Char Dham Yatra 2023 । ఛార్ ధామ్ యాత్రకు ఆసన్నమైన సమయం.. ముఖ్యమైన తేదీలు ఇవే!
Char Dham Yatra 2023: ఈ ఏడాది చార్ ధామ్ యాత్ర తేదీలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, యాత్రకు సంబంధించిన ఇతర పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Char Dham Yatra 2023: ఆధ్యాత్మిక చింతనతో పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ సాగే తీర్థయాత్ర ఎంతో పావనమైనది. భారతదేశంలో తీర్థయాత్రలు చేయదగిన ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే అత్యంత ముఖ్యమైన తీర్థయాత్రలలో చార్ ధామ్ యాత్ర ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న నాలుగు పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ సాగే పవిత్ర యాత్ర ఇది. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ అనే నాలుగు క్షేత్రాలకు చేసే యాత్రను ఛార్ ధామ్ యాత్ర అంటారు.
ఛార్ ధామ్ యాత్రతో తమ జీవితం చరితార్థం అవుతుందని భక్తులు భావిస్తారు. ప్రతి సంవత్సరం, వేలాది మంది భక్తులు ఈ యాత్రను నిర్వహిస్తారు. ఈ యాత్ర చేసే అవకాశం రావడం కూడా భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు. ఎందుకంటే ప్రతీయేడు కొంతమందికి మాత్రమే ఛార్ ధామ్ యాత్ర చేసే అవకాశం దక్కుతుంది.
మీరు ఛార్ ధామ్ యాత్ర చేయాలనుకుంటే, ఈ యాత్ర ఎప్పుడు మొదలవుతుంది. ఎన్ని రోజుల వరకు కొనసాగుతుంది, ఈ యాత్ర ప్రక్రియకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Char Dham Opening & Closing Dates 2023 - చార్ ధామ్ యాత్ర తేదీలు
చార్ ధామ్ యాత్ర ఏప్రిల్-మే నెలల్లో ప్రారంభమై అక్టోబర్-నవంబర్ నెలల వరకు కొనసాగుతుంది.
ఈ యాత్రకు ప్రయాణం సాధారణంగా యమునోత్రి నుంచి ప్రారంభమవుతుంది, ఆ తర్వాత గంగోత్రి, అక్కడ్నించి కేదార్‌నాథ్‌లకు వెళ్లి చివరకు బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది.
ఛార్ ధామ్ యాత్ర ఎప్పుడంటే అప్పుడు చేయడానికి వీలుపడదు. ఈ యాత్ర కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా యాత్రికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉత్తరాఖండ్ ప్రభుత్వం చార్ ధామ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియలను ప్రవేశపెట్టింది. ఛార్ ధామ్ సందర్శించే భక్తులకు ఫోటోమెట్రిక్ లేదా బయోమెట్రిక్ నమోదును తప్పనిసరి చేసింది. 2023లో ఏ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకోండి.
Char Dham Yatra Registration Details- ఛార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఎలా
ఈ యాత్ర కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.రిజిస్ట్రేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన వారికి మాత్రమే పుణ్యక్షేత్రాల వద్ద ప్రవేశానికి అనుమతించడం జరుగుతుంది.
- ఈ ఏడాది.. యమునోత్రి, గంగోత్రి ఆలయాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 22 న ప్రారంభమవుతుంది.
- మరోవైపు, కేదార్‌నాథ్ ఆలయానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 26 నుండి ప్రారంభమవుతుంది.
- బద్రీనాథ్ ఆలయానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 27న ప్రారంభమవుతుంది.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ ఫోన్‌కు ప్రత్యేక నంబర్ SMSగా వస్తుంది. దాని తర్వాత, మీరు చార్ ధామ్ యాత్రకు అనుమతి వచ్చినట్లు రిజిస్ట్రేషన్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోగలరు.
- యాత్ర రిజిస్ట్రేషన్ కోసం భక్తులు https://registrationandtouristcare.uk.gov.in/లో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం, ఉత్తరాఖండ్‌లోని అనేక రిజిస్ట్రేషన్ కేంద్రాలలో ఒకదానిని సందర్శించి, అక్కడ ఫార్మాలిటీలను పూర్తి చేయాలి.
ఈ చార్ ధామ్ రిజిస్ట్రేషన్ కోసం యాత్రికులు ఎలాంటి ఛార్జీలు లేదా రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని గమనించండి.
అయితే, ఈ యాత్ర కోసం మీరు పొందాలనుకుంటున్న రవాణా విధానం, వసతులు, సౌకర్యాలు మొదలగు వాటి కోసం ఏదైనా ఒక ప్యాకేజీని ఎంచుకోవాలి. తదనుగుణంగా నగదు చెల్లించాల్సి ఉంటుంది.
ఛార్ ధామ్ యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన యాత్రను అందించడానికి ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ వివిధ రకాల వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, అవసరమైన ఇతర సౌకర్యాలను కూడా అందిస్తుంది. అందువల్ల యాత్రికులు తమ రిజిస్ట్రేషన్ లెటర్, ఐడెంటిటీ ప్రూఫ్, ఇతర అవసరమైన డాక్యుమెంట్లను అన్ని సమయాలలో తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు.
సంబంధిత కథనం