Kanyakumari Rameswaram IRCTC Package : రూ. 10 వేలతో కన్యాకుమారి, రామేశ్వరం, మధురై టూర్- ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే!
Kanyakumari Rameswaram IRCTC Package : రూ.10 వేలతో 5 రోజుల్లో కన్యాకుమారి, రామేశ్వరం, మధురైలోని ప్రముఖ దేవాలయాలను సందర్శించవచ్చు. బెంగళూరు నుంచి ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kanyakumari Rameswaram IRCTC Package : బెంగళూరు నుంచి కన్యాకుమారి, రామేశ్వరం, మధురైలోని దేవాలయాలు, టూరిస్ట్ ప్రదేశాలు కవర్ చేసేలా ఐఆర్సీటీసీ ట్రైన్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ప్రారంభ ధర రూ.10 వేలతో 5 రోజుల్లో ఈ ప్రాంతాలను దర్శించవచ్చు. కన్యాకుమారి భారతదేశ ద్వీపకల్పం చివరి ప్రాంతం, మూడు మహాసముద్రాలు-బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిసే ప్రాంతం ఇది. హిందూ పుణ్యక్షేత్రంగా పేరొందింది. దీంతో పాటు సముద్ర జలాలపై సూర్యోదయం, సూర్యాస్తమయం దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది.
రామేశ్వరం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన శైవ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ శ్రీరామనాథస్వామికి అంకితం చేసిన ఆలయం ఉంటుంది. శ్రీరాముని జీవితంతో ఈ ప్రాంతానికి చాలా సన్నిహితమైన సంబంధం ఉందంటారు. శైవులు, వైష్ణవులు ఇద్దరూ రామేశ్వరం ఇసుకలోని ప్రతి రేణువును చాలా పవిత్రంగా భావిస్తారు. దక్షిణాది బెనారస్ అని కూడా రామేశ్వరాన్ని పిలుస్తారు. రామేశ్వరాన్ని సందర్శిస్తే కాశీ తీర్థయాత్ర పూర్తవుతుందని హిందువులలో ఒక నమ్మకం ఉంది.
మధురైని 'ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ 'అని పిలుస్తారు. మధురై తమిళనాడులోని పురాతన నగరం. మేలు రకమైన మల్లె పువ్వుల ఉత్పత్తికి మధురై ప్రసిద్ధి. మీనాక్షి అమ్మవారి దేవాలయం తప్పక సందర్శించాల్సిన ప్రాంతం.
ప్యాకేజీ టారీఫ్ :
క్లాస్ | సింగిల్ ఆక్యుపెన్సీ | డబుల్ ఆక్యుపెన్సీ | ట్రిపుల్ ఆక్యుపెన్సీ | చైల్డ్ విత్ బెడ్(5-11 ఏళ్లు) | చైల్డ్ వితవుట్ బెడ్(5-11 ఏళ్లు) |
కంఫర్ట్ | రూ.26370 | రూ.14730 | రూ.11550 | రూ.8880 | రూ.7270 |
స్టాండర్ట్ | రూ.24860 | రూ.13220 | రూ.10050 | రూ.7370 | రూ.5760 |
పర్యటన ప్రయాణం : బెంగళూరు - కన్యాకుమారి - రామేశ్వరం - మధురై - బెంగళూరు
డే 01 (గురువారం) : బెంగుళూరు (SMVT) రైల్వే స్టేషన్ నుంచి రైలు(నెంబర్ 17235) సాయంత్రం 5:00 గంటలకు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
డే 02 (శుక్రవారం) : ఉదయం 08:15 గంటలకు నాగర్‌కోయిల్ జంక్షన్ చేరుకుంటారు. పికప్ వ్యానులో హోటల్‌కి తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్ ఇన్ చేసి ఫ్రెష్ అవుతారు. తర్వాత కుమారి అమ్మన్ ఆలయం, వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువర్ విగ్రహం, గాంధీ మెమోరియల్ సందర్శిస్తారు. సాయంత్రం సన్‌సెట్ పాయింట్, వాక్స్ మ్యూజియం సందర్శించవచ్చు.
డే 03 (శనివారం): సముద్ర తీరంలో సూర్యోదయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. హోటల్ లో చెక్ అవుట్ రామేశ్వరం బయలుదేరతారు. మార్గమధ్యలో తిరుచెందూర్ ను సందర్శిస్తారు. రామేశ్వరం చేరుకుని హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. సాయంత్రం సొంత ఖర్చులతో రామేశ్వరంలో పర్యటించవచ్చు. రాత్రి బస రామేశ్వరంలో ఉంటుంది.
డే 04 (ఆదివారం): తెల్లవారుజామున రామనాథస్వామి ఆలయంలో దర్శనానికి వెళ్తారు. తర్వాత రామర్పాదం ఆలయం, పంచముఖ హనుమాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. హోటల్ లో చెక్ అవుట్ చేసి మధురైకి బయలుదేరతారు. మధురైలో తిరుపురం-కుండ్రం మురుగన్ ఆలయం, తిరుమలై నాయకర్ మహల్, మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి 8 గంటలకు మధురై రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేస్తారు. రైలు(నం. 17236)లో రాత్రి 11:50 గంటలకు బెంగళూరుకు బయలుదేరతారు.
డే 05 (సోమవారం) : బెంగళూరు (SMVT) రైల్వే స్టేషన్‌కు ఉదయం 09:20 గంటలకు చేరుకున్నారు. దీంతో పర్యటన ముగుస్తుంది.
- బెంగళూరు-కన్యాకుమారి-రామేశ్వరం-మధురై టూర్ ప్యాకేజీ బుకింగ్, పూర్తి వివరాలను ఈ లింగ్ https://www.irctctourism.com/pacakage_description?packageCode=SBR034 లో తెలుసుకోవచ్చు.
- విజయవాడ, హైదరాబాద్ నుంచి బెంగళూరు విమాన సర్వీసుల కోసం https://www.air.irctc.co.in/ ఈ లింక్ పై క్లిక్ చేయండి.
- విజయవాడ, హైదరాబాద్ నుంచి బెంగళూరు రైళ్ల సేవల కోసం https://www.irctc.co.in/nget/train-search ఈ లింక్ పై క్లిక్ చేయండి.
సంబంధిత కథనం