Asaduddin Owaisi: ‘‘మోదీ రిటైర్ కారు.. ఆయనను రాజకీయంగా ఓడించాల్సిందే. తొలి ముస్లిం ప్రధానిగా ఒక మహిళ’’- అసదుద్దీన్ ఓవైసీ-asaduddin owaisi modi wont retire he has to be defeated politically ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Asaduddin Owaisi: ‘‘మోదీ రిటైర్ కారు.. ఆయనను రాజకీయంగా ఓడించాల్సిందే. తొలి ముస్లిం ప్రధానిగా ఒక మహిళ’’- అసదుద్దీన్ ఓవైసీ

Asaduddin Owaisi: ‘‘మోదీ రిటైర్ కారు.. ఆయనను రాజకీయంగా ఓడించాల్సిందే. తొలి ముస్లిం ప్రధానిగా ఒక మహిళ’’- అసదుద్దీన్ ఓవైసీ

HT Telugu Desk HT Telugu
May 14, 2024 06:55 AM IST

Asaduddin Owaisi: భారత దేశ తొలి ముస్లిం ప్రధాని ఒక మహిళ కావాలని తాను కోరుకుంటున్నానని, దేవుని దయ వల్ల అది జరిగి తీరుతుందని ఎంఐఎం నేత, హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ ఆకాంక్ష వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓవైసీ ‘హిందుస్తాన్ టైమ్స్’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ (PTI FILE)

HT interview with Asaduddin Owaisi: భారత్ లో ముస్లింలకు రాజకీయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ పార్టీ ఏఐఎంఐఎం. ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి హైదరాబాద్ లోక సభ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉంది. గతంలో ఈ స్థానం నుంచి ఆయన 4 సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు మరోసారి పోటీ చేస్తున్నారు. ఓవైసీకి పోటీగా బీజేపీ తరఫున మాధవి లత బరిలో నిలిచారు. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పోలింగ్ మే 13న ముగిసింది. దేశవ్యాప్తంగా గట్టి పట్టు ఉన్న, బలమైన పార్టీ అయిన బీజేపీతో తీవ్రంగా పోరాడుతున్న ఎంఐఎం.. విపక్ష ఇండియా కూటమిలో భాగం కాదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు, ఈ ఎన్నికల్లో తమ పార్టీ విజయావకాశాలు, ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తున్న అంశాలు.. మొదలైన వాటిపై తన అభిప్రాయాలను అసదుద్దీన్ ఓవైసీ హిందుస్తాన్ టైమ్స్ ప్రతినిధికి వివరించారు. ఆ ఇంటర్వ్యూ మీ కోసం..

హిందుస్తాన్ టైమ్స్: బీహార్ లో 11, యూపీలో 20, మహారాష్ట్రలో 5 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇవి గణనీయమైన ముస్లిం ఉనికి ఉన్న అన్ని స్థానాలు. ఈ ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం పనితీరు ఎలా ఉంది?

అసదుద్దీన్ ఓవైసీ: ఉత్తర ప్రదేశ్ లో, మేము ప్రత్యేక దళిత, ముస్లిం సమూహమైన పీడీఎం న్యాయ్ మోర్చాలో భాగంగా ఉన్నాము. దీనికి అప్నాదళ్ (కమేరావాడి) కు చెందిన పల్లవి పటేల్ నేతృత్వం వహిస్తున్నారు. బిహార్ తో పాటు జార్ఖండ్ లో కూడా మేం పోటీ చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో బీహార్ ఎంఐఎం అధ్యక్షుడు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న అఖ్తర్ అఖ్తరుల్ ఇమాన్ విజయం సాధిస్తారు. మహారాష్ట్ర, బిహార్, ఉత్తర్ ప్రదేశ్ లలో కూడా మా అభ్యర్థుల విజయానికి శాయశక్తులా కృషి చేస్తాను.

హిందుస్తాన్ టైమ్స్: ఈ సార్వత్రిక ఎన్నికల్లో మూడు దశలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశాలు ఏమిటని మీరు భావిస్తున్నారు?

అసదుద్దీన్ ఓవైసీ: మేం డేటాపై ఆధారపడం. మేం క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకుంటాం. కానీ ప్రజలు కులం ప్రాతిపదికన ఓటు వేస్తున్నారన్నది నిజం. ఉపాధి అవకాశాలు లేకపోవడం, ధరల పెరుగుదలలకు వ్యతిరేకంగా కూడా ప్రజలు ఓటు వేస్తున్నారు. ఇంకా, ఇతర కారణాలు కూడా ఉన్నాయి. బీజేపీ తమను పూర్తిగా కనిపించకుండా చేసిందని దేశవ్యాప్తంగా ఉన్న మైనారిటీలందరూ భావిస్తున్నారు. సెక్యులర్ బీజేపీగా చెప్పుకునే ఈ కూటమి ముస్లిం మైనార్టీలకు టికెట్లు ఇవ్వడానికి విముఖత చూపుతోంది. 48 లోక్ సభ స్థానాలున్న మహారాష్ట్ర ఇందుకు క్లాసిక్ ఉదాహరణ. అక్కడ ఒక్క ముస్లింను కూడా అభ్యర్థిగా ప్రకటించలేదు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, న్యూఢిల్లీలో ఇదే పరిస్థితి. ఇది ఆందోళన కలిగించే అంశం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ముస్లింలను ఎన్నికల్లో పోటీకి కూడా అభ్యర్థులుగా చేయకపోతే, పార్లమెంటు దిగువ సభలో వారి ప్రాతినిధ్యం కచ్చితంగా తగ్గుతుంది. అది ఈ దేశ బహుళత్వానికి, వైవిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందా? నేను అలా అనుకోవడం లేదు. ఇది చాలా తీవ్రమైన విషయం. దురదృష్టవశాత్తూ సెక్యులర్ పార్టీలు లేదా సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు కూడా ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదు. ఓటు వేసి తిరిగి వెళ్లి మీ ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోండి అని అవి ముస్లిం మైనారిటీలకు చెబుతున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్: ఒక విషయం గురించి మిమ్మల్ని ప్రత్యేకంగా అడగాలనుకుంటున్నాను. మీరు విపక్ష ఇండియా కూటమిలో ఎందుకు చేరాలనుకోలేదు?

అసదుద్దీన్ ఓవైసీ: ఎంఐఎంను ఇండియా కూటమిలో భాగస్వాములను చేసేందుకు మాట్లాడుదామని మా మహారాష్ట్ర అధ్యక్షుడు ఇంతియాజ్ జలీల్ మూడుసార్లు బహిరంగంగానే చెప్పారు. ఆ సమయంలో అవతలి పక్షం నుంచి అస్సలు ఎలాంటి స్పందన రాలేదు. ఇండియా కూటమిలో భాగస్వామ్యం లేనంత మాత్రాన మాకు జరిగే నష్టం ఏమీ లేదు. వారు పొత్తు వద్దనుకుంటే మా ప్రపంచమేమీ అంతం కాదు. పొత్తు లేకపోయినా, మా రాజకీయ ప్రయాణం కొనసాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లో మాకు పొత్తు ఉంది. కొన్ని ఇతర చోట్ల కూడా పొత్తులు ఉన్నాయి.

హిందుస్తాన్ టైమ్స్: ఒంటరిగా పోరాడటం సవాళ్లతో కూడుకున్నది కాదా? మీరు బీజేపీ వంటి పెద్ద పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు కదా..

అసదుద్దీన్ ఓవైసీ: ఆ పట్టింపు మాకు లేదు. జీవితమే ఒక ఛాలెంజ్. ఛాలెంజ్ లేనిదే జీవితంలో మజా ఉండదు. కష్టపడి పనిచేయడం మా బాధ్యత. గెలుపు, ఓటములు ప్రజల చేతుల్లో ఉన్నాయి. ప్రజలు నిర్ణయిస్తే గెలుస్తాం. ఒక వేళ విజయం సాధించకపోతే, పార్టీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే కార్యక్రమం చేపడతాం.

హిందుస్తాన్ టైమ్స్: అయితే ఒంటరిగా పోటీ చేయడం ఒకరకంగా బీజేపీకి ఉపయోగపడుతుంది కదా..? ఎందుకంటే బీజేపీ వ్యతిరేక పార్టీకి వెళ్లే ఓట్లు చీలుతాయి కదా..

అసదుద్దీన్ ఓవైసీ: మీడియాతో, అలాగే, లౌకిక పార్టీలు అని పిలువబడే వాటితో సమస్య ఏమిటంటే అవి అన్నీ హిందూ సెంట్రిక్ గా ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 190 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొన్నది. వాటిలో కేవలం 16 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. అక్కడ మేం పోటీలో లేం. హిందూ ఓట్ల వల్లనే తాము ఓడిపోయామని వాళ్లు నిజాయితీగా చెప్పగలరా?.. ఆ ఇంటలెక్చువల్ హానెస్టీ మీడియాకు గానీ, ఆ సో కాల్డ్ సెక్యులర్ పార్టీలకు గానీ ఉందా? అదే.. అక్కడ మా పార్టీ లేదా మా లాంటి పార్టీ కూడా బరిలో ఉంటే.. అయ్యో.. మీరు బీజేపీకి సాయం చేస్తున్నారు అని వెంటనే అనేస్తారు.. ఇదీ వారి హిపోక్రసీ. అంతేకాదు, మీరు వెళ్లి (మహారాష్ట్ర శివసేన నాయకుడు) ఉద్ధవ్ ఠాక్రేతో పొత్తు పెట్టుకుంటారు. ఆ వేెంటనే మీరు ఆయనను సెక్యులర్ నాయకుడు అంటారు. ఎందుకంటే అది మీకు అవసరం. మీరు అధికారంలో ఉండాలనుకుంటున్నారు. 1992 ముంబై అల్లర్లలో ఠాక్రే లేదా శివసేన పాత్రను శ్రీకృష్ణ కమిషన్ నివేదిక స్పష్టంగా చెప్పింది కదా. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమిలో భాగంగా సీఎంగా ఉన్న ఉద్ధవ్ ఠాక్రే.. తమ పార్టీ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చివేశారని అసెంబ్లీలో చెబుతుంటే, కాంగ్రెస్, ఎన్సీపీ మంత్రులు ఆయన వెంట కూర్చున్నారు. తాము హిందుత్వను సమర్థిస్తున్నామని ఆయన బాహాటంగానే చెబుతున్నారు. హిందుత్వం భారత జాతీయవాదానికి విరుద్ధం కాదా? ఎందుకు ఓడిపోతున్నావని వారిని అడగాలి. చత్తీస్ గఢ్ ను ఎలా కోల్పోయారు? మధ్యప్రదేశ్ లో ఓడిపోయారు. రాజస్థాన్ ను కోల్పోయారు. యూపీలో 2014, 2017, 2019, 2022 ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ ఓడిపోయారు. అయినా, ఎందుకు ఓడిపోయావని వారిని అడగరు.

హిందుస్తాన్ టైమ్స్: ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వస్తున్నారని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఆ అంచనాతో మీరు ఏకీభవిస్తారా?

అసదుద్దీన్ ఓవైసీ: నేను ఎన్నికల ఫలితాలను అంచనా వేసే వాడిని కాదు. నేను జ్యోతిష్కుడినో, తత్వవేత్తనో కాదు. నేను రాజకీయ నాయకుడిని, నా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడతాను. ఉదాహరణకు 17 స్థానాలున్న తెలంగాణలో హైదరాబాద్ లో ఎంఐఎంకు ఓటేయాలని ఓటర్లను కోరాం. మిగిలిన 16 లోక్ సభ స్థానాల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చాం. మా అభ్యర్థులు లేదా మా కూటమి అభ్యర్థులు బరిలో ఉన్న చోట మాకు ఓటు వేయాలని కోరుతున్నాం. అలా లేని చోట బీజేపీని ఓడించాలని బహిరంగంగానే కోరుతున్నాం.

హిందుస్తాన్ టైమ్స్: ప్రధాని మోదీ ఇటీవల తన ప్రసంగాల్లో తీవ్రంగా ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతో మీరు ఆశ్చర్యపోయారా?

అసదుద్దీన్ ఓవైసీ: లేదు. నేను అస్సలు ఆశ్చర్యపోలేదు. ఆశ్చర్యపోను కూడా. ఎందుకంటే అది అతని ఒరిజినల్ డీఎన్ఏ. అదే ఆయన ఒరిజినల్ లాంగ్వేజ్. అదే అతని ఒరిజినాలిటీ. వారు ముస్లింలను ద్వేషిస్తారు. వారికి అదే అసలైన హిందుత్వ భావజాలం. 2002 నుంచి ప్రధాని ఇదే విషయాన్ని పదేపదే చెబుతూ వచ్చారు. దురదృష్టవశాత్తూ వాటివల్ల రెండుసార్లు ప్రధాని కూడా అయ్యారు. ఏది ఏమైనా ఇప్పుడు ప్రజలు డిసైడ్ అయ్యారు. దాంతో, వాళ్లు మళ్లీ వారి ఒరిజినల్ ఎజెండాను తెరపైకి తెచ్చారు. ముస్లింలపై విషం చిమ్మడం, విభేదాలు సృష్టించడం, ముస్లింలపై అనుమానం కలిగించడం, ముస్లిం మహిళలు ఎక్కువ మంది పిల్లలకు జన్మనిస్తారనే అబద్ధపు ప్రచారం కల్పించడం.. వంటి తన అసలు ఎజెండాను ముందుకు తెచ్చారు. అవన్నీ అవాస్తవాలు. వారు ఇప్పుడు జీ20, చంద్రయాన్, 5 ట్రిలియన్ ఎకానమీ, పర్మినెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ సీటు, విశ్వగురు, వికసిత్ భారత్... వంటి నినాదాలను ఇప్పుడు చెత్త బుట్టలో వేశారు. తాము ఎక్కడి నుంచి మొదలయ్యామో.. అక్కడికి, ఆ ఎజెండా వద్దకు వారు తిరిగి వచ్చారు. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది.

హిందుస్తాన్ టైమ్స్: మోదీ తర్వాత బీజేపీ గురించి ఆలోచించారా? ఆయన వయసు 73 ఏళ్లు. ఆయన వారసుడు ఎవరు అనుకుంటున్నారు?

అసదుద్దీన్ ఓవైసీ: అంటే 75 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత మోదీ వెళ్లిపోతారని మీరు అనుకుంటున్నారా? నేను అలా అనుకోవడం లేదు. మోదీ అలా వెళ్లరు. మోదీని రాజకీయంగా ఓడించాలి. ఇదీ నా ఆలోచన.

హిందుస్తాన్ టైమ్స్: కొన్నేళ్ల క్రితం రాహుల్ గాంధీని ఈ ప్రశ్న అడిగారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాని గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా అనిపించవచ్చు ... భారతదేశానికి ఎప్పుడు ఒక ముస్లిం ప్రధానమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు?

అసదుద్దీన్ ఓవైసీ: ఇన్షాఅల్లాహ్, ఒకవేళ అదే జరిగితే, భారతదేశానికి ప్రధాని అయ్యే తొలి ముస్లిం.. హిజాబ్ ధరించిన ఒక మహిళ అయి ఉండాలని నేను కోరుకుంటున్నాను. హిజాబ్ ధరించిన ఒక ముస్లిం మహిళ ఈ గొప్ప దేశానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్నాను. బహుశా ఆ రోజు నేను జీవించి ఉండకపోవచ్చు, కానీ అది దేవుడి దయ వల్ల కచ్చితంగా జరుగుతుంది.

WhatsApp channel