Lok Sabha Elections 2024: బీజేపీ ట్యాగ్ తో ఈవీఎంల ఫొటోలను షేర్ చేసిన టీఎంసీ; ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపణలు
Lok Sabha Elections 2024 phase 6: దేశంలో ఆరో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ.. మరోసారి ఈవీఎంల ట్యాంపరింగ్ అంశం తెరపైకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ ట్యాగ్ లతో ఉన్న ఈవీఎంల ఫొటోలను షేర్ చేసింది.
Lok Sabha Elections 2024 phase 6: లోక్ సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శనివారం కీలక ఆరోపణలు చేసింది. పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడిందని ఆరోపించింది. బంకురాలోని రఘునాథ్ పూర్ లో బీజేపీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (EVM) మార్చారని టీఎంసీ ఆరోపించింది.
బీజేపీ ట్యాగ్ ఉన్న ఈవీఎం ఫొటోలు
బీజేపీ ట్యాగ్ ఉన్న ఈవీఎంల ఫొటోలను టీఎంసీ షేర్ చేసింది. బీజేపీ ట్యాగ్ ఉన్న 5 ఈవీఎంలు కనిపించాయని టీఎంసీ పేర్కొంది. బీజేపీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ భారత ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీఎంసీ ఆరోపించింది. బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడిందని టీఎంసీ ఆరోపించడం ఇదే మొదటిసారి కాదు. 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన దశల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడంతో పాటు ఓటర్లపై దాడికి పాల్పడ్డారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో విమర్శించారు.
‘బీజేపీ ఈవీఎంలను మారుస్తోంది’
ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు బీజేపీ అన్యాయమైన విధానాలను అవలంబిస్తోందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో వినియోగిస్తున్న ఈవీఎంలను మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని మమతా బెనర్జీ మే 1న ఆరోపించారు. 2019లో కనిపించకుండా పోయిన వాటితోనే ఈవీఎంలను మారుస్తున్నామని పశ్చిమబెంగాల్ సీఎం పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల మొదటి, రెండో దశల్లో పోలింగ్ శాతం అకస్మాత్తుగా పెరిగిన తర్వాత మమత ఈ ఆరోపణలు చేశారు.
ఈవీఎంలపై అనుమానాలు
‘‘నిన్న ఈసీ విడుదల చేసిన గణాంకాలు బిజెపికి తక్కువ ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో 5.75% ఎక్కువ పోలింగ్ నమోదైనట్లు చూపిస్తున్నాయి. ఈ సంఖ్య ఎలా పెరిగింది? ఈవీఎం యంత్రాలను ఎవరు తయారు చేస్తారు? ఈ యంత్రాల్లో ఉపయోగించే చిప్ లను ఎవరు తయారు చేస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. దాదాపు 1.9 మిలియన్ల ఈవీఎంలు చాలా కాలంగా కనిపించకుండా పోయాయి. అలా కనిపించకుండా పోయిన ఈవీఎంలలో తప్పుడు డేటాను నమోదు చేశారు. ఇప్పుడు ఉపయోగిస్తున్న ఈవీఎంలను మార్చి ఆ స్థానంలో ఆ యంత్రాలను ఉంచారని అనుమానం ఉంది’’ అని మమతా బెనర్జీ మే 1న బెంగాల్లోని మాల్దా, ముర్షిదాబాద్లో జరిగిన ర్యాలీలో పేర్కొన్నారు.