PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే
PM Narendra Modi Biopic - Sathyaraj: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితంపై మరో బయోపిక్ తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆ చిత్రంలో మోదీ పాత్రలో సత్యరాజ్ నటిస్తారని సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలివే..
PM Modi Biopic - Sathyaraj: తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ సుమారు మూడు దశాబ్దాలుగా చాలా సినిమాల్లో వైవిధ్య పాత్రలతో మెప్పించారు. అయితే, బాహుబలి సినిమాల్లో కట్టప్ప క్యారెక్టర్ ఆయనకు ఫుల్ పాపులారిటీ తీసుకొచ్చింది. పాన్ ఇండియా రేంజ్‍లో కట్టప్పగా ఆయన ఫేమస్ అయ్యారు. కట్టప్ప అనేది సత్యరాజ్‍కు ఏకంగా రెండో పేరులా మారిపోయింది. అయితే, సత్యరాజ్ ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. మోదీ జీవితంపై రూపొందించే చిత్రంలో ప్రధాన పాత్రను సత్యరాజ్ పోషించనున్నారని టాక్ బయటికి వచ్చింది.
అయితే, నరేంద్ర మోదీపై రూపొందనున్న ఈ బయోపిక్ మూవీపై ఇతర వివరాలు ఇంకా వెల్లడికాలేదు. మోదీ పాత్రలో సత్యరాజ్ నటిస్తారనే విషయం బయటికి వచ్చింది. తమిళ సినీ ట్రాకర్ రమేశ్ బాలా కూడా విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మోదీ బయోపిక్‍లో ఆయన పాత్రను సీనియర్ నటుడు సత్యరాజ్ పోషిస్తారని త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.
దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తున్న తరుణంలో ప్రధాని మోదీ జీవితంపై మళ్లీ ఓ సినిమా రూపొందనుందనే విషయం మంచి బజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఈ విషయం విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది.
మోదీపై ఇప్పటికే ఓ బయోపిక్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితంపై బాలీవుడ్‍లో ఇప్పటికే ఓ చిత్రం వచ్చింది. పీఎం నరేంద్ర మోదీ పేరుతో 2019 మేలో ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీలో మోదీ పాత్రలో నటించారు వివేక్ ఒబెరాయ్. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మనోజ్ జోషి, శీలా గోరె, అక్షత్ ఆర్ సలుజా, నవనీద్ గైరోలా, బొమ్మన్ ఇరానీ, బర్కా సెంగుప్త కీలకపాత్రలు పోషించారు. లెజెండ్ గ్లోబల్ స్టూడియోస్, ఆనంద్ పండిత్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ మూవీకి శశి - ఖుషి, హృతేశ్ మోదక్ సంగీతం అందించారు.
అయితే, బాలీవుడ్‍లో రూపొందిన పీఎం నరేంద్ర మోదీ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేకపోయింది. మోస్తరు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో మోదీ చిన్నతనం నుంచి సవాళ్లను ఎదుర్కొంటూ.. రాజకీయాల్లో మెట్టుమెట్టు నాయకుడిగా ఎదుగుతూ.. శ్రమిస్తూ ప్రధానిగా ఎదిగిన క్రమాన్ని మేకర్స్ చూపించారు.
పెరిగిన ఆసక్తి
అయితే, సత్యరాజ్ ప్రధాన పాత్రలో ఇప్పడు ప్రధాని మోదీ బయోపిక్ మరోసారి వస్తుందనే విషయం ఆసక్తిని రేపుతోంది. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి మెప్పించే సత్యరాజ్.. మోదీ పాత్రలో ఎలా ఉంటారోనన్న క్యూరియాసిటీ ఇప్పటికే వచ్చేసింది. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్టుపై త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.