Bramayugam OTT: ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. మెగాస్టార్ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Bramayugam OTT Release: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ భ్రమయుగం. బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసిన భ్రమయుగం సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమాను ఎక్కడ చూడాలంటే..
Bramayugam OTT Streaming: ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా ఎంజాయ్ చేసే సినిమాల్లో హారర్ జోనర్స్ ఒకటి. హారర్ థ్రిల్లర్ సినిమాలను భయపడుతూనే ఎంతగానో ఆస్వాదిస్తుంటారు. ఇప్పటికే ఓటీటీలో హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సా ఎక్స్, ది ఎగ్జార్సిస్ట్, ది నన్ 2 సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా వీటి జాబితాలోకి సరికొత్తగా మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హారర్ థ్రిల్లర్ మూవీ భ్రమయుగం చేరింది. ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా హారర్ థ్రిల్లర్ సినిమానే భ్రమయుగం. ఈ సినిమాకు రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ, వై నాట్ స్టూడియోస్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మించారు. భ్రమయుగం మూవీలో మమ్ముట్టితోపాటు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ ముఖ్య పాత్రలు పోషించారు. హారర్ థ్రిల్లర్ సినిమాల్లో సంగీతం, బీజీఎమ్‌లది కీ రోల్. అలాంటి ఈ సినిమాకు క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 15న కేరళలోని థియేటర్లలో విడుదలైన భ్రమయుగం సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన భ్రమయుగం మూవీకి ఇండియాలో 18 రోజుల్లోనే రూ. 25.82 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాకు ఐమ్‌డీబీ సంస్థ పదికి 8.4 రేటింగ్ ఇచ్చింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంతటి విజయం అందుకుందో. అలాంటి భ్రమయుగం మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
భ్రమయుగం సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు ప్రముఖ సంస్థ సోని లివ్ చేజిక్కించుకుంది. ఇదివరకు ప్రకటించినట్లుగానే మార్చి 15 నుంచి సోని లివ్‌లో భ్రమయుగం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సోని లివ్ ఓటీటీలో భ్రమయుగం సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. కాబట్టి భారతదేశంలోని ప్రతి ఒక్క ప్రేక్షకుడు భ్రమయుగం సినిమా చూసేందుకు అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 72 ఏళ్ల వయసులోనూ తన స్టార్ డమ్ పక్కన పెట్టి కంటెంట్ ప్రాధన్యత సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. అందుకు ఉదాహరణే కాదల్ ది కోర్. జ్యోతిక మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో మెగాస్టార్ మమ్ముట్టి ఒక గేగా నటించి ఆకట్టుకున్నారు. దాదాపు స్టార్ హీరో చేయని పాత్రను మమ్ముట్టి పోషించి ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ అందుకుంది.
కాదల్ ది కోర్ మాత్రమే కాకుండా కన్నూర్ స్క్వాడ్ అనే మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీతో అలరించారు మమ్ముట్టి. ఇక మూడోసారి కూడా భ్రమయుగం మూవీతో మంచి హిట్ కొట్టి మొత్తంగా హ్యాట్రిక్‌ను ఆయన ఖాతాలో వేసుకున్నారు. సెన్సిటివ్, క్రైమ్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ ఇలా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ నటుడిగా గొప్ప స్థానం సంపాదించుకున్నారు 72 ఏళ్ల మమ్ముట్టి. కాగా మమ్ముట్టి బజూకా, టర్బో, కడుగన్నవా ఒరు వంటి సినిమాలు చేయనున్నారు.