RCB vs SRH: నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌లో విరాట్ సెంచరీ - సన్‌రైజర్స్‌పై బెంగళూరు సూపర్ విక్టరీ
RCB vs SRH: విరాట్ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో సన్‌రైజర్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ ద్వారా దాదాపు నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్‌లో సెంచరీ చేసిన కోహ్లి పలు రికార్డులను తిరగరాశాడు.
RCB vs SRH: ఐపీఎల్‌లో సెంచరీ మార్కు కోసం నాలుగేళ్లు ఎదురుచూసిన విరాట్ కోహ్లి నిరీక్షణకు తెరపడింది. గురువారం ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి శతకంతో చెలరేగడంతో రాయల్ ఛాలెంజర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో రాయల్‌ఛాలెంజర్స్ తరఫున విరాట్ సెంచరీ చేయగా సన్‌రైజర్స్ టీమ్‌లో క్లాసెన్ కూడా సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి.
సన్‌రైజర్స్ విధించిన 187 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలో దిగిన బెంగళూరుకు కోహ్లి, డుప్లెసిస్ కలిసి మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరు కలిసి ఫస్ట్ వికెట్‌కు 172 పరుగులు జోడించారు. కోహ్లి, డుప్లెసిస్ ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడంతో బెంగళూరు 11 ఓవర్లలోనే 100 పరుగుల చేసింది.
హాఫ్ సెంచరీలు చేసిన తర్వాత కోహ్లి, డుప్లెసిస్ దూకుడు పెంచారు. ఈ క్రమంలో భువనేశ్వర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి 62 బాల్స్‌లోనే సెంచరీ పూర్తిచేసుకున్నాడు కోహ్లి. చివరగా కోహ్లి 2019 ఐపీఎల్ సీజన్‌లో సెంచరీ చేశాడు.
మళ్లీ నాలుగేళ్ల తర్వాత సెంచరీ మార్కును అందుకొని రికార్డ్ క్రియేట్ చేశాడు. సెంచరీ పూర్తయిన తర్వాతి బంతికే భువనేశ్వర్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. మొత్తంగా 63 బాల్స్‌లో 12 ఫోర్లు 4 సిక్సర్లతో కోహ్లి 100 పరుగులు చేశాడు. మరోవైపు డుప్లెసిస్ 47 బాల్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 71 పరుగులు చేసి బెంగళూరుకు విజయాన్ని అందించారు.
చివరలో కోహ్లి, డుప్లెసిస్ ఔటైనా మ్యాక్స్‌వెల్, బ్రాస్‌వెల్ కలిసి గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మయాంక్‌ధాగర్ మినహా మిగిలిన వారందరూ ధారళంగా పరుగులు ఇచ్చారు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 రన్స్ చేసింది. క్లాసెన్ (51 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్లతో 101 రన్స్) సెంచరీతో మెరవడంతో సన్‌రైజర్స్ భారీ స్కోరు చేసింది. కానీ కోహ్లి మెరుపులతో అతడి శ్రమ వృథాగా మారింది.
ప్లేఆఫ్స్‌కు చేరువలో బెంగళూరు
సన్‌రైజర్స్‌పై గెలుపుతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో ఫోర్త్ ప్లేస్‌లోకి చేరుకున్న బెంగళూరు ప్లేఆఫ్స్ రేసులో నిలిచింది. ప్రస్తుతం చెరో 14 పాయింట్లతో ముంబై, బెంగళూరు సమానంగా ఉన్నాయి. కానీ రన్‌రేట్ ప్రకారం బెంగళూరు ఫోర్త్ ప్లేస్‌లో నిలవగా ముంబై ఐదో స్థానంలో ఉంది. తన చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్‌తో బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే బెంగళూరు నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.