PM Modi: ‘‘నన్ను నాశనం చేయలేరు.. నేను వినాశనం ఎరుగని కాశీ నుంచి వచ్చాను’’- ప్రధాని మోదీ
lok sabha elections 2024: 2024 ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి తన గెలుపును ఎవరూ ఆపలేరని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తాను వినాశనం తెలియని కాశీకి ప్రాతినిధ్యం వహిస్తున్నానని, తనను నాశనం చేయడం, ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని ధీమా వ్యక్తం చేశారు.
lok sabha elections 2024: ఈ ఎన్నికల్లోనే కాదు రానున్న, ఐదే లేదా ఏడు ఎన్నికలలో కూడా తనదే విజయమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తాను వారణాసికి చెందినవాడినని, వారణాసి వినాశనం ఎరుగని నగరమని, అలాగే, తనను కూడా నాశనం చేయలేరని అన్నారు. ‘‘మై తో అవినాశి హూం, మై తో కాశీ కా హూం.. కాశీ తో అవినాశి హై (నేను కాశీకి చెందినవాడిని.. నన్ను నాశనం చేయలేరు.. కాశీ వినాశనం ఎరుగనిది)’’ అంటూ విపక్షాల విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ధీటుగా బదులిచ్చారు.
జూన్ 4 న మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు
జూన్ 4 న మోదీ ప్రభుత్వ పదవీకాలం ముగుస్తుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ హేళన చేసిన తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆమె చెప్పింది కరెక్టే. ఈ ప్రభుత్వం జూన్ 4తో ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అవునా కాదా? మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’’ అని ప్రధాని మోదీ బదులిచ్చారు. ప్రతిపక్ష పార్టీలను తాను శత్రువులుగా భావించడం లేదని, వారితో కలిసి పనిచేయాలని అనుకుంటున్నానని, అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నేతల నుంచి నిర్మాణాత్మక విమర్శలు, సలహాలకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
నెహ్రూ రికార్డు..
భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మూడు పర్యాయాలు వరుసగా ప్రధానిగా ఉన్న రికార్డును సమం చేయడం గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. ఎన్ని పర్యాయాలు ప్రధానిగా ఉన్నారన్న విషయం కన్నా.. మోదీ పాలనలో భారతదేశం ఎంత పురోగతి సాధించిందో విశ్లేషకులు చెప్పాలని ఆయన అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీస్సులు తనకు ఉన్నందున మోదీ మూడే కాదు.. ఐదు సార్లు లేదా ఏడు సార్లు కూడా గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
370 వస్తాయా?
2014 లో 543 లోకసభ స్థానాలకు గాను బీజేపీ 282 స్థానాలను సాధించి, మిత్రపక్షాలతో కలిసి, ఎన్డీఏ గా అధికారంలోకి వచ్చింది. 2019 లో బీజేపీ విజయం సాధించిన ఎంపీ స్థానాల సంఖ్య 303 కు పెరిగింది. ఇప్పుడు ప్రస్తుత ఎన్నికల్లో (2024 lok sabha elections) 370 స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరో దశ పోలింగ్ నేడు జరుగుతుండగా, చివరి దశ జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.