Shikhar Dhawan Record: ఐపీఎల్లో శిఖర్ ధావన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మెగా లీగ్ లో అత్యంత నిలకడగా ఆడుతున్న ప్లేయర్ గా నిలిచిన ధావన్.. తాజాగా 50వ హాఫ్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో ప్లేయర్ శిఖర్ ధావన్. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా 50కిపైగా హాఫ్ సెంచరీలు చేశారు.
ఈ సీజన్ ఐపీఎల్లో ధావన్ 8 మ్యాచ్ లలో 3 హాఫ్ సెంచరీలు చేశాడు. ఓవరాల్ గా అత్యధిక పరుగులు చేసిన వాళ్ల లిస్టులో 9వ స్థానంలో ధావన్.. అత్యధిక ఫోర్లు కొట్టిన వాళ్లలో తొలిస్థానం, ఇప్పుడు అత్యధిక హాఫ్ సెంచరీల లిస్టులో మూడోస్థానంలో ఉన్నాడు. సోమవారం కేకేఆర్ తో మ్యాచ్ లోనూ మరో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ కింగ్స్ మంచి స్కోరు సాధించడంలో అతడు కీలకపాత్ర పోషించాడు.
ధావన్ 47 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అందులో 9 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఈ ఏడాది అతడు గాయం కారణంగా మూడు మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు. గత నెల 28న లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ నుంచి తిరిగి పంజాబ్ కింగ్స్ కు ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023లో ధావన్ 8 మ్యాచ్ లు ఆడి 349 రన్స్ చేశాడు. అందులో 99 పరుగులు అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు.
సంబంధిత కథనం