IPL 2023 Records: ధావన్ చెత్త రికార్డు.. తన రికార్డు తానే బ్రేక్ చేసిన వార్నర్
IPL 2023 Records: ధావన్ చెత్త రికార్డు నమోదు చేస్తే.. తన రికార్డు తానే బ్రేక్ చేశాడు డేవిడ్ వార్నర్. ఒకే మ్యాచ్ లో రెండు జట్ల కెప్టెన్లు ఇలా రికార్డులను తమ పేరిట రాసుకోవడం విశేషం.
IPL 2023 Records: ఐపీఎల్ 2023లో ఒకే మ్యాచ్ లో రెండు జట్ల కెప్టెన్లు రికార్డులు క్రియేట్ చేశారు. కాకపోతే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ పేరిట చెత్త రికార్డు నమోదు కాగా.. డీసీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన రికార్డు తానే బ్రేక్ చేశాడు. ఐపీఎల్ 2023లో జరిగిన 64వ మ్యాచ్ లో ఈ రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ను ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్.. వాళ్ల ప్లేఆఫ్స్ అవకాశాలను దారుణంగా దెబ్బతీసిన విషయం తెలిసిందే.
ధావన్ చెత్త రికార్డు
ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా పేరుగాంచిన శిఖర్ ధావన్.. డీసీతో మ్యాచ్ లో మాత్రం ఓ చెత్త రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఈ మ్యాచ్ లో అతడు డకౌటయ్యాడు. ఐపీఎల్లో ఇది అతనికి 10వ డక్. దీంతో లీగ్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన ఓపెనర్ల లిస్టులో ధావన్ రెండోస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో అతడు గంభీర్, రహానే సరసన నిలిచాడు.
ఈ ఇద్దరు బ్యాటర్లు కూడా ఐపీఎల్లో ఓపెనర్లుగా వచ్చి పది సార్లు డకౌటయ్యారు. ఇక ఓపెనర్ గా వచ్చి అత్యధిక డకౌట్ల రికార్డు మాత్రం పార్థివ్ పటేల్ పేరిట ఉంది. అతడు 11సార్లు డకౌట్ కావడం విశేషం.
వార్నర్ మరో రికార్డు
డీసీ కెప్టెన్ గా వార్నర్ కు ఈ సీజన్ చేదు అనుభవాన్నే మిగిల్చినా బ్యాటర్ గా తన రికార్డులను మెరుగుపరచుకున్నాడు. తాజాగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో 31 బంతుల్లో 46 పరుగులు చేయడం ద్వారా తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక ఫ్రాంఛైజీపై అత్యధిక పరుగులు చేసిన రికార్డును వార్నర్ నమోదు చేశాడు.
అతడు పంజాబ్ కింగ్స్ పై 1084 రన్స్ చేశాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ పై 1075 పరుగులతో ఉన్న తన రికార్డును తానే వార్నర్ బ్రేక్ చేశాడు. ఇక వార్నర్ తర్వాత శిఖర్ ధావన్ ఉన్నాడు. అతడు సీఎస్కేపై 1057 పరుగులు చేశాడు. ఆ తర్వాత కేకేఆర్ పై రోహిత్ శర్మ 1040, డీసీపై విరాట్ కోహ్లి 1030 పరుగులు చేశారు.
సంబంధిత కథనం