Bengaluru explosion: రామేశ్వరం కెఫేలో జరిగింది బాంబు పేలుడే: కర్నాటక సీఎం సిద్ధరామయ్య; 10 ముఖ్యమైన పాయింట్లు
Bengaluru explosion: బెంగళూరులోని రాజాజీ నగర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ హోటల్ రామేశ్వరం కెఫేలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న పేలుడు పై కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. అది బాంబు పేలుడేనని, స్వల్ప స్థాయి పేలుడు పదార్ధాన్ని పేల్చారని సిద్దరామయ్య ధృవీకరించారు.
Bengaluru explosion: రామేశ్వరం కెఫే పేలుడు (Bengaluru explosion)కు తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్థం కారణమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం ధృవీకరించారు. బెంగళూరు నడిబొడ్డున ఉన్న ప్రముఖ కెఫే లో జరిగిన పేలుడు భారత ఐటీ రాజధానిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పేలుడు పదార్ధాన్ని ఓ కస్టమర్ బ్యాగులో ఉంచి, ఆ కెఫేలో పెట్టి వెళ్లినట్లు సిద్దరామయ్య ధృవీకరించారు.
అది బాంబు పేలుడే..
మైసూరులో సిద్ధరామయ్య (Karnataka CM Siddaramaiah) విలేకరులతో మాట్లాడుతూ.. మధ్యాహ్నం తర్వాత రామేశ్వరం కెఫే లో ఎవరో బ్యాగ్ ఉంచారని, అది పేలి కొందరికి గాయాలయ్యాయని చెప్పారు. ‘‘సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం. అది బాంబు పేలుడే. ఎవరు చేశారో తెలియదు. పరిస్థితిని సమీక్షించాలని హోంమంత్రిని ఆదేశించాను’ అని సిద్ధరామయ్య తెలిపారు. ఇది స్వల్ప తీవ్రత కలిగిన పేలుడు అని ముఖ్యమంత్రి చెప్పారు. కర్ణాటకలో చివరి పేలుడు బీజేపీ ప్రభుత్వ హయాంలో మంగళూరులో జరిగిందని, దీనిపై రాజకీయాలు చేయొద్దని అన్నారు.
పేలుడు కు సంబంధించిన కీలక వివరాలు..
1. బెంగళూరులోని రామేశ్వరం కెఫే లో జరిగిన పేలుడు (Bengaluru explosion)లో 9 మంది గాయపడ్డారు.
2. కెఫే లో జరిగినందున ఇది సిలిండర్ పేలుడు అని మొదట భావించారు. కానీ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మొదట ఇది సిలిండర్ పేలుడు కాదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓ కస్టమర్ వదిలివెళ్లిన బ్యాగ్ నుంచి పేలుడు సంభవించిందని కెఫే వ్యవస్థాపకుడు నాగరాజ్ తేజస్వి తెలిపారు.
3. పేలుడు జరిగినప్పుడు లోపల చాలా మంది ఉన్నారని రామేశ్వరం కెఫే (Rameshwaram cafe) సెక్యూరిటీ గార్డు ధృవీకరించారు. పెద్ద శబ్దం రావడంతో మంటలు చెలరేగి కస్టమర్లకు గాయాలయ్యాయి. కస్టమర్లు చేతులు కడుక్కునే ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు సమాచారం.
4. ఫోరెన్సిక్ నిపుణులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు.
5. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంతవరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక లేదు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.
6. పేలుడు తర్వాత కెఫేలోని నేలపై పగిలిన గాజులు మరియు ఫర్నీచర్ పడి ఉన్నాయి. రామేశ్వరం కెఫే ఒక ప్రసిద్ధ హోటల్. ఇక్కడ మధ్యాహ్న భోజన సమయంలో చాలా రద్దీగా ఉంటుంది.
7. NIA దాని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తుంది.
8. ఫోరెన్సిక్స్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ తెలిపారు.
9. అన్ని కోణాల్లోనూ విచారిస్తామని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు.
10. కేఫ్ చైన్ కో-ఫౌండర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ దివ్య రాఘవేంద్ర రావు మాట్లాడుతూ, ఒకదానికొకటి 10 సెకన్లలోపు రెండు పేలుళ్లు సంభవించాయని తనకు చెప్పారని చెప్పారు.