Ysrcp Mla Pinnelli Arrest : ఈవీఎం ధ్వంసం కేసు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుపై గందరగోళం?-macherla evm damaged case ap police arrested mla pinnelli ramakrishna reddy at sangareddy ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ysrcp Mla Pinnelli Arrest : ఈవీఎం ధ్వంసం కేసు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుపై గందరగోళం?

Ysrcp Mla Pinnelli Arrest : ఈవీఎం ధ్వంసం కేసు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుపై గందరగోళం?

Bandaru Satyaprasad HT Telugu
May 22, 2024 07:28 PM IST

Ysrcp Mla Pinnelli Arrest : మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఈవీఎం ధ్వంసం కేసులో పరారీలో ఉన్న ఆయనను సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఈవీఎం ధ్వంసం కేసు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు?
ఈవీఎం ధ్వంసం కేసు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు?

Ysrcp Mla Pinnelli Arrest : ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రత్యేక బృందాలు ఆయన్ను అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగాయి. అరెస్టు విషయం తెలుసుకున్న పిన్నెల్లి హైదరాబాద్ నుంచి పరారయ్యారు. ఎట్టకేలకు పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారని వార్తలు వచ్చాయి. ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పిన్నెల్లి కోసం ముమ్మరంగా గాలించగా... సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్ లో పిన్నెల్లిని గుర్తించి అరెస్టు చేశారని సమాచారం. అయితే పిన్నెల్లి అరెస్టును పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

అసలేం జరిగింది?

మే 13న పోలింగ్‌ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రం(202)లో ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేయడం, పోలింగ్ ఏజెంట్ కు బెదిరింపులు, మహిళలను దుర్భాషలాడిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోలు వెలుగులోకి రావడంతో ఈసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వెంటనే పిన్నెల్లిని అరెస్టు చేయాలని డీజీపీని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు ఎమ్మెల్యే పిన్నెల్లి కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు ఆయన్ను తెలంగాణ పోలీసుల సహకారంతో సంగారెడ్డి జిల్లాలో అరెస్టు చేశారని తెలుస్తోంది.

10 సెక్షన్ల కింద కేసులు

అయితే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై పోలీసులు 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం, పీడీపీపీ చట్టాల పరిధిలోని 10 సెక్షన్లు పిన్నెల్లిపై నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదయ్యాయి. ఈనెల 20న ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

ఏడేళ్ల శిక్షకు అవకాశం

పోలింగ్‌ రోజున మాచర్లలో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలు చోటుచేసుకున్నట్లు సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈవీఎంల ధ్వంసం ఘటనలపై స్పందించారు. ఈ ఘటనలకు సంబంధించి సిట్‌కు పోలీసులు అన్ని వివరాలను తెలియజేశారన్నారు. ఈ నెల 20న రెంటచింతల ఎస్‌ఐ ఈవీఎం ధ్వంసంపై కోర్టులో మెమో దాఖలు చేశారని తెలిపారు. ఈ కేసులో ప్రథమ నిందితుడిగా పిన్నెల్లిని పేర్కొన్నారన్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు పెట్టారన్నారు. ఏడేళ్లకు తక్కువ కాకుండా శిక్షలు పడే విధంగా సెక్షన్లు పెట్టారని తెలిపారు. హింసకు పాల్పడిన ఎవర్నీ వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈవీఎం ధ్వంసం ఘటనను తామేమి దాచిపెట్టలేదన్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే పూర్తి ఆధారాలను పోలీసులకు అప్పగించామని సీఈవో మీనా స్పష్టం చేశారు.

ఈవీఎంలను ధ్వంసం చేయడం సిగ్గుమాలిన చర్యగా ఈసీ పేర్కొంది. ఇలాంటి ఘటనలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్టు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

Whats_app_banner

సంబంధిత కథనం