Aadujeevitham day 1 box office collection: ఆడుజీవితం బాక్సాఫీస్ కలెక్షన్.. తొలి రోజే దుమ్ము రేపిన సర్వైవల్ థ్రిల్లర్
Aadujeevitham day 1 box office collection: మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ఆడుజీవితం ది గోట్ లైఫ్ మూవీ తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది.
Aadujeevitham day 1 box office collection: మలయాల సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఆడుజీవితం (ది గోట్ లైఫ్) ఊహించినట్లే తొలి రోజే భారీ ఓపెనింగ్స్ సాధించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళంలలో రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి.
ఆడుజీవితం ఫస్ట్ డే కలెక్షన్స్
ఆడుజీవితం మూవీ తొలి రోజే ఇండియాలో రూ.7.45 కోట్లు వసూలు చేసినట్లు ప్రముఖ వెబ్‌సైట్ Sacnilk.com వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి ఈ మూవీ కలెక్షన్లు రూ.16 కోట్లుగా ఉండటం విశేషం. మలయాళంలో మరో రూ.100 కోట్ల సినిమాగా నిలుస్తుందని రిలీజ్ కు ముందే ది గోట్ లైఫ్ ను అభివర్ణించారు. ఊహించినట్లే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా ఆ దిశగా తొలి అడుగు వేసింది.
గురువారం (మార్చి 28) మూవీ రిలీజ్ కాగా.. తొలి రోజు మలయాళం డొమెస్టిక్ మార్కెట్లోనే రూ.6.5 కోట్లు వసూలు చేసినట్లు ముందస్తు అంచనాలు వెల్లడించాయి. ఇక తెలుగులో రూ.40 లక్షలు, కన్నడలో రూ.40 లక్షలు, తమిళంలో రూ.50 లక్షలు, హిందీలో రూ.10 లక్షల నెట్ కలెక్షన్లు వచ్చాయి. కేరళలో ఈ సినిమాకు ఓ రేంజ్ క్రేజ్ ఉంది. అక్కడ తొలి రోజు 57.79 శాతం ఆక్యుపెన్సీ నమోదైనట్లు అంచనా.
ఆడుజీవితం మూవీ ఎలా ఉందంటే?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ ఆడుజీవితం మూవీ ఓ మాస్టర్ పీస్ అంటూ తొలి షో నుంచే ప్రేక్షకులు సోషల్ మీడియా ఎక్స్ లో తమ రివ్యూలు ఇచ్చారు. ముఖ్యంగా ఇందులో అతని నటనకు చాలా ఫిదా అవుతున్నారు. రిలీజ్ కు ముందే పలువురు తెలుగు డైరెక్టర్లతోపాటు కమల్ హాసన్, మణిరత్నంలాంటి వాళ్లు తమిళ ఇండస్ట్రీ వాళ్లు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
బ్లెస్సీ డైరెక్ట్ చేసిన ది గోట్ లైఫ్ మూవీ.. ఆడుజీవితం అనే నవల ఆధారంగా తెరకెక్కింది. ఇది కూడా ఓ రియల్ స్టోరీ. కేరళకు చెందిన నజీబ్ అనే ఓ వలస కూలీ సౌదీ అరేబియా ఎడారిలో ఓ బానిసగా బతుకు వెల్లదీసిన ఘటనను స్ఫూర్తిగా తీసుకొని మూవీ తీశారు. తినడానికి సరైన తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలని అతడు చేసే ప్రయత్నాలను సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు.
2008లో అనుకున్న ఈ సినిమా ఏకంగా 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2018లోనే షూటింగ్ మొదలైనా.. కరోనా కారణంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. మొత్తానికి గురువారం రిలీజైంది. ఈ మూవీ రిలీజ్ కు ముందు మూవీ టీమ్ కేరళతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర చోట్లు కూడా ప్రమోషన్లు నిర్వహించారు. ఈ సినిమా కోసం తాను చాలా శ్రమించానని, 31 కిలోల బరువు తగ్గాల్సి వచ్చిందని పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పాడు.