర పోషిస్తాను. అది నా నేచర్.' అని చెప్పాడు వార్నర్.
టిక్ టాక్ గురించి కూడా వార్నర్ మాట్లాడాడు. ఇండియన్ పాటలకు ఎందుకు చేశాడో కూడా చెప్పాడు. మెుదట వార్నర్ కు టిక్ టాక్ అంటే ఏంటో తెలియదట. కరోనా సమయంలో అసలు టిక్ టాక్ లో ఏం జరుగుతుందో చూడాలనుకున్నాని తెలిపాడు. తనకు నచ్చడంతో, అదే సమయంలో కొంతమంది ఓ సాంగ్ నువ్ కూడా చేయ్ అని చెప్పారు. దీంతో తనకు తెలిసిన మూడు హిందీ పాటలకు టిక్ టాక్ చేశాడు వార్నర్. హైదరాబాద్ ఫ్యాన్స్... బుట్టుబొమ్మ సాంగ్ చేయమని సూచించారు. ఆ పాటకు వార్నర్ టిక్ టాక్ చేయడంతో వీడియో వైరల్ అయింది.
కరోనా(Corona) సమయంలో వార్నర్ .. తన భార్యతో కలిసి చాలా టిక్ టాక్ వీడియోలు చేశాడు. అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో బుట్టుబొమ్మ, సరిలేరు నీకెవ్వరులో మైండ్ బ్లాక్ పాటలకు డ్యాన్స్ చేశాడు. కొన్ని రోజుల కిందట.. పుష్పలోని ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. పాటను ఇమిటేట్ చేస్తూ.. వీడియో చేశాడు. చాలా తెలుగు పాటలకు చిందులేశాడు ఈ క్రికెటర్.
ప్రస్తుతం ఐపీఎల్ లో దిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టుకు కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ ఉన్నాడు. ఈ ఏడాది దిల్లీ పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. అయినా మైదానంలోనూ వార్నర్ తన ఎంటర్టైన్మెంట్ ను అందిస్తూనే ఉన్నాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో జడేజా, వార్నర్ మధ్య జరిగిన సంఘటన వైరల్ గా మారింది.