Kedarnath: కేదార్ నాథ్ లో హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్; బెంబేలెత్తిన భక్తులు
యాత్రికులు సహా ఏడుగురితో బయలుదేరిన హెలికాప్టర్ సాంకేతిక సమస్య కారణంగా ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్రమత్తతతో వ్యవహరించిన పైలట్ చాకచక్యంగా హెలీకాప్టర్ ను సేఫ్ గా ల్యాండ్ చేశాడు.
ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ లో శుక్రవారం తెల్లవారుజామున సాంకేతిక లోపం తలెత్తడంతో యాత్రికులు సహా ఏడుగురితో వెళ్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. హిమాలయాల్లోని ప్రఖ్యాత కేదార్ నాథ్ దేవాలయంలోని హెలిప్యాడ్ కు కొన్ని మీటర్ల దూరంలో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆరుగురు యాత్రికులు, పైలట్ సహా మొత్తం ఏడుగురు సురక్షితంగా ఉన్నారు. సిర్సీ హెలిప్యాడ్ నుంచి శుక్రవారం తెల్లవారుజామున కేదార్ నాథ్ కు హెలికాప్టర్ బయలుదేరిందని రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ గహర్వార్ తెలిపారు.
చాపర్ లో సాంకేతిక సమస్య
హెలికాప్టర్ వెనుక మోటారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో కేదార్ నాథ్ (Kedarnath) లోని హెలిప్యాడ్ కు కొన్ని మీటర్ల దూరంలో పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారని ప్రాథమిక నివేదికలను ఉటంకిస్తూ అధికారి తెలిపారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. అప్రమత్తతతో వ్యవహరించిన పైలట్ చాకచక్యంగా నిర్ణయం తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా ఉన్నారని, ఆలయంలో "దర్శనం" చేసుకున్న తరువాత యాత్రికులు తిరిగి వచ్చారని గహర్వార్ చెప్పారు.
మే 10 నుంచి..
శివుడి అవతారంగా పూజించబడే కేదార్ నాథ్ ధామ్ ఈ అక్షయ తృతీయ (మే 10) రోజున భక్తుల కోసం తలుపులు తెరిచింది. కార్తీక పౌర్ణమి (నవంబర్ 15) వరకు తెరిచి ఉంటుంది. చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra) కు సంబంధించిన 4 తీర్థయాత్రలలో ఇది ఒకటి. చార్ ధామ్ యాత్ర అనేది నాలుగు పవిత్ర ప్రదేశాల యాత్ర. అవి యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్. హిందీలో 'చార్' అంటే నాలుగు అని, 'ధామ్' అంటే పుణ్య క్షేత్రాలు అని అర్థం.ఈ ఏడాది దేశ విదేశాల నుంచి 26 లక్షల మంది భక్తులు చార్ ధామ్ యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు. సాధారణంగా ఏప్రిల్-మే నుంచి అక్టోబర్-నవంబర్ వరకు జరిగే ఈ యాత్ర మే 10న ప్రారంభమైంది.
వీఐపీ దర్శనాలపై నిషేధం
ప్రస్తుతం జరుగుతున్న చార్ ధామ్ యాత్ర సందర్భంగా భక్తులందరూ నాలుగు ధామ్ లను సులభంగా దర్శించుకోవడానికి వీలుగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం వీఐపీ దర్శనాలపై నిషేధాన్ని మే 31 వరకు పొడిగించింది. అలాగే, మొత్తం నాలుగు ధామ్ (CharDham Yatra) లలో ఆలయ సముదాయాలకు 50 మీటర్ల పరిధిలో వీడియోగ్రఫీ, సోషల్ మీడియా రీల్స్ చేయడాన్ని కూడా నిషేధించారు.