PM MODI: కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ; వివేకానంద ధ్యానమండపంలో 45 గంటల పాటు ధ్యానం-pm arrives in kanyakumari to meditate for 45 hrs at vivekananda rock memorial ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pm Modi: కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ; వివేకానంద ధ్యానమండపంలో 45 గంటల పాటు ధ్యానం

PM MODI: కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ; వివేకానంద ధ్యానమండపంలో 45 గంటల పాటు ధ్యానం

HT Telugu Desk HT Telugu
May 30, 2024 08:00 PM IST

లోక్ సభ ఎన్నికల ప్రచార సంరంభం ముగిసిన నేపథ్యంలో ప్రధాని మోదీ గురువారం సాయంత్రం తమిళనాడులోని తీర పట్టణం కన్యాకుమారి చేరుకున్నారు. ఇక్కడ స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలో ప్రధాని మోదీ జూన్ 1 సాయంత్రం వరకు ధ్యానం చేయనున్నారు. ఇక్కడే స్వామి వివేకానందకు భరతమాత దర్శనం లభించిందని విశ్వసిస్తారు.

కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ
కన్యాకుమారి చేరుకున్న ప్రధాని మోదీ (ANI)

లోక్ సభ ఎన్నికల చివరి దశ ప్రచారం ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) గురువారం కన్యాకుమారి చేరుకున్నారు. ఇక్కడ సముద్ర తీరంలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద జూన్ 1 వరకు ప్రధాని ధ్యానంలో పాల్గొంటారు. వివేకానంద రాక్ మెమోరియల్ కు వెళ్లే ముందు నగరంలోని భగవతి అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు.

జూన్ 1 సాయంత్రం వరకు ధ్యానం

ప్రముఖ హిందూ తత్వవేత్త స్వామి వివేకానంద ఇక్కడ ధ్యానం చేస్తున్న సమయంలోనే 'భరతమాత' దివ్య దర్శనం పొందారని విశ్వసిస్తారు. ఈ ధ్యాన మండపంలో గురువారం సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు మోదీ ధ్యానం (Meditation) చేస్తారు.

భద్రత కట్టుదిట్టం

మోదీ పర్యటన నేపథ్యంలో కన్యాకుమారిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ కూడా ప్రధాని భద్రతలో పాలు పంచుకుంటున్నాయి. గురువారం నుంచి శనివారం వరకు ఈ బీచ్ పర్యాటకులకు అందుబాటులో ఉండదు. ప్రైవేట్ బోట్లను అనుమతించబోరు. 2014 ఎన్నికల ప్రచారం ముగిశాక శివాజీ నేతృత్వంలోని మరాఠా దళాలకు, జనరల్ అఫ్జల్ ఖాన్ నేతృత్వంలోని బీజాపూర్ దళాలకు మధ్య యుద్ధం జరిగిన ప్రతాప్ గఢ్ ను నాటి బీజేపీ నేత నరేంద్ర మోదీ సందర్శించారు. ఆ తరువాత, 2019లో కేదార్ నాథ్ లోని ప్రత్యేక గుహలో ధ్యానం చేసిన తొలి వ్యక్తిగా మోదీ రికార్డు సృష్టించారు.

ఇది కూడా ఎన్నికల నిబంధనల ఉల్లంఘనే..

కన్యాకుమారి ప్రధాని మోదీ సందర్శించడాన్ని, అక్కడ ధ్యానం చేయడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇది కూడా ఒక రకమైన ప్రచారమేనని, ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని విమర్శించింది. ప్రధాని మోదీ ధ్యానానికి సంబంధించిన వార్తలను మీడియా ప్రసారం చేయకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎన్నికల సంఘానికి అధికారికంగా ఫిర్యాదు కూడా చేసింది.

ముగిసిన ప్రచారం..

చండీగఢ్ తో పాటు పంజాబ్ లోని 13, హిమాచల్ ప్రదేశ్ లోని 4, ఉత్తరప్రదేశ్ లోని 13, పశ్చిమబెంగాల్ లోని 9, బీహార్ లోని 8, ఒడిశాలోని 6, జార్ఖండ్ లోని 3 స్థానాలకు జూన్ 1న చివరి దశలో ఎన్నికలు జరగనున్నాయి. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో 68 రోజుల ప్రచార వ్యవధి ఉండగా, ఈసారి 76 రోజులుగా ఉంది.

Whats_app_banner