Alliant Group In Hyderabad : హైదరాబాద్ లో అలియంట్ సంస్థ నూతన సెంటర్, 9 వేల ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ ట్వీట్
Alliant Group Center In Hyderabad : అమెరికాకు చెందిన అలియంట్ గ్రూప్ హైదరాబాద్ లో నూతన సెంటర్ ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ తో చర్చలు జరిపింది. ఈ సంస్థ రాకతో 9 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
Alliant Group Center In Hyderabad :హైదరాబాద్ లో నూతన సెంటర్ ఏర్పాటు చేసేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంస్థతో రాకతో 9 వేల ఉద్యోగాలు వస్తాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన అలియంట్ గ్రూపు... హైదరాబాద్‌లో నూతన సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్ తో చర్చలు జరిపింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో గుర్తింపు పొందిన అలియంట్ సంస్థ సీఈవో ధవల్ జాదవ్‌ను హూస్టన్‌లో మంత్రి కేటీఆర్ కలిశారు. కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పవర్‌హౌజ్‌గా అలియంట్ గ్రూపునకు పేరుంది. ఈ సంస్థ హైదరాబాద్‌లోని పెట్టుబడులు పెడితే...బీఎఫ్ఎస్ఐ రంగాన్ని మరింత బలోపేతం అవుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
9 వేల మందికి ఉద్యోగాలు
హైదరాబాద్ లో కొత్త సెంటర్ ఏర్పాటుతో ఆ సంస్థ 9 వేల మందిని రిక్రూట్ చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అంతకు ముందు హూస్టన్ లో అలియంట్ గ్రూపు ప్రధాన కార్యాలయానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. ఆ కంపెనీ ఉద్యోగులు మంత్రి కేటీఆర్‌కు గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. అలియంట్ సంస్థ తీసుకున్న నిర్ణయంతో పెట్టుబడిదారులకు హైదరాబాద్ పై ఉన్న విశ్వాసం, నమ్మకం మరింత పెరిగిందని కేటీఆర్ అన్నారు.
కేటీఆర్ అమెరికా టూర్, పెట్టుబడుల వెల్లువ
అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్.. వరుసగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. పెట్టుబడులకు తెలంగాణ ఎంత అనుకూలమైనదో వివరిస్తూ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాల ఫలితంగా తాజాగా హైదరాబాద్ లో అలియంట్ గ్రూప్ సెంటర్ ఏర్పాటుచేసేందుకు నిర్ణయించింది. అదేవిధంగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హైదరాబాద్‌లో అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మెడికల్ డివైజెస్ ఉత్పత్తిలో గ్లోబల్ లీడర్ అయిన మెడ్‌ట్రానిక్స్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు రూ.3 వేల కోట్లతో హైదరాబాద్‌లో మెడికల్ డివైజెస్ ఆర్‌అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తో భేటీలో స్పష్టం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో మెడ్‌ట్రానిక్స్ కంపెనీ ప్రతినిధులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం విధానాలతో వ్యాపార అనుకూలతలు ఉన్నాయని, అందుకే పెట్టుబడులు తరలివస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా వెలుపల మెడ్‌ట్రానిక్స్ అతిపెద్ద ఆర్ అండ్ డి సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తుండటం విశేషమన్నారు.