West Bengal panchayat elections: తీవ్రమైన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో పంచాయతి ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్ లో జిల్లాపరిషత్, పంచాయతి సమితి, గ్రామ పంచాయతి అనే మూడంచెల వ్యవస్థ అమల్లో ఉంది.
బుధవారం ఉదయం నాటికి ప్రకటించిన ఫలితాల ప్రకారం.. ఎన్నికలు జరిగిన మొత్తం 63,229 సీట్లకు గానూ.. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ 34,359 గ్రామ పంచాయతి సీట్లను గెల్చుకుంది. 752 సీట్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 9,545 సీట్లను గెల్చుకుని, 180 సీట్లలో ఆధిక్యంలో ఉంది. సీపీఎం 2,885 సీట్లను గెల్చుకుని, 96 సీట్లలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 2,498 సీట్లను గెల్చుకుని, 72 సీట్లలో ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ కన్నా టీఎంసీ దాదాపు 4 రెట్లు అధికంగా సీట్లను సాధించగలిగింది. పశ్చిమబెంగాల్ లో పంచాయతి ఎన్నికలు అత్యంత హింసాత్మక వాతావరణంలో జరిగాయి. యథేచ్ఛగా రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. హింసాత్మక ఘటనలు, రిగ్గింగ్ ఆరోపణల నేపథ్యంలో 696 సీట్లకు రీ పోలింగ్ జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. కోల్ కతా హై కోర్టు ఆదేశాల మేరకు ఈ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర బలగాలను మోహరించారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతి ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం ఖాయమైన నేపథ్యంలో.. పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్పందించారు. ఓటర్లకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్ ప్రజల గుండెల్లో నిలిచి ఉంటుందని మరోసారి రుజువైందని ఫేస్ బుక్ లో రాసిన ఒక పోస్ట్ లో వ్యాఖ్యానించారు.