Amit Shah on PoK: ‘‘పీఓకే మనదే; అందుకే 24 అసెంబ్లీ సీట్లు రిజర్వ్; నెహ్రూ తప్పుల వల్లనే కశ్మీర్ సమస్య’’: అమిత్ షా
Amit Shah on PoK: జమ్మూకశ్మీర్ రీ ఆర్గనైజేషన్ బిల్లు, జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ బిల్లులపై పార్లమెంట్లో జరిగిన చర్చకు బుధవారం సమాధానమిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
Amit Shah on PoK: పార్లమెంట్లో బుధవారం కేంద్ర హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశ తొలిప్రధాని చేసిన రెండు పెద్ద తప్పుల (Nehruvian blunders) కారణంగానే పీఓకేను భారత్ కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. పీఓకే ఇప్పటికీ మనదేనని, అందుకే రిజర్వేషన్ల బిల్లులో పీఓకే కోసం 24 అసెంబ్లీ సీట్లను రిజర్వ్ చేశామని వెల్లడించారు.
లోక్ సభ ఆమోదం
లోక్ సభలో జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లులపై జరిగిన చర్చకు బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. అమిత్ షా సమాధానం అనంతరం ఆ రెండు బిల్లులు లోక్ సభ ఆమోదం పొందాయి. ఈ బిల్లులను మంగళవారం లోక్ సభలో ప్రవేశపెట్టగా, రెండు రోజుల పాటు వీటిపై చర్చ జరిగింది.
మొదటి పెద్ద తప్పు..
1947 లో పాకిస్తాన్ (pakistan war) తో యుద్ధం సమయంలో, భారత్ గెలుస్తున్న సమయంలో, కాల్పుల విరమణకు అంగీకరించడం నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన తొలి పెద్ద తప్పు అని అమిత్ షా అన్నారు. నెహ్రూ ఆ తప్పు చేసి ఉండకపోతే, పీఓకే భారత్ లో అంతర్భాగమయ్యేదన్నారు. నెహ్రూ చేసిన ఆ పెద్ద తప్పు వల్ల భారీ భూభాగాన్ని భారత్ కోల్పోయిందని వ్యాఖ్యానించారు. భారతీయ సైన్యం విజయం దిశగా వెళ్తున్న సమయంలో కాల్పుల విరమణకు అంగీకరించడం పొరపాటేనని ఆ తరువాత నెహ్రూ కూడా ఒప్పుకున్నారని అమిత్ షా గుర్తు చేశారు. అయితే, అది చిన్న పొరపాటు కాదని, అతి పెద్ద తప్పు (blunder) అని షా వ్యాఖ్యానించారు.
రెండో పెద్ద తప్పు..
కశ్మీర్ అంశాన్ని ఐక్య రాజ్య సమితి (UNO) వేదిక పైకి తీసుకువెళ్లడం నాటి ప్రధానిగా నెహ్రూ (nehru) చేసిన రెండో అతి పెద్ద తప్పు అని అమిత్ షా పేర్కొన్నారు. దేశ అంతర్గత వ్యవహారాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకువెళ్లి, నెహ్రూ పెద్ద తప్పు చేశారన్నారు. ఆ తప్పు కారణంగా ఇప్పటికీ కశ్మీర్ ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ రెండు పెద్ద తప్పులను తాను నెహ్రూవియన్ బ్లండర్స్ (Nehruvian blunders) గా పేర్కొంటానని అమిత్ షా అన్నారు.
పీఓకే కు 24 సీట్లు..
జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణపై మాట్లాడుతూ.. గతంలో జమ్మూలో 37 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇకపై 43 అసెంబ్లీ స్థానాలు ఉంటాయని, అలాగే, కశ్మీర్లో గతంలో 46 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఇకపై 47 ఉంటాయన్నారు. మొత్తంగా జమ్మూకశ్మీర్లో 90 అసెంబ్లీ సీట్లు ఉంటాయన్నారు. మరోవైపు, పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ లో అంతర్భాగమేనని తాము విశ్వసిస్తున్నామని, అందువల్ల ఆ ప్రాంతం కోసం 24 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేశామని స్పష్టం చేశారు.