TS Lok Sabha Elections : అగ్రనేతలకు అగ్ని పరీక్షే- లోక్ సభ ఎన్నికల ఫలితాలే కీలకం!
TS Lok Sabha Elections : తెలంగాణ లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అగ్రనేతలకు అగ్ని పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల ఫలితాలే వారికి సక్సెస్ కు గీటురాయిగా మారనున్నాయి.
TS Lok Sabha Elections : రాజకీయాల్లో ఎవరెంత పోరాడినా, కష్టపడినా అంతిమంగా వారు సాధించే ఫలితాలే సక్సెస్‌కు గీటురాయిగా నిలుస్తాయి. అగ్రనేతల నుంచి కిందస్థాయి కార్యకర్తల వరకు వారు చేసే కృషితోనే సరైన గుర్తింపు లభిస్తుంది. తెలంగాణలో ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన అన్ని పార్టీల అగ్రనేతలకు ఫలితాలు సవాలుగా మారనున్నాయి. జాతీయ స్థాయి నేతలు మొదలుకొని రాష్ట్ర స్థాయి నేతల వరకు కాళ్లకి బలపం కట్టుకొని రాష్ట్రాన్ని చుట్టుముట్టారు. వారు ఏమేరకు సఫలీకృతం అయ్యారో జూన్ 4న వెలువడే ఫలితాలే తేలుస్తాయి.
దక్షిణాదిపై కాంగ్రెస్ గురి
తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్తరాదిలో బలం తగ్గడంతో దక్షిణాదిలో సీట్ల సంఖ్యను పెంచుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణపై ఆశలు పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఉత్తరాదిలో ఇప్పటికే రెండుమార్లు గరిష్ట ఫలితాలు సాధించిన బీజేపీకి ఈసారి అక్కడ సీట్లు తగ్గే అవకాశాలు ఉండడంతో తెలంగాణపై పార్టీ జాతీయ నేతలు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికలతో తిరిగి పుంజుకోవాలనే గట్టి సంకల్పంతో ప్రచారం నిర్వహించింది. ఆ పార్టీల ప్రధాన నేతలు పర్యటించిన నియోజకవర్గాల్లో ఆశించిన ఫలితాలు వస్తే వారి ప్రతిష్ట పెరుగుతుంది. లేకపోతే వారందరూ విమర్శల సుడిగుండంలో పడడం ఖాయం.
రేవంత్ రెడ్డికి అగ్ని పరీక్ష
రాష్ట్రంలో 14 స్థానాల్లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకోవడంతోపాటు, ఐదు నెలల తమ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా ప్రకటించుకున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఈ ఎన్నికలు అగ్నిపరీక్షే. కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవకపోతే ఒత్తిడిలు పెరగడంతోపాటు పార్టీలో అంతర్గతంగా ఎప్పుడూ ఏదో ఒక చోట ఉండే అసంతృప్తితో ఆయనకు తిప్పలు తప్పకపోవచ్చు. ప్రధానంగా ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండే మహబూబ్‌నగర్ లోక్‌సభ సీటు గెలవటం రేవంత్‌కు సవాలుగా మారింది. దీంతో పాటు గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన గెలిచిన మల్కాజిగిరిలో తిరిగి కాంగ్రెస్ గెలుపు కూడా ఆయనకు ముఖ్యమే. మరోవైపు చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ టికెట్ ఇప్పించిన రేవంత్‌కు ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది.
ఆధిపత్య పోరు
మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు బీజేపీ నుంచి గట్టి పోటీ ఉంది. అందుకే రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న 53 ప్రచార సభలలో 23 సభలు ఈ మూడు నియోజకవర్గాల పరిధిలోనే ఉన్నాయి. ఈ 23లో కూడా సగం మహబూబ్‌నగర్‌కే కేటాయించారు. సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే రెండు సార్లు పర్యటించారంటే ఆయనపై ఎలాంటి ఒత్తిడి ఉందో తెలుస్తుంది. ఏ ఒక్కచోట ఓడినా ఆయనకు ఇంటా, బయట తిప్పలు తప్పకపోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులుగా, ముఖ్యమంత్రిగా ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్న రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో పర్యటించినా రాష్ట్ర సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న నల్లగొండ నియోజకవర్గంలో ఒక్కసారి కూడా ప్రచారం చేయలేదు. కాంగ్రెస్ ఒకవేళ మహబూబ్‌నగర్‌లో ఓడి, నల్లగొండలో గెలిస్తే పార్టీలో రేవంత్ రెడ్డి ఆధిపత్యానికి సీనియర్ నేతలు గండికొట్టే అవకాశాలుంటాయి. పార్టీ అధిష్టానం కూడా ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోవచ్చు.
గాడిద గుడ్డు అంటూ ప్రచారం
రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఇతర ముఖ్యనేతలు కూడా ప్రచారం నిర్వహించినా వారు చాలామటుకు తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. రాష్ట్ర మంత్రులు తమ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓడిపోతే వారికి ఆయా జిల్లాల్లో పార్టీలో అంతర్గత పోరు ప్రారంభమవుతుంది. మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తూ ‘గాడిద గుడ్డు’ మాత్రమే ఇచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ పెద్దఎత్తున చేసిన ప్రచారానికి ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. రాష్ట్ర నేతలతో పాటు పార్టీ జాతీయ నేతలు కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ ఆదిలాబాద్, నాగర్‌కర్నూల్, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్ నియోజకవర్గాలను కవర్‌చేస్తూ 5 సమావేశాలలో పాల్గొన్నారు. ప్రియాంక గాంధీ చేవెళ్ల, జహీరాబాద్‌లో ప్రచారం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే భువనగిరిలో సమావేశం నిర్వహించారు. వీరు పర్యటించిన నియోజకవర్గాల్లో మెరుగైన ఫలితాలు రాకపోతే వీరి పరపతికి భంగం కలగడం ఖాయం.
బీజేపీ అగ్రనేతల ప్రచారాలు
తెలంగాణలో అత్యధిక స్థానాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ తరఫున ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే మోదీ, అమిత్‌షా, నడ్డా రాష్ట్రంలో పలుమార్లు పర్యటించారు. ప్రధాని నరేంద్రమోదీ మల్కాజిగిరి, జహీరాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలను కవర్ చేస్తూ బహిరంగ సమావేశాల్లో, రోడ్‌షోలలో పాల్గొన్నారు. హోం మంత్రి అమిత్‌షా మెదక్, హైదరాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరి, ఆదిలాబాద్, సికింద్రాబాద్, భువనగిరి, చేవెళ్ల, నాగర్‌కర్నూలు నియోజకవర్గాలలో బహిరంగ సమావేశాల్లో, రోడ్ షోలలో పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఆరు నియోజకవర్గాలలో బహిరంగ సమావేశాలలో, రోడ్‌షోలలో పాల్గొన్నారు. బీజేపీ తరఫున కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ప్రచారం నిర్వహించారు. బీజేపీ జాతీయ నేతలు, సీఎంలు ఆ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా రాష్ట్రానికి వచ్చారు. మోదీ, అమిత్‌షా, ఇతర జాతీయ నేతలు ఆయా ప్రాంతల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించి సెంటిమెంట్‌తో ఓటర్లకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నించారు. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం అధినేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడు తప్ప మిగతా సమాయాల్లో వారి వారి నియోజకవర్గాలకే పరిమితమయ్యారు.
ఆర్ఆర్ ట్యాక్స్ ఆరోపణలు
మోదీ, అమిత్‌షాలు మొదలు కొని పార్టీ నేతలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కమీషన్లు వసూలు చేస్తూ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి అందిస్తున్నారంటూ ‘ఆర్‌ఆర్’ ట్యాక్స్‌పై ప్రచారం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రజలు ఎంతమేరకు విశ్వసించారో చూడాలి. మోదీ, అమిత్‌షా తదితర సీనియర్లు పర్యటించిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ సత్ఫలితాలు సాధించకపోతే తెలంగాణలో బీజేపీ పాచికలు పారవని మరోసారి నిరూపితమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ జాతీయ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించినా వారు రెండెంకల సంఖ్యకు చేరుకోకుండా భంగపడ్డారనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.
కేసీఆర్ పర్యటనలతో కేడర్ లో విశ్వాసం
పదేళ్లు అధికారంలో ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపాలైన బీఆర్‌ఎస్ అనంతరం ఏర్పడిన పరిణామాలతో మరింత చతికిలపడిరది. పార్టీ ప్రకటించిన అభ్యర్థులు ఇతర పార్టీలలోకి వెళ్లి పోటీ చేశారంటేనే ఈ ఎన్నికల్లో వారు ఎంత బలహీనంగా ఉన్నారో అర్థమవుతోంది. పార్టీ పరిస్థితి దిగజారుతున్న సమయంలో కేసీఆర్ బస్సు యాత్ర ఆ పార్టీ కేడర్‌లో కొంత కొత్త విశ్వాసాన్ని నింపగలిగింది. రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాల్లో గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతానని, తాను కూడా ప్రధాని రేసులో ఉన్నట్టు కేసీఆర్ చేసిన ప్రకటనను ప్రస్తుతం వారి పార్టీ కేడర్‌తో సహా ఎవరూ సీరియస్‌గా తీసుకుంటున్నట్టు లేదు. కేసీఆర్ బస్సుయాత్ర నిర్వహించి 13 నియోజకవర్గాల్లో 25 రోడ్ షోలు, ఇతర బహిరంగ సభల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 16 నియోజకవర్గాల్లో 82 రోడ్‌షోలు, బహిరంగ సమావేశాల్లో పాల్గొన్నారు. మరో అగ్రనేత హరీశ్‌రావు 69 రోడ్‌షోలు, బహిరంగ సమావేశాల్లో పాల్గొని ఎన్నికల ప్రసంగాలు, ప్రచారాలు చేశారు.
జీవన్మరణ సమస్యే
ప్రధానంగా మెదక్, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు సానుకూల ఫలితాలు రాకపోతే పార్టీకి కోలుకోలేని దెబ్బే. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాలుండడంతో మెదక్‌లో విజయం ఆ పార్టీకి జీవన్మరణ సమస్యలాంటిదే. ఇక్కడ ఫలితం కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావ్‌కు కూడా కీలకమే. మరోవైపు తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీకి ఆయపట్టు అయిన కరీంనగర్‌లో విజయం కూడా బీఆర్‌ఎస్‌కు ఎంతో ప్రధానం. కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం కూడా కరీంనగర్‌లోనే ఉండడంతో ఇక్కడ గెలుపు కేటీఆర్‌తోపాటు బీఆర్‌ఎస్‌కు కూడా సవాలే. అందుకే ఈ ముగ్గురు అగ్రనేతలు ఈ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి విస్తృతంగా ప్రచారం చేశారు.
ఎవరు గట్టెక్కుతారో?
రాష్ట్రంలో దాదాపు 15 స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొనడంతో ఏ పార్టీ ఎవరికి నష్టం చేకూరుస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదనే లక్ష్యంతో మూడు పార్టీల అగ్రనేతలు ప్రణాళికబద్ధంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ను ‘గాడిద గుడ్డు’, బీజేపీని ‘ఆర్‌ఆర్’, బీఆర్‌ఎస్‌ను ‘కేసీఆర్ నెక్స్ట్ పీఎం’ అంశాలు గట్టెక్కిస్తాయా అనేది జూన్ 4న వెలువడే ఫలితాలే తెలుస్తాయి. ఆ పార్టీ అగ్రనేతలు వివిధ అంశాలను లేవనెత్తి ఉధృతంగా ప్రచారం నిర్వహించినా ఎవరు ఎంతమేరకు ఫలితాలను ప్రభావితం చేయగలుగుతారో వారే ఈ రాజకీయ క్రీడల్లో ‘జో జీతా వోహీ సికిందర్’గా నిలుస్తారు.
(Disclaimer : ఈ ఆర్టికల్ లోని అంశాలు పూర్తిగా పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ పొలిటికల్ అనలిస్ట్ ఐ.వి.మురళీ కృష్ణ శర్మ వ్యక్తిగత అభిప్రాయాలు. ఈ అంశాలతో హెచ్.టి.తెలుగుకు ప్రత్యక్షంగానీ, పరోక్షంగానీ సంబంధంలేదు)