Lok Sabha Election Phase 7: కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్, ఏడు రాష్ట్రాల్లోని 57 పార్లమెంటరీ నియోజకవర్గాలకు జూన్ 1వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఫేజ్ తో మొత్తం ఏడు దశల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల సమరం ముగుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ స్థానానికి కూడా ఈ ఏడో దశలోనే పోలింగ్ జరగనుంది.
చివరి దశ పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన విధంగానే ఏడో దశ పోలింగ్ కూడా ప్రశాంతంగా నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. అందులో భాగంగానే ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో గురువారం సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. బెంగళూరులో జూన్ 1 నుంచి జూన్ 6 వరకు మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. అంటే, బెంగళూరులో జూన్ మొదటి వారంలో దాదాపు వారం రోజుల పాటు వైన్ షాపులు, బార్లు, పబ్బులు మూతపడనున్నాయి. అయితే పబ్ లు, బార్లలో నాన్ ఆల్కహాలిక్ పానీయాలు, ఆహారాన్ని కస్టమర్లకు అందించేందుకు అనుమతి ఉంటుంది.
చివరి దశ ఎన్నికల్లో బీహార్ (8/40 సీట్లు), హిమాచల్ ప్రదేశ్ (4/4), జార్ఖండ్ (3/14), ఒడిశా (6/21), పంజాబ్ (13/13), ఉత్తరప్రదేశ్ (13/80), పశ్చిమ బెంగాల్ (9/42), కేంద్రపాలిత ప్రాంతంలోని చండీగఢ్ (1) స్థానంలో పోలింగ్ జరగనుంది. ఈ చివరి దశ ఎన్నికల్లో ప్రధాని మోదీ సహా 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.