Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వినియోగం,రక్త పరీక్షల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ ఫలితాలు-drug use in bangalore rave party blood tests positive ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వినియోగం,రక్త పరీక్షల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ ఫలితాలు

Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వినియోగం,రక్త పరీక్షల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ ఫలితాలు

Sarath chandra.B HT Telugu
May 23, 2024 02:11 PM IST

Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌ వినియోగించినట్టు బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. గత సోమవారం తెల్లవారుజామున ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ఫాం హౌస్‌లో నిర్వహించిన డ్రగ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

రేవ్ పార్టీ నిర్వాహ‍కుడు విజయవాడకు చెందిన లంకపల్లి వాసు
రేవ్ పార్టీ నిర్వాహ‍కుడు విజయవాడకు చెందిన లంకపల్లి వాసు

Bengaluru Rave Party: బెంగుళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో పాల్గోన్న వారిలో చాలామంది డ్రగ్స్‌ వినియోగించినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం 156మందిని ఫాం హౌస్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 109మంది డ్రగ్స్‌ వినియోగించినట్టు రక్త పరీక్షల్లో తేలింది. వీరిలో 59మంది పురుషులు, 27మంది మహిళలు ఉన్నారు. పార్టీలో పాల్గొన్న వారిలో సినీ నటి హేమ కూడా ఉన్నారు. హేమ.. కృష్ణవేణి పేరుతో రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు బెంగుళూరు పోలీసులు స్పష్టం చేశారు. ఆమె కూడా మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు నిర్ధారించారు. ఈ ఘటనలో హేమకు కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది.

బెంగుళూరులో సన్‌సెట్‌ టూ సన్‌ రైజ్‌ పేరిట నిర్వహించిన పార్టీలో దాదాపు 200మంది పాల్గొన్నారు. వీరిలో ప్రధాన నిందితులు నలుగురు మినహా మిగిలిన వారిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఒక్కొక్కరి నుంచి పార్టీలో పాల్గొనడానికి రూ.2లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. రక్త పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిని విచారించనున్నారు.

ఏం జరిగిందంటే…

బెంగుళూరులో సోమవారం తెల్లవారు జాము వరకు జరిగిన రేవ్ పార్టీని స్థానిక పోలీసులు భగ్నం చేశారు. కాన్‌కర్డ్‌ ఫామ్‌ హౌస్‌లో జరిగిన పార్టీపై దాడి చేసిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్‌ పార్టీలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కారును గుర్తించారు. పోలీసులు ఎమ్మెల్యే పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరిగింది.

ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో గోపాలరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్‌ హౌస్‌లో ఆదివారం రాత్రి పార్టీని ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము వరకు డీజేలతోొ, రేవ్‌ పార్టీని ఏర్పాటు చేవారు. ఈ పార్టీలో ఏపీ, తెలంగాణలకు సినీతారలు, రాజకీయ ప్రముఖులు ఉన్నట్టు గుర్తించారు. తెల్లవారే వరకు భారీ శబ్దాలతో పార్టీ చేస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫాం హౌస్‌లో ఏపీ 26సిఏ 777 వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో పాటు పలు టాప్‌ బ్రాండ్ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాలరెడ్డి అనే వ్యక్తికి చెందిన ఫామ్‌ హౌస్‌లో హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి పార్టీని ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఈ పార్టీలో దాదాపు 200మంది పాల్గొన్నారని, వారిలో కొందరు ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఉన్నారని చెబుతున్నారు

బెంగుళూరు రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. కారుపై ఉన్న స్టిక్కర్ గడువు 2023తో ముగిసిందని స్పష్టం చేశారు. కారుపై స్టిక్కర్‌ ఎలా వచ్చిందో పోలీసుల దర్యాప్తులో తేలుతుందని చెప్పారు. కారుపై ఉన్న స్టిక్కర్‌ ఒరిజినలా డూప్లికేటా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉందన్నారు. బెంగుళూరు రేవ్‌ పార్టీ వ్యవహారంలో తనకు సంబంధం లేదని సినీ నటి హేమ స్పష్టం చేశారు. తాను ఎక్కడికి వెళ్లలేదని హైదరాబాద్‌లోనే ఫామ్‌ హౌస్‌లో ఉన్నానని చెప్పారు.

నటి హేమ ప్రకటన చేసిన కొద్ది గంటలకు బెంగుళూరు సిటీ పోలీస్ కమిషనర్ పార్టీలో హేమ కూడా ఉన్నారని స్పష్టం చేశారు. తాజాగా ఆమెకు నిర్వహించిన రక్త పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది.

పార్టీని నిర్వహించిన లంకపల్లి వాసు విజయవాడకు చెందిన క్రికెట్ బుకీగా గుర్తించారు. నగరానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులకు బినామీగా క్రికెట్ నుంచి పాలిటిక్స్‌ వరకు పందాలు నిర్వహిస్తూ కోట్లకు పడగలెత్తాడు. విజయవాడ నగరం నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు దందాలు విస్తరించాడు.

తెలుగు రాష్ట్రాల పోలీసులతో సంబంధాలు పెట్టుకుని వ్యాపారాన్ని విస్తరించాడు. హైదరాబాద్‌లో డ్రగ్ పార్టీలపై నిఘా ఉండటంతో బెంగుళూరులో ఈవెంట్స్‌ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. విజయవాడకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులకు బినామీగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. డ్రగ్స్‌ వినియోగంతో నిందితుడు రెండు కిడ్నీలు విఫలమయ్యాయని తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం