Pinnelli Abscond: పిన్నెల్లి సోదరుల పరారీ, కేసు ఎందుకు పెట్టలేదో చెప్పాలని సీఈఓకు ఎన్నికల సంఘం నోటీసులు,ముమ్మర గాలింపు-pinnelli brothers absconding election commission notices to ceo to explain why case was not filed ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pinnelli Abscond: పిన్నెల్లి సోదరుల పరారీ, కేసు ఎందుకు పెట్టలేదో చెప్పాలని సీఈఓకు ఎన్నికల సంఘం నోటీసులు,ముమ్మర గాలింపు

Pinnelli Abscond: పిన్నెల్లి సోదరుల పరారీ, కేసు ఎందుకు పెట్టలేదో చెప్పాలని సీఈఓకు ఎన్నికల సంఘం నోటీసులు,ముమ్మర గాలింపు

Sarath chandra.B HT Telugu
May 22, 2024 01:35 PM IST

Pinnelli Abscond: మాచర్ల నియోజక వర్గం రెంటచింతలలో జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పిన్నెల్లి సోదరులను ఎందుకు అరెస్ట్ చేయలేదో వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.

ఎమ్మెల్యే పిన్నెల్లి పరారీలో ఉన్నట్టు ప్రకటించిన ఏపీ ఈసీ సీఈఓ
ఎమ్మెల్యే పిన్నెల్లి పరారీలో ఉన్నట్టు ప్రకటించిన ఏపీ ఈసీ సీఈఓ

Pinnelli Abscond: మాచర్ల పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెంటచింతల మండలంలోని పాల్వాయిగేటు (202 పోలింగ్ బూత్‌లో జరిగిన పరిణామాలపై సాయంత్రం ఐదులోగా వివరణ ఇవ్వాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారిని ఆదేశించింది. పాల్వాయి గేటులో చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

వీడియోల్లో ఉన్నది ఎమ్మెల్యేనో కాదో స్ఫష్టం చేయాలని, ఈ ఘటనలపై నమోదైన కేసుల్లో ఎమ్మెల్యే పేర్లు ఉన్నాయో లేదో ధృవీకరించాలని, ఎమ్మెల్యేను ఎందుకు అరెస్ట్ చేయలేదనే దానిపై వివరణ ఇవ్వాలన్నారు.

సీఈవోకు నోటీసులు పంపిన కేంద్ర ఎన్నికల సంఘం, పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెలి ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈవోను వివరణ కోరింది. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా కాదో స్పష్టం చేయాలని ప్రశ్నించింది. ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. కేసు పెట్టి ఉంటే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా లేదా అని నిలదీశారు. ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్‍ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.

వెబ్‌ క్యాస్టింగ్‌లో ఎమ్మెల్యే దొరికారు…సీఈఓ మీనా

పోలింగ్ సందర్భంగా సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ ఏర్పాటు చేసినట్టు సీఈఓ మీనా చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో చేపట్టిన చర్యల్ని వివరించారు. పోలింగ్‌ రోజు మాచర్లలో 100శాతం వెబ్‌ కాస్టింగ్ చేశామన్నారు. పోలింగ్‌ స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌ రికార్డు చేశామని, గొడవలు జరిగిన కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌‌లో అన్ని వివరాలు రికార్డు అయ్యాయని చెప్పారు.

రీ పోలింగ్ చేయాలంటే ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితులు లేకపోతే, పాల్వాయి గేట్‌ వద్ద జరిగిన దాడిలో కంట్రోల్ యూనిట్‌లో చిప్‌ ధ్వంసం అయ్యుంటే అప్పటి వరకు పోలైన ఓట్లు సురక్షితంగా ఉన్నాయని, అప్పటి వరకు పోలైన ఓట్లు నమోదైనట్టు బెల్‌ ఇంజనీర్లు, కలెక్టర్లు ధృవీకరించిన తర్వాత కొత్త యూనిట్లతో పోలింగ్ కొనసాగినట్టు చెప్పారు. రీ పోలింగ్ పరిస్థితులు ఎక్కడా రాలేదని స్పష్టం చేశారు.

పాల్వాయి గేట్‌లో బెల్ ఇంజనీర్లు పరిశీలించిన తర్వాత డేటా సురక్షితంగా ఉందని తేల్చి, పోలింగ్ కొనసాగించారన్నారు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు కొనసాగించారని, వెబ్‌ కాస్టింగ్‌లో నమోదైన వివరాలను పోలీసులకు జిల్లా కలెక్టర్ ఇచ్చారని, ఆ తర్వాత సిట్ దర్యాప్తు చేపట్టారని సీఈఓ మీనా వివరించారు.

మాచర్ల ఘటనలపై రెంట చింతల సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కోర్టులో మెమో దాఖలు చేశారని, ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డిని ఏ1 పేర్కొంటూ కేసు నమోదు చేశారని తెలిపారు. 20వ తేదీనే ఈ కేసు నమోదైందని, 21న వెలుగు చూసిన వీడియో నిజమైనదేనని, అది వైరల్ అయినా తర్వాత సీఈసీ స్పందించిందని చెప్పారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయడానికి మంగళవారం నుంచి తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అతని ఇంటి మీద కూడా దాడులు నిర్వహించామని, అతని అచూకీ దొరకలేదన్నారు.

దురదృష్టకరమైన ఘటన…

ఎన్నికల సంఘం మాచర్ల ఘటనను దురదృష్టకరమైన ఘటనగా భావిస్తోంది. కఠినమైన చర్యలు తీసుకోవాలని భావిస్తోందని, 10సెక్షన్ల కింద కేసులు పెట్టామని నిందితుడికి 7ఏళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందని చెప్పారు.

సిట్‌ విచారణ కొనసాగుతోందని, రహస్యంగా దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అన్ని ఘటనలకు సంబంధించిన వివరాలు 14,15 తేదీల నాటికే జిల్లా కలెక్టర్లు పోలీసులకు అప్పగించారని సీఈఓ స్పష్టం చేశారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే వెబ్‌ కాస్టింగ్ వీడియోలను పోలీసులకు అప్పగించామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోలీసుల దర్యాప్తులో జాప్యానికి బదిలీలు ఒక కారణమని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఘటనలో వీడియోలను పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు.

బదిలీల వల్లే దర్యాప్తు ఆలస్యం…

ఎన్నికల సంఘం సీసీ కెమెరాలు పెట్టడం వల్లే ఆధారాలు దొరికాయని, అవి లేకపోతే ఎలాంటి ఆధారాలు దొరికేవి కాదని మీనా చెప్పారు. ఎన్నికల సంఘం ఎవరిని ఉపేక్షించదన్నారు. పోలింగ్‌ జరిగిన తర్వాత చాలా పరిణామాలు జరిగాయని, ఎస్పీ, డిఎస్పీలు బదిలీ అయ్యారని, సిట్‌ వచ్చిన తర్వాత దర్యాప్తు వేగంగా జరిగిందని, బదిలీల వల్ల రెండు మూడు రోజుల జాప్యం జరిగిందని సీఈఓ మీనా తెలిపారు.

హైదరాబాద్‌లో గాలింపు…

ఎన్నికల సంఘం పోలింగ్‌కు సంబంధించిన ఏ ఘటనను దాచిపెట్టలేదన్నారు. ఎన్నికలు పూర్తైన వెంటనే ఆ వివరాలను

పోలీసులకు అప్పగించామన్నారు. పిన్నెల్లిపై పెట్టిన కేసుల్లో నాలుగు సెక్షన్లలో రెండేళ్లకు మించి జైలు శిక్షలు పడతాయన్నారు. పిన్నెల్లి కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పిన్నెల్లి అచూకి పట్టుకుంటామని చెప్పారు. ఎన్నికల సంఘం సిట్‌ దర్యాప్తు మీద నేరుగా పర్యవేక్షిస్తోందన్నారు.

తెలంగాణ పోలీసుల అదుపులో పిన్నెల్లి డ్రైవర్…

తెలంగాణ లోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి దగ్గర కారు లో మొబైల్ వదిలేసి పారిపోయిన పిన్నెల్లి సోదరులు పరారైనట్టు గుర్తించారు. ఏపీ, తెలంగాణ పోలీసులు పిన్నెల్లి సోదరుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం