Friday Motivation: మీ మనసును అదుపులో పెట్టుకుంటేనే విజయం దక్కేది, అందుకోసం ధ్యానం చేయక తప్పదు
Friday Motivation: ధ్యానం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. శాంతిమయ జీవితాన్ని నేర్పుతుంది. మనసును, జీవితాన్ని అదుపులో పెట్టుకునే అందమైన మార్గం ధ్యానం.
Friday Motivation: ఒక ఐదు నిమిషాలు పాటు స్థిరంగా కూర్చోలేని ఆధునిక కాలంలో ఉన్నాం మనమంతా. మన జీవితం మన చేతుల్లో లేదు, మన మనసు మన అదుపులో లేదు. కోరికలు గుర్రాలవుతున్నాయి. కోపం కట్టలు తెంచుకుంటుంది. దీని వల్లే మానసిక ప్రశాంతత కరువవుతుంది. మీరు ఏదైనా విజయం సాధించాలంటే ముఖ్యంగా మీ మనసు మీ అదుపులో ఉండాలి. మీ జీవితం మీ చేతుల్లో ఉండాలి. ఇందుకోసం శాంతి, ప్రశాంతత చాలా అవసరం. దీనికి ఉత్తమమైన మార్గం ధ్యానం.
ధ్యానం చేయడం వల్ల మానసిక స్పష్టత వస్తుంది. భావోద్వేగాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఒకచోట మౌనంగా కూర్చుని కళ్ళు మూసుకుని మీ శ్వాస పైనే దృష్టి పెట్టి ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. రోజులో అరగంట ఇలా చేసినా చాలు... మీ జీవితం మీ చేతుల్లోకి కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది.
ధ్యానం చేయడం వల్ల శారీరక భావోద్వేగ బాధలు కూడా తగ్గుతాయి. మానసిక క్షోభలు కలగకుండా ఉంటాయి. నాడీ వ్యవస్థ ప్రశాంతంగా పనిచేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ‘మన జీవితం బాగుంది... మనం బాగున్నాం’ అనే అనుభూతిని కలిగిస్తుంది. దీనివల్ల మనసు, శరీరం ప్రశాంతంగా ఉంటుంది.
ప్రతికూల ఆలోచనలను తొలగించడానికి ధ్యానం అత్యవసరమైనది. ప్రతికూల ఆలోచనలను, భావోద్వేగాలను నియంత్రణలో పెట్టుకుంటే జీవితం గాడిలో పడుతుంది. ఆలోచనలు నిర్ణయాత్మకంగా ఉంటాయి. ఆనందం రెట్టింపు అవుతుంది.
ధ్యానంలో రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఫోకస్డ్ అటెన్షన్ మెడిటేషన్. అంటే ఒకే వస్తువు లేదా ధ్వని, ఆలోచనా, దృశ్యంపై దృష్టి పెట్టడం. ఈ ధ్యానంలో శ్వాస విధానాలపై ఎక్కువగా దృష్టి పెడతారు. ఏదైనా ప్రశాంతమైన ధ్వని వింటూ ధ్యానం చేస్తారు. లేదా కళ్ళు మూసుకొని ఏదైనా ఒక చిత్రాన్ని ఊహించుకొని దృష్టి పెడతారు.
ఇక రెండోది ఓపెన్ మోనిటరింగ్ మెడిటేషన్. ఇందులో కళ్ళు మూసుకుని చేసే టెక్నిక్ ఉండదు. చుట్టూ ఉన్న ప్రకృతిని ఆ అంశాలను అవగాహన పెంచుకుంటూ ఆలోచిస్తూ చేసే ఒక శిక్షణ కార్యక్రమం. ఇది మీ ఆలోచనలు భావాలు ప్రేరణలను అణిచివేయడానికి సహకరిస్తుంది.
సాధారణంగా ధ్యానం చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి స్థాయిలు చాలావరకు తగ్గుతాయి. మనస్సు శాంతంగా ఉంటుంది. బలమైన భావోద్వేగాలు రావు. మీరు ఉత్తమ వ్యక్తిగా ఎదగడంలో ధ్యానం ఎంతో సహాయపడుతుంది.
ముఖ్యంగా చదువుకునే పిల్లలకు ధ్యానం ఎంతో ఉపకరిస్తుంది. వారి మనసులు కలుషితం కాకుండా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. రోజువారీ జీవితంలో విద్యార్థులు ధ్యానాన్ని చేర్చుకుంటే వారి మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చదివింది గుర్తుంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. స్వీయ అవగాహన రెట్టింపు అవుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. డిప్రెషన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఎలాంటి చెడు వ్యసనాలతో వారు బానిసలు కారు. వారిపై వారికి నమ్మకం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.