Aadujeevitham first review: మలయాళంలో మరో సర్వైవల్ థ్రిల్లర్.. ఆడుజీవితం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
Aadujeevitham first review: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ఆడుజీవితం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ మూవీ ఎవరిపై అయితే రూపొందించారో అదే నజీబ్ మూవీపై రివ్యూ ఇచ్చాడు.
Aadujeevitham first review: మలయాళంలో మరో సర్వైవల్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ మధ్యే వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయగా.. ఇప్పుడు మరో నిజజీవిత ఘటన ఆధారంగా రూపొందిన ఆడుజీవితం మూవీ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే తాజాగా ఎవరి నిజజీవిత అడ్వెంచర్ ఆధారంగా ఈ మూవీ రూపొందించారో ఆ వలస కూలీ నజీబ్ మూవీ చూసి తన రివ్యూ ఇచ్చాడు.
ఆడుజీవితంపై నజీబ్ ఏమన్నాడంటే..
వలస కూలీ నజీబ్ ముహమ్మద్ రియల్ లైఫ్ స్టోరీ ఇది. దీనిపై ఆడుజీవితం పేరుతో బెన్యమిన్ రాసిన నవల ఆధారంగా ఇప్పుడదే టైటిల్ తో సినిమా తీశారు. ఇందులో నజీబ్ పాత్రను ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించాడు. బ్లెస్సీ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా నజీబ్ ఓ ప్రివ్యూ షోలో చూశాడు. దీనిపై తాజాగా అతడు మీడియాతో మాట్లాడాడు.
ఈ సినిమా తనను చాలా ఎమోషనల్ చేసిందని నజీబ్ ముహమ్మద్ అన్నాడు. సినిమాలో తన పాత్రను దాదాపు పరిపూర్ణంగా పోషించాడంటూ పృథ్వీరాజ్ సుకుమారన్ పై ప్రశంసలు కురిపించాడు. అతని నటన చూసి తనకు మాటలు రాలేదని అన్నాడు. ఎడారిలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను అతడు కళ్లకు కట్టినట్లు చూపించాడని చెప్పాడు.
ఆడుజీవితం మూవీని చూడటానికి తన కుటుంబం, స్నేహితులు ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు కూడా నజీబ్ తెలిపాడు. నిజ జీవితంలో తాను ఎడారిలో చిక్కుకుపోయిన పడిన ఇబ్బందులను వాళ్లు నేరుగా చూడకపోయినా.. ఈ సినిమా ద్వారా వాళ్లు చూడబోతున్నట్లు చెప్పాడు. ఈ సినిమా తీసే సమయంలోనూ పృథ్వీరాజ్ సుకుమారన్, బ్లెస్సీ, ఇతర మూవీ సిబ్బంది మొత్తం ఎన్నో ఇబ్బందులు పడినట్లు వివరించాడు.
16 ఏళ్ల కింద మొదలు పెట్టి..
నిజానికి ఈ ఆడుజీవితం మూవీని 2008లోనే అనుకున్నారు. సూర్య, విక్రమ్ లాంటి తమిళ నటులను ఇందులో లీడ్ రోల్ కోసం సంప్రదించారు. కానీ వాళ్లు నిరాకరించడంతో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ దగ్గరికి వెళ్లారు. ఆ తర్వాత కూడా సినిమాకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రీప్రొడక్షన్ ఎన్నో అడ్డంకుల మధ్య సాగి చివరికి 2018లో సినిమా షూటింగ్ మొదలైంది.
అయితే కొవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కూ ఇబ్బందులు తలెత్తాయి. ఈ సినిమాలో నజీబ్ పాత్ర పోషించిన పృథ్వీరాజ్.. అతని జీవితంలో బాగా బతికిన రోజుల సమయంలోని పాత్ర కోసం 97 కిలోల వరకూ బరువు పెరిగాడు. ఆ తర్వాత సౌదీ అరేబియాలోని ఓ మేకల ఫారంలో బానిసగా బతుకు వెల్లదీసినప్పుడు బక్కచిక్కిన పాత్ర కోసం 30 కిలోలు తగ్గాడు.
ఈ సినిమాలో నజీబ్ భార్య సైను పాత్రను అమలా పాల్ పోషించింది. ఆడుజీవితం సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఈ మధ్యే మూవీ ట్రైలర్ రిలీజైంది. ఇక సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతోంది.