Mamata Banerjee: ‘కేంద్రంలో ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిస్తాం’: మమతా బెనర్జీ
Mamata Banerjee: బీజేపీ కోరుకుంటున్నట్లు ప్రజలు ఓటు వేయడం లేదని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ వ్యాఖ్యానించారు. వారు కోరుకుంటున్నట్లు 400 పైగా సీట్లు రావడం అసాధ్యమన్నారు. ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు పనిచేస్తున్న కీలుబొమ్మ అని మమతా బెనర్జీ అభివర్ణించారు.
Mamata Banerjee: 2024 లోక్ సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుచుకుంటామని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చెప్పడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తోసిపుచ్చారు. వారు (బీజేపీ) ఆశించినట్లు ఓటర్లు ఓట్లు వేయడం లేదని వ్యాఖ్యానించారు. ఈ సారి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బయటి నుంచి మద్దతు..
ఇండియా కూటమి ఆధ్వర్యంలో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్ బయటి నుంచి మద్ధతు ఇస్తుందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ వెల్లడించారు. ఆ ప్రభుత్వంలో తాము చేరబోవడం లేదని అన్యాపదేశంగా స్పష్టం చేశారు. 400 సీట్లు గెలుస్తామని బీజేపీ చెబుతోందని, కానీ ఈసారి అలా జరగదని ప్రజలు చెబుతున్నారని మమతా బెనర్జీ అన్నారు. ‘కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము (టీఎంసీ) బయటి నుంచి ఇండియా కూటమికి మద్దతిస్తాం’ అని మమత బెనర్జీ పేర్కొన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి కనీసం 315 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ 190-195 సీట్లకే పరిమితమవుతుందని మమతా బెనర్జీ అన్నారు. ఇదే విషయాన్ని ఆమె గతంలో కూడా చెప్పారు.
మోదీ చేతిలో కీలుబొమ్మ
ఎన్నికల సంఘంపై కూడా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ విమర్శలు చేశారు. ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు పనిచేసే 'కీలుబొమ్మ'గా వ్యవహరిస్తోందన్నారు. రెండున్నర నెలలుగా ఎన్నికలు జరుగుతున్నాయని, సామాన్య ప్రజల కష్టాన్ని మీరు (ఎన్నికల అధికారులు) ఎప్పుడైనా గ్రహించారా అని పశ్చిమబెంగాల్ సీఎం ప్రశ్నించారు. హుగ్లీ టీఎంసీ అభ్యర్థి, నటి రచనా బెనర్జీకి మద్దతుగా మమత బెనర్జీ ప్రచారం చేశారు.